పారిపోకపోతే పట్టుకొని చంపేస్తున్నారు.. ఆఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ అధికారి ఆవేదన

ABN , First Publish Date - 2021-08-17T16:17:38+05:30 IST

అమెరికా దళాలు ఆఫ్ఘానిస్థాన్‌ను వీడిన పది రోజుల్లోనే ఆ దేశం తలరాత మారిపోయింది. తుపాకులు చేతబట్టిన తాలిబన్లు ఆ దేశంపై జెండా ఎగరేశారు.

పారిపోకపోతే పట్టుకొని చంపేస్తున్నారు.. ఆఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ అధికారి ఆవేదన

న్యూఢిల్లీ: అమెరికా దళాలు ఆఫ్ఘానిస్థాన్‌ను వీడిన పది రోజుల్లోనే ఆ దేశం తలరాత మారిపోయింది. తుపాకులు చేతబట్టిన తాలిబన్లు ఆ దేశంపై జెండా ఎగరేశారు. ఈ క్రమంలో కాబూల్ నుంచి ఢిల్లీ వచ్చిన చివరి ఎయిరిండియా విమానంలో ఇక్కడకు అనేకమంది ఆఫ్ఘాన్ అధికారులు పారిపోయి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఆసిఫ్ అనే అధికారి కూడా ఉన్నాడు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ (ఎన్‌డీఎస్)లో పనిచేసిన అతను.. తన స్వదేశంలో పరిస్థితిని వివరించాడు. తానే కాదని, తనలాంటి ఎంతోమంది అధికారులు భారత్‌, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ తదితర దేశాలకు పారిపోయారని చెప్పాడు.


‘‘అలా పారిపోయి ఉండకపోతే, తాలిబన్లు నన్ను చంపేసే వాళ్లు’’ అంటున్న ఆసిఫ్.. ప్రస్తుతం ఢిల్లీలో రోజుకు రూ.500 చెల్లిస్తూ ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. రోజూ కనీసం ఆహారం కూడా ఉండటం లేదంటూ కన్నీటిపర్యంతం అవుతున్నాడు. తన కుటుంబాన్ని వెంట తెచ్చుకోలేకపోయానని, వారికి ఏం జరుగుతుందో అని భయమేస్తుందని వాపోతున్నాడు. ‘‘మా అమ్మ మంచంలో ఉంది. నా భార్య, 8 ఏళ్ల కుమారుడిని నా వెంట భారత్‌కు తీసుకురాలేకపోయా. వాళ్లకేమవుతుందో అని భయమేస్తోంది’’ అని ఆసిఫ్ అన్నాడు. ఇంతకుముందు తనలాంటి అధికారులందరికీ తాలిబన్ల నుంచి సూచనలు అందాయని, ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని వాళ్లు ఆదేశించారని ఆసిఫ్ వెల్లడించాడు. అలా చేయని కారణంగా తమను చంపేసే ప్రమాదముందని అన్నాడు.


తాలిబన్ల విషయంలో పాకిస్తాన్ తమకు ద్రోహం చేసిందని ఆసిఫ్ మండిపడ్డాడు. ఆఫ్ఘాన్‌లో తాలిబన్లు విజయం సాధించినట్లు ప్రకటించగానే.. ఆఫ్ఘానిస్థాన్ దేశం తన బానిస శృంఖలాలు తెంచుకుందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. దేశం విడిచి పారిపోయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న ఆసిఫ్.. ఎయిరిండియా విమానం ఎక్కే సమయంలో అధికారిక దుస్తులు కాకుండా, సామాన్యుల్లా వేషం మార్చుకున్నట్లు చెప్పాడు. నెలరోజుల క్రితమే తనకు వీసా వచ్చిందని, పదిరోజుల క్రితం తాలిబన్లు తిరిగొస్తున్నట్లు సమాచారం అందిందని వివరించాడు. కాగా, కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ఆఫ్ఘాన్ నుంచి బయటకు వచ్చే దారులన్నీ మూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఇరుక్కుపోయిన భారతీయులను కాపాడేందుకు సిద్ధం చేసిన ఎయిరిండియా విమానం కూడా తన సర్వీసును రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Updated Date - 2021-08-17T16:17:38+05:30 IST