Abn logo
Oct 20 2021 @ 09:27AM

PEDDA AMBERPET: ప్రాణం తీసిన ఈత సరదా..విద్యార్థి మృతి

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌: స్నేహితులందరూ కలిసి వాగు వద్ద ఫొటోలు దిగారు. అనంతరం కొందరు ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో ఓ విద్యార్థి నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడకు చెందిన పోతనపల్లి ప్రణీత్‌(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులు జీవన్‌, శ్రీకాంత్‌, మాళవిక, అంజలి, రిషీతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు కత్వ వద్దకు వచ్చారు. అక్కడ ఫొటోలు దిగారు. అందులో కొంత మంది కత్వలోకి దిగి ఈత కొడుతున్నారు. గట్టుపైన ఉన్న ప్రణీత్‌ కూడా నీటిలోకి దిగి ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. ప్రణీత్‌ దిగిన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ప్రణీత్‌ మృతదేహాన్ని బయటకి తీశారు. కేసు దర్యాప్తులో ఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption