సారూ... మార్చాలి వారి తీరు!

ABN , First Publish Date - 2020-08-12T10:15:12+05:30 IST

జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది.

సారూ... మార్చాలి వారి తీరు!

ఐటీడీఏలో పాలన గాడిలో పడేనా..!

ఎవరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి

పేరుకే పరిమితమైన ఉద్యానశాఖ

వ్యవసాయశాఖకు అధికారి కరువు

ఇంజినీరింగ్‌శాఖ ఈఈ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి

 నేడు ఇన్‌చార్జి పీవోగా విధేఖరే బాధ్యతలు స్వీకరణ


( పార్వతీపురం ): జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఇది ఎప్పుడు మెరుగవుతుందో తెలియని పరిస్థితి. ప్రశ్నించే అధికారి లేకపోవడంతో ఐటీడీఏలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఎప్పుడు విధులకు వస్తారో.. ఎప్పుడు కార్యాలయాల నుంచి వెళ్లిపోతారో తెలియని పరిస్థితి ఉంది. గిరిజన రైతులకు ప్రధాన జీవనాధారం జీడి పంట. ఈ ఏడాది జీడికి తెగుళ్లు సోకడంతో గిరిజన రైతులు ఆర్థికంగా బాగా నష్టపోయారు. వీరికి నష్ట పరిహారం అందించే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియదు. గిరిజనులు ఉద్యానశాఖ సిబ్బంది చుట్టూ రోజూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే గిరిజన రైతులకు ఉద్యానశాఖ అందిస్తున్న సేవలు ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. ఏరూపంలోనూ వారికి సాయ పడడం లేదు. వ్యవసాయశాఖ తీరు మరీ అధ్వానం. వ్యవసాయశాఖ అధికారి పోస్టు చాలా రోజులుగా ఖాళీగా ఉంది. దీంతో పట్టించుకునే వారే లేకపోతున్నారు. కీలకమైన సమయాల్లో రైతులకు సలహాలు ఇచ్చేవారు కూడా లేరు.


ఇంజినీరింగ్‌ విభాగమూ అంతంతే...

గిరిజన ఇంజినీరింగ్‌  విభాగం పరిస్థితి మరీ అధ్వానం. ఆ శాఖలో కొంతమంది లాభదాయకమైన పనులతో పాటు ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు సూచించేవే చేస్తున్నారు. పాలకులకు అనువైన కాంట్రాక్టర్ల విషయం తప్పితే ఇతర అభివృద్ధి పనులు చేపట్టే వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణ పనులు గిరిజన ఇంజినీరింగ్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇవి నత్తనడకన సాగుతున్నా పట్టించుకునే దిక్కులేదు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ గిరిజన ఇంజినీరింగ్‌శాఖ ఈఈ శాంతేశ్వరరావు ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.  ఆయన పార్వతీపురం ఐటీడీఏపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేని పరిస్థితి ఉంది. దీంతో ఆ శాఖను పట్టించుకునే వారే  లేకపోతున్నారు.


తాగునీటి సమస్యకు మోక్షమెప్పుడో

 గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉంది. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి. గిరిజనులకు పోడు పట్టాల మంజూరు విషయంలో ఐటీడీఏ విభాగంలో గల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ శాఖ ద్వారా అందించే సేవలు తీసికట్టుగా ఉంటున్నాయి. సరైన సమాచారం ఇవ్వని పరిస్థితుల్లో ఆ శాఖ ఉంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అందించే సేవలు, ఆ శాఖ పనితీరుపై క్షేత్రస్థాయిలో అనేక విమర్శలు ఉన్నా... పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. ఇలా చెప్పుకుంటూపోతే ఐటీడీఏలో అడుగడుగునా అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా విధుల్లో చేరుతున్న యువ ఐఏఎస్‌ అధికారి విధేఖరే ఐటీడీఏను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - 2020-08-12T10:15:12+05:30 IST