పట్టు రైతు కుదేలు

ABN , First Publish Date - 2020-11-28T06:15:48+05:30 IST

కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పట్టు రైతు.. రీలర్ల సమ్మెతో పూర్తిగా కుదేలవుతున్నాడు. అన్నివిధాలా నష్టపోతున్నాడు.

పట్టు రైతు కుదేలు
హిందూపురం మార్కెట్‌లో పట్టుగూళ్లులేక వెలవెలబోతున్న వైనం

రీలర్ల సమ్మెతో హిందూపురం మార్కెట్‌లో కొనుగోళ్లు బంద్‌

కర్ణాటకకు తీసుకెళ్లాల్సిన దుస్థితి

భారమవుతున్న రవాణా ఖర్చులు

సమస్య పరిష్కారానికి 

చొరవ చూపని ప్రభుత్వం

హిందూపురం, నవంబరు 27: కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పట్టు రైతు.. రీలర్ల సమ్మెతో పూర్తిగా కుదేలవుతున్నాడు. అన్నివిధాలా నష్టపోతున్నాడు. రీలర్ల సమ్మెతో హిందూపురం మార్కెట్‌లో పట్టుగూళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో జిల్లా రైతులు పట్టుగూళ్లను కర్ణాటక మార్కెట్లకు తరలించాల్సి వస్తోంది. ఇందుకు రవాణా ఖర్చులు రెట్టింపవుతున్నాయి. కర్ణాటక మార్కెట్లకు ఒక్కసారిగా పట్టుగూళ్ల రాక పెరగటంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో చేసేదిలేక జిల్లా రైతులు అందినకాడికి పట్టుగూళ్లను అమ్ముకుని, వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం ఏడు నెలలుగా ఇవ్వకపోవటానికితోడు డిమాండ్లను నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పట్టు రీలర్లు ఈనెల 26 నుంచి సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో అతి పెద్ద పట్టుగూళ్ల మార్కెట్‌ అయిన హిందూపురంలో కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రీలర్ల సమ్మెతో లక్షలాది మంది రైతు కుటుంబాలను ఆదుకుంటున్న పట్టు పరిశ్రమ విలవిలలాడే పరిస్థితి వచ్చింది. ఈనెల 17న రీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నోటీసు ఇచ్చినా.. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. నివర్‌ తుఫాను, రీలర్ల సమ్మె పట్టు రైతుకు తీవ్ర నష్టం మిగులుస్తున్నాయి. 


కర్ణాటక మార్కెట్లకు పరుగులు

హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌లో కొనుగోళ్లు బంద్‌ అవటంతో రైతులు గూళ్లను కర్ణాటకలో విక్రయించాల్సి వస్తోంది. రోజూ జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు కర్నూలు, కడప, తెలంగాణ నుంచి సగటున 5 నుంచి 6 టన్నుల వరకుహిందూపురం మార్కెట్‌కు గూళ్లను తీసుకొస్తున్నారు. బైవోల్టీన్‌ పట్టుగూళ్లు 90 శాతంపైగా హిందూపురం మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. రీలర్ల సమ్మెతో బైవోల్టీన్‌, సీబీ పట్టుగూళ్లను విక్రయించాలంటే కర్ణాటక మార్కెట్లు శరణ్యంగా మారాయి. జిల్లా నుంచి ఒక్కసారిగా భారీగా రైతులు గూళ్లను కర్ణాటక మార్కెట్లకు తరలిస్తుండటంతో అక్కడ కూడా ధరలు భారీగా తగ్గించినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటకలో బైవోల్టీన్‌ రకం గూళ్లు కిలో సగటున రూ.330, సీబీ రకం రూ.250లోపే పలుకుతున్నట్లు అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రవాణా ఖర్చులు అదనపు భారమవుతున్నాయి. చేసేదిలేక వారు అడిగిన ధరకే గూళ్లను అమ్ముకోవాల్సి వస్తోంది. ఇలా ఇంకెన్నాళ్లు ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని రాంనగర్‌, శిద్లఘట్ట మార్కెట్లకు రెండ్రోజులుగా సగటున పది టన్నుల వరకు జిల్లా నుంచి పట్టుగూళ్లను రైతులు తీసుకెళ్లటంతో ధరలు పతనమవుతున్నాయి. పైగా అక్కడ వ్యాపారులు తుకాల్లో మోసాలు, కమీషన్లు అధికంగా తీసుకుంటూ అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు.


ప్రభుత్వ చొరవేదీ?

మల్టీఎండ్‌, చర్కా రీలర్లు ఇచ్చే ప్రోత్సాహకం ఏడు నెలల బకాయిలతోపాటు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఈనెల 17న రాష్ట్ర సిల్క్‌ రీలర్ల సంక్షేమ సంఘం.. పట్టు పరిశ్రమశాఖాధికారులకు సమ్మె నోటీసు ఇచ్చింది. రీలర్లు సమ్మెలోకి వెళ్తున్నా.. ప్రభుత్వం, పట్టుపరిశ్రమ శాఖాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. పది రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినా.. నివారణకు ఏ మాత్రం చొరవ చూపకపోవటంతో పట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పైగా రైతులు ఉత్పత్తి చేసిన గూళ్లను కర్ణాటకలో విక్రయించాలని పట్టుపరిశ్రమ శాఖాధికారులు ఉచిత సలహా ఇస్తుండటం శోచనీయం. రీలర్లకు ప్రోత్సాహకాన్ని సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ఇచ్చేందుకు బిల్లులు పంపించామని చెబుతున్నా.. ఎందుకు నిధులు విడుదల చేయలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.


పట్టుగూళ్లను ఎక్కడికి తీసుకెళ్లాలి?

హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు 200 కేజీల బైవోల్టీన్‌ గూళ్లను తీసుకొచ్చా. రీలర్ల సమ్మెతో మార్కెట్‌లో కొనుగోళ్లు లేవని అధికారులు చెబుతున్నారు. గూళ్లను హిందూపురంలోని బంధువుల ఇంట్లో ఉంచా. కర్ణాటక శిద్లఘట్ట మార్కెట్‌కు తీసుకెళ్లి, విక్రయించాలని తోటి రైతులు చెప్పారు. రవాణా భారమైనా తప్పదు. పురంలోనే కొనుగోళ్లు సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు.

- అంజినప్ప, రైతు, నాగలూరు


కర్ణాటక మార్కెట్‌కు తరలించాల్సిందే

బైవోల్టీన్‌ పట్టుగూళ్లు చంద్రికల నుంచి తొలగించి, మార్కెట్‌కు తరలించేందుకు రెండు రోజుల కిందట సిద్ధం చేశాం. హిందూపురంలో రీలర్ల సమ్మెతో కొనుగోళ్లు చేయలేదని అధికారులు చెప్పారు. ఇలానే రెండ్రోజులు నిల్వ ఉంచితే గూళ్ల నుంచి పురుగులు బయటకు వస్తాయి. కర్ణాటక మార్కెట్లకు తరలించటం తప్పా.. వేరే మార్గం లేదు. అక్కడ ధరలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నా. కరోనాతో ధరలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో రీలర్ల సమ్మె పట్టు రైతులకు మరింత నష్టం మిగులుస్తోంది.

- శివారెడ్డి, పట్టు రైతు, లేపాక్షి


న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి

లాక్‌డౌన్‌లో రీలర్లు పూర్తిగా నష్టపోయారు. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన పట్టుగూళ్లకు మంచి ధర ఇచ్చి, కొనుగోలు చేస్తున్నాం. ఉత్పత్తి చేసిన సిల్క్‌ ఽధరలు మాత్రం మార్కెట్‌లో రోజురోజుకీ పడిపోతున్నాయి. పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకం 7 నెలలుగా పెండింగ్‌లో ఉంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోవటంతో సమ్మెలోకి వెళ్లాం. సమస్యలు పరిష్కరించే వరకు మార్కెట్‌లో పట్టుగూళ్లు కొనుగోలు చేయలేం.

- రియాజ్‌, సిల్క్‌ రీలర్ల సంఘం అధ్యక్షుడు,హిందూపురం


రీలర్లు సమ్మె విరమించాలని కోరాం

రీలర్లకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా చెల్లింపునకు బిల్లులు ఎప్పుటికప్పుడు పంపాం. సమ్మె విరమించి, రైతులు నష్టపోకుండా పట్టుగూళ్లను కొనుగోలు చేయాలని రీలర్లను కోరాం. ముందస్తుగా హిందూపురంలో మార్కెట్‌ లేదని రైతులకు సమాచారం ఇచ్చి, కర్ణాటక మార్కెట్లలో విక్రయించుకోవాలని సూచించాం. రీలర్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రీలర్లు సమ్మె విరమించి, మార్కెట్‌లో కొనుగోళ్లు చేస్తారని భావిస్తున్నాం

- సురే్‌షకుమార్‌, ఏడీ, పట్టుపరిశ్రమ శాఖ, హిందూపురం

Updated Date - 2020-11-28T06:15:48+05:30 IST