పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

ABN , First Publish Date - 2021-05-14T04:44:45+05:30 IST

జిల్లాలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో పక్కాగృహాల నిర్మాణానికి జిల్లా హౌసింగ్‌ శాఖ రంగం సిద్ధం చేస్తున్నది.

పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
నాయుడుపేటలో పేదల ఇళ్లస్థలాల్లో మౌలిక వసతులు పరిశీలిస్తున్న హౌసింగ్‌ పీడీ ఆదిసుబ్రహ్మణ్యం (ఫైల్‌)

మొదటిదశలో 53,953 గృహాలు

పురపాలక సంఘాలు, నుడా పరిధిలో తొలుత నిర్మాణం 

ప్రతి లేఅవుట్‌కి తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం


నెల్లూరు (జడ్పీ), మే 13 : జిల్లాలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల లేఅవుట్లలో పక్కాగృహాల నిర్మాణానికి జిల్లా హౌసింగ్‌ శాఖ రంగం సిద్ధం చేస్తున్నది. జిల్లాలో 1.3 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలను పంపిణీ చేసింది. జూన్‌ 1వ తేదీ నుంచి రెండు విడతలుగా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం సూచించడంతో తొలి విడత నిర్మాణాలకు హౌసింగ్‌ శాఖ ఆధ్వర్యంలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిగా పురపాలక సంఘాలు, నుడా పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు.


తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం

లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్‌  సౌకర్యాలను అధికారులు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.42 కోట్లు మంజూరు చేశారు. ఈ నెలాఖరుకల్లా ఆ పనులను పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


మొదటగా 53,953 ఇళ్ల నిర్మాణం

నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాలతోపాటు నుడా పరిధిలోని 20 మండలాల్లో  తొలి విడతగా 53,953 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికే 11,075 ఇళ్లను మంజూరు చేశారు. అలాగే 256 లేఅవుట్లలోని 42,878 ఇళ్ల నిర్మాణాలను జూన్‌ 1వ తేదీ నుంచి చేపట్టనున్నారు. అయితే ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఇందులో లబ్ధిదారులే నేరుగా ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని చెప్పడంతో, తొలి విడత ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారులు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఈ ఇళ్లను లబ్ధిదారులే నిర్మించుకోనున్నారు. వీరికి ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.8లక్షలను మంజూరు చేయనున్నది. అలాగే నాలుగు ట్రిప్పుల ఇసుకను ఉచితంగా అందజేయనున్నది. పెరుగుతున్న సిమెంటు, స్టీలు ధరలను దృష్టిలో ఉంచుకుని, అధిక ధరలతో ఇళ్ల నిర్మాణాలు భారం అవుతున్నందున  రూ.235 చొప్పున ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంటు, టన్ను ధర రూ.58 వేల చొప్పున స్టీలు ప్రభుత్వమే అందించనుంది. అలాగే ఇటుకకు ముందస్తు పెట్టుబడి లేకుండా, లబ్ధిదారుల తరపున ఇటుక బట్టీల యజమానులకు ప్రభుత్వమే అధికారుల ద్వారా హామీ ఇవ్వనున్నది. 


వేగంగా పనులు

జిల్లాలో తొలి విడత పక్కాఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించుకుని, వేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినందు న, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ, ఇళ్ల నిర్మాణాలకు సర్వం సిద్ధం చేస్తున్నాం. 

- ఆదిసుబ్రహ్మణ్యం, హౌసింగ్‌ పీడీ  

Updated Date - 2021-05-14T04:44:45+05:30 IST