స్వర్ణాప్యాలెస్‌ ఘటన.. అసలేం జరిగింది?

ABN , First Publish Date - 2020-08-11T09:23:44+05:30 IST

స్వర్ణాప్యాలె్‌సలోని పెయిడ్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద దుర్ఘటనపై..

స్వర్ణాప్యాలెస్‌ ఘటన.. అసలేం జరిగింది?

స్వర్ణాప్యాలెస్‌ ఘటనపై ఫైవ్‌మెన్‌ కమిటీ విచారణ ప్రారంభం 

అణువణువూ జల్లెడ పట్టిన బృందం

ఉదయం సీఎంఓ కార్యాలయానికి పయనం

మధ్యాహ్నం కలెక్టర్‌తో భేటీ.. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన

ప్రమాదానికి కారణం, నిబంధనల అమలుపై ప్రధానంగా ఫోకస్

నేటి సాయంత్రానికి నివేదిక

ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): స్వర్ణాప్యాలె్‌సలోని పెయిడ్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద దుర్ఘటనపై కలెక్టర్‌ నియమించిన ఫైవ్‌మెన్‌ కమిటీ సోమవారం విచారణ ప్రారంభించింది. జాయింట్‌ కలెక్టర్‌ - 2 ఎల్‌ శివశంకర్‌ నేతృత్వంలోని ఫైవ్‌మెన్‌ కమిటీ ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా విభిన్న అంశాల్లో విచారించింది. ఉదయం సీఎం కార్యాలయానికి వెళ్లిన కమిటీ తర్వాత కలెక్టర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధ్యయనానికి ఘటనా ప్రదేశానికి వెళ్లారు.


తొలిరోజు అగ్నిప్రమాద ఘటన, నిబంధనలకు సంబంధించిన వాటిపై లోతుగా అధ్యయనం చేశారు. దీనిపై తాత్కాలికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. మంగళవారం కూడా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్థారణకు రానున్నట్లు తెలుస్తోంది. తొలుత అసలు అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి మూల కారణం ఏమై ఉంటుందా? అని స్వర్ణాప్యాలె్‌సలోని ఫ్లోర్లన్నీ పరిశీలించారు. సీపీడీసీఎల్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ కూడా ఎలక్ర్టికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కోణంలోనూ, కార్పొరేషన్‌ సీఎంఓహెచ్‌ గీతాబాయ్‌ శానిటైజింగ్‌ అంశానికి సంబంధించి ప్రమాదం జరిగిందా! అన్న కోణంలో దర్యాప్తు సాగించారు.


కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌గా ఉన్న స్వర్ణాప్యాలె్‌సలో సంరక్షణా చర్యలు ఉన్నాయా? నిబంధనలు అతిక్రమించారా? అన్న దిశగా విచారించారు. తర్వాత జేసీ - 2 శివశంకర్‌, బృంద సభ్యుడు సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర ప్రైవేటు హాస్పిటల్స్‌కు ఇచ్చిన మార్గదర్శకాల అంశాలపైనా దృష్టి సారించారు. రమేశ్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం పెయిడ్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు? అనుమతులిచ్చే క్రమంలో హాస్పిటల్‌ యాజమాన్యానికి జిల్లా యంత్రాంగం నిర్దేశించిన మార్గదర్శకాలేమిటి? అందుకు అనుగుణంగానే సదుపాయాలను కల్పించారా? నిబంధనలన్నీ పాటించారా? వాటిని పరిశీలించాకే జిల్లా యంత్రాంగం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా? లేక అనుమతి ఇవ్వక ముందుగానే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించిందా? అన్నఅంశాలను కమిటీ బృందం లోతుగా విశ్లేషిస్తోంది.


