పెళ్లిళ్లోయ్‌.. పెళ్లిళ్లు

ABN , First Publish Date - 2021-11-20T06:55:30+05:30 IST

ఉమ్మడి జిల్లాలో కార్తీక మాసం సందడి పెరిగింది.

పెళ్లిళ్లోయ్‌.. పెళ్లిళ్లు

 నేటి నుంచి శుభముహూర్తాలు 

ముందుగానే ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌ 

వినియోగదారులతో కళకళలాడుతున్న మార్కెట్లు

ఉమ్మడి జిల్లాలో కార్తీక మాసం సందడి పెరిగింది. రెండేళ్లపాటు కరోనా మహమ్మారి భయం తో శుభకార్యాలు వాయిదా వేసుకున్నవారు తాజా గా మంచి ముహూర్తాలు ఉండటంతో కార్యక్రమాల నిర్వహణకు మొగ్గుచూపుతున్నారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో రెండు నెలల ముందుగానే ఫంక్షన్‌హాళ్లు బుక్‌ అయ్యాయి. ఈనెల 21న ఆదివారం ఉండటంతో ఈ ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 400కు పైగా పెళ్ళిళ్లకు పూజారులు ముహూర్తాలు నిర్ణయించారు. ఓ వైపు కార్తీక పూజలు, మరోవైపు పెళ్ళిళ్ల సందడితో మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

-  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)


కార్తీక మాసంలో శివుడు, నారాయణుడు కలిసి ఉంటారనే విశ్వాసంతో హిందువులంతా ఈ మాసానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏడాదిలో ఎప్పుడూ దీపం వెలిగించని వారు కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే వెయ్యి జన్మల పుణ్యం సిద్ధిస్తుందన్నది నమ్మకం. ఈ మాసంలో వాతావరణం సైతం అనుకూలంగా ఉండనుండటంతో అంతా వివాహాలకు ఆసక్తి చూపుతారు. ఈనెల 21న ఆదివారం మృగశిరకార్తె, 24న బుధవారం పంచమి పునర్వసు నక్షత్రం, 25న పుష్యమి నక్షత్రం గురువారం కావడంతో వివాహాలకు అనుకూల ముహూర్తంగా భావిస్తారు. దీంతో ఈ మూడు రోజుల్లో చాలా జంటలు పెళ్లి బంధంతో ఏకం కానున్నాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి సెలవు, ఆ తరువాత శనివారం వారాంతం, ఈనెల 21న ఆదివారం సెలవు దినం కావడంతో ఈ తేదీన ఫంక్షన్‌ హాళ్లు రెండు నెలల ముందుగానే బుక్‌ అయ్యాయి. ఈ మూడు రోజుల్లో రోజుకు 300కు తగ్గకుండా ఉమ్మడి జిల్లాలో వివాహ ముహూర్తాలు నిర్ణయించారు. 21న ఒక్కరోజే 400కు పైగా వివాహాలు ఉన్నాయి. దీంతో క్యాటరింగ్‌ నిర్వాహకులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆర్డర్లు ఉన్నాయని, నల్లగొండ పట్టణంతో పాటు పల్లెల్లో సైతం క్యాటరింగ్‌కే మొగ్గుచూపుతుండటంతో అందరికీ సేవలు అందించలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఒప్పుకున్న వారికి సకాలంలో అందిస్తే చాలని వారు చేతులెత్తేస్తున్నారు.


కార్తీక పూజల సందడి

కార్తీక మాసం కావడంతో ఉమ్మడి జిల్లాలో పూజల సందడి పెరిగింది. ఏడాది పొడువున పూజలు చేయని వారు, ఈ ఒక్క నెల చేస్తే ఏడాది మొత్తం ఫలితం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే వీలు కుదరక సంవత్సరం పొడుగున వెలిగించకపోయినా దోషం లేదన్న ప్రచారం ఉండటంతో అంతా ఈ పండుగకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు సెల వు రోజు కలిసిరావడంతో ఉదయం 4గంటలకే దేవాలయాలకు భక్తులు క్యూ కట్టారు. గురువారం మధ్యాహ్నం నుంచే ఆవుపాలు, నెయ్యి, కార్తీక ఒత్తులు, పండ్లు, కొబ్బరికాయలు, దీపాలు, పసుపు, కుంకుమలు, తమలపాకు లు, వక్కల కొనుగోలుకు ప్రజలు వీధుల్లోకి రావడంతో అన్ని పట్టణాల్లో చాలా కాలం తరువాత వ్యాపారాలు కళకళలాడాయి. ఈ మాసం మొత్తం పూజలకు ప్రాధాన్యం ఇవ్వడం, పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉండటంతో వస్త్ర, బం గారం, కిరాణా తదితర దుకాణాలకు గిరాకీ పెరిగింది.


కార్తీకం శుభప్రదం:  పెన్నా మోహన్‌శర్మ, వైదిక బ్రాహ్మణ  సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు 

కార్తీకం అన్ని మాసాల్లోకంటే శుభప్రదమైంది. విశాఖ కార్తె కావడంతో ఈనెల 6 నుంచి 19 వరకు గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు ముహూర్తం పనికిరాలేదు. ఫలితంగా ఈనెల 20 నుంచి గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఇక వివాహాల గురించి చెప్పాల్సిన పనే లేదు. 21న ఆదివారం కలిసి వస్తుండటంతో ఉద్యోగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉంటుందని భావించి అంతా ఆ రోజె పెద్ద సంఖ్యలో పెళ్లి ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు.


Updated Date - 2021-11-20T06:55:30+05:30 IST