తమిళనాడు కోవిడ్-19 మూడో దశకు చేరే అవకాశం : సీఎం పళని స్వామి

ABN , First Publish Date - 2020-04-09T23:58:00+05:30 IST

మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు

తమిళనాడు కోవిడ్-19 మూడో దశకు చేరే అవకాశం : సీఎం పళని స్వామి

చెన్నై : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి గురువారం చెప్పారు. ప్రస్తుతం ఈ మహమ్మారి తమ రాష్ట్రంలో లోకల్ ట్రాన్స్‌మిషన్ దశలో ఉందన్నారు. ఇది మూడో దశకు అంటే సామాజిక వ్యాప్తివైపు వెళ్ళే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం దీనిని నియంత్రించేందుకు చురుగ్గా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 


తమిళనాడు సచివాలయంలో గురువారం పళని స్వామి అధ్యక్షతన ఐఏఎస్ అధికారులతో కూడిన 12 సమన్వయ బృందాలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోవిడ్-19ను రెండో దశ (లోకల్ ట్రాన్స్‌మిషన్)లోనే కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


ప్రస్తుతం అమలవుతున్న అష్ట దిగ్బంధనాన్ని ఏప్రిల్ 14 తర్వాత పొడిగిస్తారా? అని విలేకర్లు అడిగినపుడు పళని స్వామి మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తీవ్రతనుబట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోందన్నారు.  ఐఏఎస్ అధికారులతో కూడిన 12 సమన్వయ బృందాలు, 19 మంది వైద్య నిపుణుల బృందం ఇచ్చే నివేదికల ఆధారంగా అష్ట దిగ్బంధనం పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


నిత్యావసర వస్తువుల కోసం మినహా బయటికి రావద్దని ప్రజలను కోరారు. ఒక వారంపాటు సరిపోయే సరుకులను కొనుక్కోవాలని సూచించారు. 


Updated Date - 2020-04-09T23:58:00+05:30 IST