హక్కుపత్రం ఏదీ?

ABN , First Publish Date - 2022-01-24T05:13:18+05:30 IST

‘ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఎన్నాళ్ళైనా పర్వాలేదు. పది నుంచి ఇరవై వేలు కడితే ఇక అంతా మీ సొంతం.

హక్కుపత్రం ఏదీ?

ఓటీఎస్‌పై లబ్ధిదారుల ఆగ్రహం
ఎక్కడికక్కడ వలంటీర్లను నిలదీత
వేల మందికి అందని హక్కు పత్రాలు
డబ్బు కట్టించుకుని ఇదేంటంటూ మండిపాటు
ముఖం చాటేస్తున్న కార్యదర్శులు
ఇప్పటికే సొమ్ములు కట్టిన లక్షా 11 వేల మంది
జగనన్న సంపూర్ణ హక్కు పత్రాల జారీపై మౌనం


(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
‘ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఎన్నాళ్ళైనా పర్వాలేదు. పది నుంచి ఇరవై వేలు కడితే ఇక అంతా మీ సొంతం. యంత్రాంగమే కదిలొచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించి ఎంచక్కా సంపూర్ణ హక్కులతో కలిగిన పత్రం మీ చేతికి ఇస్తారు. ఇదొక సువర్ణ అవకాశం..’’ అంటూ గడిచిన మూడు నెలలుగా ఓటీఎస్‌పై సర్కారు ఊదరగొట్టేసింది. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు, వలంటీర్ల  నుంచి కార్యదర్శి వరకు అందరి నోటా ఇదే మాట.. దీనికోసం పేదలపై ఒత్తిడి చేశారు.. కాదూ కూడదంటే బెదిరించారు. దీంతో చాలామంది అప్పోసొప్పో చేసి వేలకు వేలు కట్టారు. ఇప్పుడు భూహక్కు పత్రం కోసం సచివా లయాలు, గ్రామ కార్యదర్శుల చుట్టూ తిరుగుతున్నా అందరి నోట మౌనమే.. త్వరలో ఇచ్చేస్తారంటూ మొక్కుబడి సమాధానం.


ఇంతకీ అసలేం జరుగుతోంది


జగనన్న భూహక్కు పథకం కింద నాలుగు దశాబ్దాల క్రితం నుంచి ఈ మధ్యన నిర్మించిన లబ్దిదారులైన పేదల నుంచి అంతో ఇంతో వసూలు చేసి ఖజానా నింపుకు నేందుకు ప్రభుత్వం సాహసించింది. ఆ మేరకు జిల్లాల వారీగా లెక్కలు కట్టి యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. గడిచిన వంద రోజులుగా ఎడాపెడా బాదుడు. ఎప్పుడో ఎన్‌టీఆర్‌ హయాంలో నిర్మించిన ఇళ్ళకు ఇప్పుడు పది వేలు కడితే చాలు యజమాని హక్కు పత్రం లభిస్తుం దంటూ తెగ హడావుడి చేశారు. అప్పుడు ఇచ్చిన స్థలం, ఇల్లు ఇప్పుడు బంగారం అయ్యిందని, లక్షలు విలువ చేస్తుందని నమ్మ బలికారు. కాగితం, పత్రం లేకుండా ఎన్నాళ్ళిలా.. ఎంచక్కా మేమే రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం, పక్కా పత్రం మీ చేతికి అందిస్తామంటూ ఆశలు పెంచారు. తెల్లవారింది చాలు వలంటీరు, కార్యదర్శి, పంచాయతీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల ఇంటి వద్ద ప్రత్యక్షమై ఒత్తిళ్ళు.. ఇవన్నీ భరించలేక అప్పైనా చేసి సర్కారుకు సమర్పించారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా మొత్తం 2 లక్షల 93 వేల మంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పరిధిలోకి తెచ్చారు. వీటిలో దాదాపు 2 లక్షల 47 వేల మంది వివరాలను ట్యాగింగ్‌ పూర్తి చేశారు. మరో 46 వేల మందికి పూర్తి  కావాల్సి ఉంది. అలాగే  ఎవరికి అర్హత ఉందో, లేదో తేల్చేందుకు వీలుగా  మరో 2 లక్షల 22 వేల మంది వివరాలను డేటా ఎంట్రీలో చేర్చారు.


 పత్రం కోసం ప్రదక్షిణలు


అష్టకష్టాలు పడి ప్రభుత్వం చెప్పినట్టుగా సొమ్ములు  కట్టిన లబ్ధిదారులకు సంపూర్ణ భూహక్కు పత్రం చేతికి వచ్చిందా అంటే అదీ లేదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఓటీఎస్‌ పథకాన్ని లాంచనంగా గత నెలాఖరున తణుకులో ఆరంభించారు. అప్పట్లో కొందరికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయించిన భూ పత్రాలను ఇచ్చారు. ఆ తరువాత పత్రాలు అందుకున్నవారే లేరు. జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 51 వేల మంది సొమ్ము చెల్లించాలని తొలి లక్ష్యంగా తీసుకుంటే వీరిలో లక్షా 11 వేల మంది అంతో ఇంతో సర్కారుకు ముట్ట చెప్పారు. ఇంకా మరో 21 వేల మంది ఇంకా చెల్లించాల్సిన పెండింగ్‌ జాబితాలోనే ఉన్నారు. వీరిలో 10 వేల నుంచి 20 వేల వరకు చెల్లించిన వారి సంఖ్య దాదాపు 15 వేల మందికిపైగా ఉన్నారు. అయితే పది రూపాయలు చెల్లించి హక్కు పత్రం పొందేందుకు 25 వేల మంది రంగంలో నిలిచారు. కానీ వీరిలో ఏ ఒక్కరికి పత్రం గిత్రం లేకుండా పోయింది. ఇదే విషయంపై ఇప్పుడు సచివాలయాల చుట్టూ వందల మంది తిరుగుతున్నారు. వలంటీర్లను ఎక్కడికక్కడ నిలదీయడం ఆరంభించారు. ‘వేలు కట్టమని మీరు ఒత్తిడి చేస్తేనే అప్పో సొప్పో చేసి కట్టాం. ఇస్తామన్న కాగితం ఏమైంది. ఇవాళ, రేపు అంటూ ఎందుకు తిప్పించుకుంటున్నారు. ఎన్నాళ్ళు మీ చుట్టూ తిరగాలి..ఏదొకటి తేల్చండి’ అంటూ లబ్ధిదారులు నేరుగా వలంటీర్లను నిలదీయడం ప్రారంభించారు. దీంతో కొంత మంది వలంటీర్లు, కార్యదర్శులైతే లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక మొఖం చాటేస్తున్నారు. ఒక్క భీమవరం నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ కొందరికి మాత్రమే జగనన్న సంపూర్ణ భూహక్కు పత్రాలను డిసెంబర్‌లోనే అందించారు. సర్కారుకు ఓటీఎస్‌ ద్వారా దాదాపు 50 కోట్లకుపైగా ఆదాయం లభిం చాల్సి ఉండగా, ఇప్పటిదాకా 16 కోట్లు ఖజానాకు చేరాయి. ఇంకోవైపు పూర్తి స్థాయి ఓటిఎస్‌ జరిగి తీరాలంటూ సర్పంచ్‌లు, వలంటీర్లపై ఇంకా ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఒకవైపు లబ్ధిదారులకు అధికారికంగా ఇవ్వాల్సిన హక్కు పత్రం గాలికొదిలేసి ఇంకోవైపు ఇంకా వసూళ్లంటూ ఎగబడుతున్నారు.



Updated Date - 2022-01-24T05:13:18+05:30 IST