ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-06-25T06:05:29+05:30 IST

ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆందోళన

ఖరీఫ్‌ సాగుపై రైతుల్లో ఆందోళన
పట్టిసీమ నీళ్లు విడుదల చేయకపోవడంతో బోసిపోతున్న పోలవరం కాల్వ

 పట్టిసీమ నీరొస్తేనే చెరువుల కింద సాగు

విజయవాడ రూరల్‌, జూన్‌ 24: ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ప్రారంభమైనా నేటికీ కాల్వలకు నీటిని విడుదల చేయలేదు. కృష్ణానదిలో తగినంత నీటి నిల్వలు ఉన్నప్పటికీ, కాల్వలకు నీటి విడుదల తేదీలను ఖరారు చేయలేదు. దీంతో గొల్లపూడి ఎత్తిపోతల పథకం కాల్వ కింద ఆయకట్టుతోపాటు ఏలూరు, రైవస్‌ కాల్వల కింద ఆయకట్టులో వ్యవసాయ పనులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంత భూముల్లో ఆరేళ్లుగా బంగారు పంటలు పండిస్తున్న పట్టిసీమ నీళ్లను ఇప్పటికీ పోలవరం కాల్వలోకి విడుదల చేయలేదు. గతేడాది జూన్‌ మొదటి వారంలోనే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లను పోలవరం కాల్వలోకి విడుదల చేశారు. మోటార్ల సాయంతో చెరువుల్లోకి నీటిని పెట్టారు. కానీ ఇంతవరకు పోలవరం కాల్వలోకి నీళ్లు రాకపోవడంతో చెరువుల కింద ఆయకట్టుదారులు ఖరీఫ్‌ సాగుపై ఆందోళన చెందుతున్నారు. విజయవాడ రూరల్‌, గన్నవరం, బాపులపాడు మండలాల్లోని వేలాది ఎకరాలలోని మెట్ట భూముల సాగు పోలవరం కాల్వపైనే ఆధారపడి ఉంది. మండలంలోని నున్న, పాతపాడు, పీ నైనవరం, అంబాపురం ఆయకట్టు పట్టిసీమ నుంచి విడుదలయ్యే నీళ్లపైనే ఆధారపడి ఉంది. గోదావరి నీళ్లు విడుదల చేయకపోవడంతో పోలవరం కాల్వ బోసిపోయి కనిపిస్తోంది. పోలవరం కాల్వలోకి నీళ్లు వస్తే, మోటార్ల సహాయంతో ఆ నీళ్లను చెరువులకు పెట్టుకునేందుకు రైతులు మోటార్లను సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్‌ సాగును దృష్టిలో ఉంచుకుని పోలవరం కాల్వలోకి సాధ్యమైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-06-25T06:05:29+05:30 IST