Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్కు స్థలంలో ‘పక్కా స్కెచ్‌’!

మచిలీపట్నంలో ఆక్రమణల పర్వం 

మంత్రి పేర్నినాని వార్డులోనే ఆక్రమణ

ఆక్రమణదారు 10వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త  

చూసీచూడనట్టు కార్పొరేషన్‌ అధికారులు


మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో వైసీపీ నాయకుల భూదందాకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. భార్యకు పదవి ఉన్న కాలంలోనే ఎంతో కొంత కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్న 10వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త ఈ ఆక్రమణల పర్వానికి తెరతీశాడు. నోబుల్‌ కాలనీ వద్ద అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించాడు. ఆ భూమి చుట్టూ పరదాలు కట్టేశాడు. లోపల ఏమి జరుగుతుందో పరిసర ప్రాంతవాసులు తెలుసుకునేలోపే పిల్లర్లు కూడా పైకి లేశాయి.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం 13వ డివిజన్లో మంత్రి పేర్ని నాని నివాసం ఉండే ప్రాంతంలోనే ఆక్రమణల దందా సాగుతోంది. 10వ డివిజన్‌ వైసీపీ కార్పొరేటర్‌ భర్త ఇక్కడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ భూమిని ఆక్రమించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులకు తెలియకుండా, వారి అనుమతులు లేకుండా ఇంత బహిరంగంగా స్థలాన్ని ఆక్రమించడం, నిర్మాణ పనులను ప్రారంభించడం అంత సులువు కాదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థలాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి తాను ఈ భూమిని కొనుగోలు చేశానని చెబుతున్నాడు. పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ఎవరు విక్రయించారు? ఇందులో ఎంతమంది అధికారపార్టీ నాయకుల ప్రమేయం ఉంది? అనే అంశాలపై చర్చ నడుస్తోంది.  


పార్కు స్థలంలో ఆక్రమణ 

మచిలీపట్నం నోబుల్‌ కాలనీవాసులో పార్కును అభివృద్ధి చేసేందుకు 1968వ సంవత్సరంలో 56/68 నెంబరుతో కొంత భూమిని అప్పటి  టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కేటాయించారు. పురపాలకసంఘం రికార్డుల్లో కూడా ఇది నమోదై ఉంది. 1968వ సంవత్సరం నుంచినోబుల్‌ కాలనీలో ఈ స్థలం ఖాళీగానే ఉంటున్నా ఎవ్వరూ ఆక్రమించే ప్రయత్నాలు చేయలేదు. కొంతకాలం క్రితం ఈ స్థలంపై 10వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త కన్నుపడింది. పెద్దఎత్తున కంకర, ఇసుక, సిమెంటు ఇటుకలు దింపి, భవన నిర్మాణ పనులను ప్రారంభించాడు.  అంతటితో ఆగక, పక్కనే ఉన్న ఖాళీస్థలంలోనూ బుధవారం మొక్కలు కొట్టించడం కాలనీలో చర్చనీయాంశంగా మారింది. పేదలు ఎవరైనా ఖాళీస్థలంలో గుడిసె వేసుకుంటే హుటాహుటిన తొలగించే కార్పొరేషన్‌ అధికారులు  బుధవారం ఈ  స్థలం వద్దకు వెళ్లి, కొలతలు కొలుచుకుని వెళ్లారు. ఆక్రమిత స్థలం చుట్టూ ఉన్న పరదాలను కూడా తొలగించకపోవడంతో ఇందులో ఏదో మతలబు దాగి ఉన్నదని కాలనీవాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.


పనులు నిలిపివేయమన్నాం

నోబుల్‌ కాలనీలోని పార్కు స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను కార్పొరేషన్‌ అధికారులు బుధవారం పరిశీలించారు. ఆ స్థలంలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదు. అక్కడ పనులు నిలిపివేయాలని చెప్పాం. పార్కుస్థలంలో ఎలాంటి కట్టడాలు జరగనివ్వం.  - శివరామకృష్ణ, నగర కమిషనర్‌

Advertisement
Advertisement