వీటితో పాటు ఎక్స్‌ టెన్షన్‌ సెంటర్‌లో రమేశ్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం కొవిడ్‌ బాధితులను ఎలా అడ్మిట్‌ చేసుకుంది. స్కానింగ్‌ రిపోర్టుతో చేర్చుకున్నారా? ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వ హించి పాజిటివ్‌గా నిర్థారించాకే అడ్మిట్‌ చేసుకు న్నారా? అన్న అంశాలపైనా దృష్టి సారించారు. మృతుల్లో 8 మందికి నెగిటివ్‌ తేలటంపైనా దృష్టి సారించింది. బాధితులు ఎప్పుడు అడ్మిట్‌ అయ్యారు? ట్రీట్‌మెంట్‌ ప్రాతిపదికన వారికి నయమైందా? నెగిటివ్‌ వస్తే ఎందుకు డిశ్చార్జి చేయలేదు? స్వాబ్‌ కలెక్షన్స్‌ తీయించారా..లేదా? అన్న కోణంలోనూ విచారించింది.


ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల ప్రాతిపదికగానే హాస్పిటల్స్‌ యాజమాన్యం సేవలు అందిస్తుందా? అన్న కోణంలోనూ కమిటీ దర్యాప్తు చేసింది. ఈక్రమంలో కమిటీ కొంత గందరగోళానికి గురైనట్టు సమాచారం. పెయిడ్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ సేవలు ప్రత్యేకమా? అని భావించినట్టు తెలిసింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ప్యాకేజీని నిర్ణయించినందున పెయిడ్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పేరుతో అధిక ఫీజుల వసూలుకు అవకాశం లేదని, నిబంధనలు అందుకు అనుగుణంగా లేవని గుర్తించినట్టు సమాచారం.


ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ప్రకారం మాత్రమే చికిత్సలు అందించాలి కాబట్టి కొవిడ్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కింద దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేసినట్టు హాస్పిటల్‌ యాజమాన్యం సంతకాలు చేయించుకుందా? అన్న అంశాలపైనా దృష్టి సారించింది. రమేశ్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేసిందా అన్న కోణంలోనూ బాధిత కుటుంబ సభ్యులతోనూ మాట్లాడనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో నగర సీపీ బత్తిన శ్రీనివాస్‌, అగ్నిమాపక శాఖ అధికార బృందం పరిశీలనలో పాలు పంచుకుంది. తర్వాత కమిటీ రమేశ్‌ హాస్పిటల్‌కు వెళ్లి విచారణ చేసింది. మంగళవారం కూడా లోతుగా దర్యాప్తు చేసి సాయంత్రానికి కలెక్టర్‌ ఇంతియాజ్‌కు నివేదిక సమర్పించనుంది. దీన్ని కలెక్టర్‌ ప్రభుత్వానికి అందించనున్నారు. దీని ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 


మూడు అంశాలపై విచారిస్తున్నాం: మీడియాతో ఫైవ్‌మెన్‌ కమిటీ ఇన్‌చార్జి శివశంకర్‌

హోటల్‌లో నడుస్తున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించి విచారణ చేసున్నా మని ఫైవ్‌మెన్‌ కమిటీకి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జేసీ-2 ఎల్‌ శివశంకర్‌ అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సందర్భంలో ఈ బృందం మీడియాతో మాట్లాడింది. జేసీ-2 శివశంకర్‌ మాట్లాడుతూ హోటల్‌లో రక్షణ చర్యలు ఉన్నాయా.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారా అన్న అంశంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించారా.. లేదా అన్న అంశాలపై దృష్టిపెట్టామన్నారు. ప్రమాదానికి మూల కారణమేమిటన్నది పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వ అనుమతుల మేరకే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారా? అధిక ఫీజులు వసూలు చేస్తున్నారా? అన్న కోణంలోనూ వివరాలు రాబ డుతున్నామని, ఘటనకు సంబంధించి ఒక అంచ నాకు వచ్చామని, మరింత లోతుగా అధ్యయనం జరిపాకే కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని చెప్పారు.

Updated Date - 2020-08-11T09:23:44+05:30 IST