కోవిడ్-19: సహాయక సామగ్రిని రిటైల్ షాపుల్లో అమ్ముకున్న పాక్ అధికారులు

ABN , First Publish Date - 2020-04-03T00:19:37+05:30 IST

కోవిడ్-19 సంక్షోభం మధ్య మానవత్వాన్ని చాటుకోవాల్సింది పోయి పాకిస్తాన్ అధికారులు దారుణంగా ప్రవర్తిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది....

కోవిడ్-19: సహాయక సామగ్రిని రిటైల్ షాపుల్లో అమ్ముకున్న పాక్ అధికారులు

మిర్పూర్: కోవిడ్-19 సంక్షోభం మధ్య మానవత్వాన్ని చాటుకోవాల్సింది పోయి పాకిస్తాన్ అధికారులు దారుణంగా ప్రవర్తిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకోసం పంపిణీ చేయాల్సిన సహాయక సామగ్రిని అధికారులు రిటైల్ షాపుల్లో అమ్ముకుంటున్నట్టు స్థానికులు ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని మిర్పూర్‌లో చోటుచేసుకుందీ దారుణం. దీనిపై స్థానికుడొకరు మీడియాతో మాట్లాడుతూ... ‘‘అధికారులు ప్రతిరోజూ మమ్మల్ని రెండు గంటలకు పైగా నిలబెడుతున్నారు. ఈ విషయాన్ని మేము తహశీల్‌కు దృష్టికి తీసుకెళ్తే.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చి చెబుతానంటూ వెళ్లిపోయారు. అనంతరం ఓ రిటైల్ షాపు దగ్గరికి లారీలో గోధుమపిండి వస్తుందంటూ చెప్పారు. అదీ జరగలేదు. జిల్లా కలెక్టర్ వచ్చి మా పేర్లు, మొబైల్ నంబర్లు రాసుకుంటారనీ.. సరుకుల లారీ వచ్చాక మాకు సమాచారం ఇస్తారని అధికారులు చెప్పారు. అది కూడా అబద్ధమని తేలిపోయింది. చౌక ధరల దుకాణాలు కూడా మాకు గోధుమ పిండి అమ్మడం లేదు. అడిగిన ప్రతిసారీ ఏదో ఒకటి చెబుతూ మమ్మల్ని మోసం చేస్తున్నారు..’’ అని వాపోయాడు. 


లాక్‌డౌన్‌తో సమయం లేనందునే నేరుగా రిటైల్ షాపులకు సహాయక సామగ్రిని తరలిస్తున్నామని ఓ అధికారి పేర్కొనగా.. అక్కడే ఉన్న స్థానికుడొకరు కల్పించుకుంటూ.. ‘‘మాకు కనీసం గోధుమ పిండైనా దక్కనివ్వండి ప్లీజ్..’’ అని వేడుకోవడం గమనార్హం. కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక సహాయక కార్యక్రమాలు చేపడుతుండగా.. పాకిస్తాన్ మాత్రం తన ప్రజలకు కనీసం వసతులు కల్పించేందుకే ఆపసోపాలు పడుతోంది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్రాలను సమన్వయం చేయడంలో ఇమ్రాన్ సర్కారు విఫలం కావడం వల్లే కోవిడ్-19 కేసులు అమాంతం పెరిగిపోతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 2238 మంది కరోనా బారిన పడగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-04-03T00:19:37+05:30 IST