పాకిస్థాన్ విమాన ప్రమాదం.. వెల్లడైన మరో సంచలన విషయం

ABN , First Publish Date - 2020-05-24T03:15:32+05:30 IST

పాకిస్థాన్‌లో నిన్న (శుక్రవారం) జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి

పాకిస్థాన్ విమాన ప్రమాదం.. వెల్లడైన మరో సంచలన విషయం

కరాచీ: పాకిస్థాన్‌లో నిన్న (శుక్రవారం) జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయటపడిన ఇద్దరిలో ఒకరైన ముహమ్మద్ జుబైర్ మాట్లాడుతూ.. విమానం కూలిపోవడానికి ముందు మూడుసార్లు కుదుపులకు గురైందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఎయిర్ బస్ ఎ-320లోని 99 మంది ప్రయాణికుల్లో జుబైర్ ఒకడు. ఈ ప్రమాదంలో మొత్తం 97 మంది మరణించగా జుబైర్‌తోపాటు మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. 


జుబైర్ మాట్లాడుతూ.. ‘‘విమానం చాలా బాగానే వచ్చింది. నా సీటు 8ఎఫ్. విమానం జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటోంది. ‘మనం ల్యాండ్ కాబోతున్నాం. సీటు బెల్టులు ధరించండి’ అని పైలట్ ప్రకటించాడు. మేం బెల్టులు ధరించాం. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మూడుసార్లు కుదుపులకు గురైంది. విమానం రన్‌వేపైకి వచ్చింది. ఆ తర్వాత ఏమైందో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లాడు’’ అని జుబైర్ గుర్తు చేసుకున్నాడు. జుబైర్ ప్రస్తుతం కాలిన గాయాలతో కరాచీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


‘‘పైలట్ ఆ తర్వాత విమానాన్ని 10-15 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించాడు. ఆ తర్వాత విమానం ల్యాండ్ కాబోతున్నట్టు పైలట్ నుంచి మరోమారు ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. అప్పుడు నేను కిందికి చూశాను. మాలిర్ కంటోన్మెంట్ ప్రాంతం (విమానం ల్యాండ్ అయ్యే ప్రదేశం) కనిపించింది. ఇక ల్యాండ్ కావడమే ఆలస్యం.. విమానం ఒక్కసారిగా కుప్పకూలింది’’ అని జుబైర్ వివరించాడు. 


విమానం కరాచీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వణికిందని జుబైర్ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. ఆ వెంటనే విమానం క్రాష్ అయిందని, తాను స్పృహతప్పి పడిపోయానని చెప్పాడు. తనకు తెలివి వచ్చేసరికి చుట్టూ దట్టంగా పొగలు కమ్ముకుని ఉన్నాయని వివరించాడు. జుబైర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయని, ప్రస్తుతం కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన మరో వ్యక్తి జఫర్ మసూద్. బ్యాంక్  ఆఫ్ పంజాబ్ సీఈవో.  

Updated Date - 2020-05-24T03:15:32+05:30 IST