పెన్షన్‌.....టెన్షన్‌!

ABN , First Publish Date - 2021-08-21T05:09:57+05:30 IST

పెన్షన్‌దారులను ఈ ప్రభుత్వం టెన్షన్‌ పెడుతోంది. నెలనెలా ఒకటో తారీఖున ఇచ్చే రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ ఇప్పుడు గాడితప్పింది. ఏ రోజు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు జీతాలనే సరిగా సమయానికి ఇవ్వలేని ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగులను మరింత ఇబ్బందిపెడుతోంది. దీంతో పెన్షన్‌పై ఆధారపడి మందులు, నిత్యావసరాలు, ఇంటి అద్దెలు కట్టుకునే వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 25వేల మందికిపైగా రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారు.....

పెన్షన్‌.....టెన్షన్‌!

ఫించన్ ఆధారం కావడంతో 

రిటైర్డ్‌ ఉద్యోగుల్లో ఆందోళన

ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై అసంతృప్తి

1వతేదీ ఇవ్వాల్సిన ఫించన్‌ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి

8వ తేదీ నుంచి మొదలైన జమలు

ఇంకా 20శాతం మందికి అందని వైనం

 జిల్లావ్యాప్తంగా 25 వేలమందికిపైగా పెన్షన్‌దారులు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 20 : 

వారంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందారు.. ప్రతినెల 1వ తేదీన వచ్చే పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి వానే గత ఎనిమిది నెలలుగా మనోవేదనతో ఆల్లాడిపోతున్నారు. కొంతమంది వైద్యఖర్చుల కోసం ప్రతినెల రూ.5వేల వరకుపెట్టాల్సిన పరిస్థితి. అటువంటి ఉద్యోగులకు సకాలంలో పింఛన్‌ రాకపోవడంతో ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో మరింత కుంగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేస్తే వారికి రిటైర్డ్‌ సమయంలో బెనిఫిట్స్‌తో పాటు ప్రతినెల 1వతేదీనే ఫించన్‌ వస్తోంది. వారికేమిరా.. నెలనెలా ఒకటో తారీఖునే ఠంచన్‌గా పింఛన్‌ వస్తుంది.. స్వేచ్ఛగా ఏ చీకూచింతా లేకుండా భార్యభర్తలు హాయిగా బతుకుతారనే జనం వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒకటో తారీఖు అటుంచి అసలు ఎప్పుడు పడుతుందో తెలియక పెన్షన్‌దారులు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


పెన్షన్‌దారులను ఈ ప్రభుత్వం టెన్షన్‌ పెడుతోంది. నెలనెలా ఒకటో తారీఖున ఇచ్చే రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌ ఇప్పుడు గాడితప్పింది. ఏ రోజు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు జీతాలనే సరిగా సమయానికి ఇవ్వలేని ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగులను మరింత ఇబ్బందిపెడుతోంది. దీంతో పెన్షన్‌పై ఆధారపడి మందులు, నిత్యావసరాలు, ఇంటి అద్దెలు కట్టుకునే వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 25వేల మందికిపైగా రిటైర్డ్‌ ఉద్యోగులు ఉన్నారు..... వారందరికీ 1వతేదీన ఫించన్‌ వస్తేనే వారికి ఆర్థిక సమస్యలు తొలగేది. కానీ ప్రస్తుతం ఆ  పరిస్థితి లేకుండాపోయింది. రాష్ట్ర ఆర్థిక కష్టాల నేపథ్యంలో పింఛన్‌ ఎప్పుడు వస్తోందే తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా పెన్షన్‌దారులకు ప్రతినెల సుమారు రూ.400కోట్లకుపైగా చెల్లించాలి. కానీ జనవరి నుంచి ప్రతినెల 1వతేదీన ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము పడటం లేదు. ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిలో మరింత ఆందోళన నెలకొంది. 


ఎందుకు ఈ విధంగా....

కాగా పెన్షన్‌ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాష్ట్ర విభజన అనంతరం పింఛన్‌దారులకు 1వతేదీనే సొమ్ములు వేసిన తర్వాతనే రెగ్యులర్‌ ఉద్యోగులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా రిటైర్డ్‌ ఉద్యోగులకు పింఛన్లు వేస్తున్నారు. అవి కూడా ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క పెన్షన్‌దారుడికి ప్రతినెల రూ.15వేల నుంచి రూ.70వేల వరకు వస్తుండగా అందులో తక్కువ పింఛన్‌ వచ్చేవారు 50శాతం మంది వరకు ఉన్నారు. తక్కువ ఉన్నవారికి ఈ నెల 8 నుంచి పింఛన్లు పడుతూ రాగా శుక్రవారం వరకు 80శాతం మందికి అందాయి. 20తేదీ దాటుతున్న ఇంకా 20శాతం మందికి ఇంకా అందని పరిస్థితి.


వైద్యం కోసం తిప్పలు....

రిటైర్డ్‌ ఉద్యోగులు పింఛన్‌ సకాలంలో రాకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్డ్‌ అయిన ఉద్యోగులు 60ఏళ్లపైనే ఉండటంతో షుగర్‌, బీపీ, గుండె, కిడ్ని సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. కొందరు డయాలసిస్‌ చేయించుకోవాల్సిన వారు ఉన్నారు. ప్రతినెల 1వతేదీనే వచ్చే పెన్షన్‌తో వారు ధైర్యంగా వైద్యఖర్చులు భరించేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి  లేదు. దీంతో వారు అప్పుల చేయడమో, లేక ఆస్పత్రులకు వెళ్లడం వాయిదా వేయడమో చేస్తున్నారు. 


డీఏ చెల్లింపుల్లోనూ జాప్యం.....

కాగా పెన్షనర్లకు డీఏ చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. మూడు పెండింగ్‌ డీఏలు ఉండగా అందులో ఒకటి మాత్రమే ఇచ్చారు. మరో రెండు డీఏలు పెండింగ్‌లో ఉండగా రెండో డీఏను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినా ఇంతవరకు అమలు జరిగిన పరిస్థితి లేకుండా పోయింది. ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో ఎప్పుడు మంజూరు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 


సామాజిక పింఛన్లు ఇస్తున్నారుగా..

కాగా సామాజిక పింఛన్లను వలంటీర్ల ద్వారా 1వతేదీనే ఇంటింటికీ చేరుస్తున్న ప్రభుత్వం 35ఏళ్ళ పాటు ప్రజాసేవ చేసి రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వకుండా మనసిక వేదనకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పింఛన్‌దారుల పట్ల కక్షసాధింపు ధోరణిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మనోవేదనతో అల్లాడిపోతున్నాం 


సకాలంలో పింఛన్‌ రాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాం. ఎప్పుడు వస్తుందా అని 1వతేదీ నుంచి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని గతంలో ఎప్పుడు చూడలేదు. గత ఎనిమిది నెలల నుంచి 1వతేదీనే పెన్షన్‌ పడిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్‌ఉద్యోగులకు గతంలో మాదిరిగా 1వతేదీనే పింఛన్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. 

- కోయ కోటేశ్వరరావు, పెన్షనర్‌


Updated Date - 2021-08-21T05:09:57+05:30 IST