కొనుగోళ్లపై నిఘా కరువు!

ABN , First Publish Date - 2021-10-23T05:26:27+05:30 IST

ఈ వానాకాలం సీజన్‌ పంటకు సంబంధించిన వరి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 396 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవడంతో మరో వారంలో కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించనున్నారు. గత సీజన్‌లో చేపట్టిన కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి.

కొనుగోళ్లపై నిఘా కరువు!

గత సీజన్‌లో భారీగా అక్రమాలు!

ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో కుమ్మక్కు

సివిల్‌ సప్లయ్‌ అధికారులపై ఆరోపణల వెల్లువ

ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం

6 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 22 : ఈ వానాకాలం సీజన్‌ పంటకు సంబంధించిన వరి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 396 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలవడంతో మరో వారంలో కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించనున్నారు. గత సీజన్‌లో చేపట్టిన కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. 

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారుగా 6 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి రావచ్చని జిల్లా వ్యవసాయాధికారుల అంచనా. జిల్లాలోని మార్కెట్లు, పీఏసీఎస్‌ సొసైటీలతో పాటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ధాన్యాన్ని సేకరించనున్నారు. 


తట్టిలేపిన చేర్యాల ఘటన

చేర్యాల పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేయకున్నా కొనుగోలు చేసినట్లుగా నకిలీ ట్రక్‌షీట్లు సృష్టించి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. పీఏసీఎస్‌, ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారు. కొందరు పీఏసీఎస్‌ డైరెక్టర్లు గుర్తించడంతో బయట పడిందే తప్ప లేకుంటే సర్కారు సొమ్ము అక్రమార్కుల వశమయ్యేది.  కడవేర్గు, పోచంపల్లి, చుంచనకోట, వేచరేణి, మరిముస్త్యాల, దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామాల్లో చేపట్టిన కొనుగోళ్లపైనా విచారణ చేపట్టారు. ఈ విచారణలోనూ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఈ బాగోతంలో సుమారుగా రూ.6 కోట్ల వరకు మోసం చేసినట్లు తెలిసింది. 42 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇంకా కొందరి పాత్రపై ఆరా తీస్తున్నారు. 


అధికారులపైనా ఆరోపణలు

రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించి.. వారికి డబ్బు ముట్టేదాకా పర్యవేక్షించాల్సిన అధికారులే అక్రమాలకు సహకరిస్తున్నారు. వీరి అక్రమాలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. చేర్యాల, కొమురవెల్లి మండలాల ఏపీఎంలు, సీసీలు, ఐదుగురు సీఏలను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పౌరసరఫరా శాఖలో ఉన్న అధికారులపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లకు సహకరించడం వల్లే ఈ అక్రమాలు జరిగాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 


ఆగని దోపిడీ

పంట దిగుబడితో కేంద్రాలకు వచ్చిన రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాలు, సంచి, నాణ్యత పేరిట కోతలు పెడుతూనే ఉన్నారు. ఇతర ఖర్చులు అంటూ ధాన్యంలో తరుగు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ పోగా మిల్లుకు తరలించే ధాన్యంలోనూ కిలోల కొద్ది దోపిడీ.. ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించేవారు. ఈ ఫలితంగానే ధాన్యం కొనుగోలు చేయకున్నా.. కొనుగోలు చేసినట్లుగా అక్రమాలు జరిగాయి. సరైన పర్యవేక్షణ ఉంటే ఈ బాగోతం జరిగేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈసారైనా ప్రతీ కొనుగోలు కేంద్రంలో మరో శాఖకు చెందిన ఒక అధికారిని పర్యవేక్షణకు నియమిస్తే అక్రమాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో పర్యవేక్షణ, అధికారులపై ఆరోపణలు, ఇతర ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హరీశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. 


ఏ మిల్లుకు తరలిస్తారు ? ఎవరు పర్యవేక్షిస్తారు?

చేర్యాల, అక్టోబరు 22 : చేర్యాల, కొమురవెల్లిలో ధాన్యం కొనుగోలు అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో గందరగోళం నెలకొన్నది. ప్రస్తుతం నాలుగు రైస్‌మిల్లులకు తాళాలు ఉండడంతో కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడికి తరలిస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్లను పర్యవేక్షించే వారు ఎవరు..? అని సందేహం వ్యక్తమవుతున్నది. అక్రమ దందాలో పీఏసీఎస్‌ చైర్మన్‌ జైలుకెళ్లగా, సీఈవో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఐకేపీకి సంబంధించి రెండు మండలాల ఏపీఎంలు, ముగ్గురు సీసీలు, ఆరుగురు సీఏలను సస్పెండ్‌ చేశారు. రైస్‌మిల్లుల యజమానులు, మిల్లు గుమస్తాలు, ఐకేపీ, పీఏసీఎస్‌   సిబ్బందిపై కేసులు నమోదైన క్రమంలో ఈ సారి పర్యవేక్షణ ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలోనూ అవకతవకలు జరిగాయని తేలడంతో అక్కడి సిబ్బందిపైనా వేటు వేశారు. ఇంకా కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సైతం సమగ్ర విచారణ జరపాలని పట్టు వీడకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నెల 27న రైతుదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.


ఏ మిల్లుకు పంపుతారు ?

కొన్ని సీజన్‌లుగా చేర్యాల, కొమురవెల్లి, ధూల్మిట్ట, మద్దూరు మండలాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని చేర్యాలకు చెందిన సాంబశివ, రామలింగేశ్వర, రేణుకా, లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్‌ పారాబాయిల్డ్‌ మిల్లులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం మిల్లు నిర్వాహకులు, భాగస్వాములు పరారీలో ఉండటం, ఆయా మిల్లుల్లో ధాన్యం సీజ్‌ చేయడంతో తిరిగి వారికే కేటాయిస్తారా లేదా ఇతర మిల్లులకు తరలిస్తారా తెలియడం లేదు. సమీప మండలాల మిల్లులకు తరలిస్తే ఏం జరుగుతుందోనని, అధికారులు ఎలా పర్యవేక్షిస్తారన్న సందేహాలు నెలకొన్నాయి. కట్టుదిట్ట చర్యలు తీసుకోకుంటే రైతులు దళారులను ఆశ్రయించి మోసపోయే ప్రమాదం ఉంది.


పలువురి బ్యాంకు ఖాతాలు అన్‌ఫ్రీజ్‌ !

పీఏసీఎస్‌, ఐకేపీ ధాన్యం కొనుగోలు అవినీతి బాగోతానికి సంబంధించి సుమారు 80 మంది బినామీ వ్యక్తులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలను కొద్దిరోజుల క్రితం ఫ్రీజ్‌ చేశారు. అవినీతి బాగోతానికి సహకరించారని డీసీఎ్‌సవోపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రికవరీపై దృష్టిసారించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం పలువురు బ్యాంకు ఖాతాలను అన్‌-ఫ్రీజ్‌ చేయించారు. ఎవరి ఖాతాలలో ధాన్యం డబ్బు ఎంత జమయ్యాయో అంత మొత్తాన్ని తిరిగి జమచేయాలని డీసీఎ్‌సవో సూచిస్తున్నారు. దీంతో ఇప్పటికే మిల్లర్‌కు తాము డబ్బు అందించామని, ప్రస్తుతం తిరిగి ఎలా చెల్లించేదని కొందరు పేర్కొంటుండగా, మరికొందరు ఏకమొత్తంలో జమ చేస్తే ఏమవుతుందోనని అయోమయం చెందుతున్నారు. ఇక మిగతా బ్యాంకు ఖాతాదారులు తామెలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-10-23T05:26:27+05:30 IST