భారత్‌కు పెనుసవాలే!

ABN , First Publish Date - 2022-02-25T09:04:01+05:30 IST

అనాదిగా భారత్‌కు రష్యా మిత్రదేశం.. మిలిటరీపరంగా దాని అవసరాలన్నీ తీర్చే దేశం.. సంక్షోభాలున్నా.. లేకున్నా అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారం.. యుద్ధవిమానాలు, క్షిపణులు, రక్షణ ఉత్పత్తులను ఉమ్మడిగా తయారుచేసే స్థాయికి ఎదిగిన భాగస్వామ్యం..

భారత్‌కు పెనుసవాలే!

 ఉక్రెయిన్‌పై రష్యాకు చైనా మద్దతు

రష్యా తాజా దాడికి పాక్‌ మద్దతు

ఈ మూడూ చేరువైతే ఇండియాకు ఇబ్బందే


అనాదిగా భారత్‌కు రష్యా మిత్రదేశం.. మిలిటరీపరంగా దాని అవసరాలన్నీ తీర్చే దేశం.. సంక్షోభాలున్నా.. లేకున్నా అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారం.. యుద్ధవిమానాలు, క్షిపణులు, రక్షణ ఉత్పత్తులను ఉమ్మడిగా తయారుచేసే స్థాయికి ఎదిగిన భాగస్వామ్యం.. కాలపరీక్షకు నిలిచిన బంధం.. ఇదంతా గతమవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ.. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సంపూర్ణ సహకారం అందిస్తున్న చైనా.. కొన్ని దశాబ్దాలుగా రష్యాకు బాగా సన్నిహితమవడం.. ఉక్రెయిన్‌పై దాడిని చైనాతో పాటు పాక్‌ కూడా అనూహ్యంగా సమర్థించడం తదితర పరిణామాలు ఆందోళన కలిగించేవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు అంశాల్లో చైనా, రష్యాల నడుమ పరస్పర అవిశ్వాసం ఉన్నప్పటికీ ఉమ్మడి ప్రత్యర్థి అమెరికా కారణంగా రష్యా, చైనా మరింతగా చేరువవుతున్నాయి. ఆర్థికంగా, వాణిజ్య, ఇంధన, మిలిటరీ రంగాల్లోనూ సంబంధాలు పటిష్ఠం చేసుకుంటున్నాయి. ప్రధానంగా చైనా ఆర్థికంగా సూప ర్‌ పవర్‌గా మారింది. వివిధ దేశాలకు అప్పులిస్తూ సంబంధాలు పెంపొందించుకుంటోంది. చైనా నుంచి ఐరోపా ముంగిటవరకు తలపెట్టిన ‘వన్‌ రోడ్‌-వన్‌ బెల్ట్‌ (చారిత్రక సిల్క్‌ రోడ్డు వాణిజ్య మార్గం)’తో  వివిధ దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు భారీ పథకం రూపొందించింది. ప్రధానంగా సముద్ర మార్గం అభివృద్ధి పేరిట ఐరోపాలో ఇటలీ వంటి దేశాలనూ ఆకర్షించింది. మధ్య ఆసియా దేశాల గుండా ఐరోపాకు దారితీసే ఈ మార్గంపై రష్యా కూడా ఆసక్తి చూపుతోంది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలను అనుసంధానించే ఈ ప్రాజెక్టుకు 900 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా.


రేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, వంతెనలు మొదలైన వాటిపై భారీగా ఖర్చుచేసి ప్రయాణ దూరాన్ని, భారాన్ని తగ్గించి వేగంగా రవాణా చేయడానికి వీలు కల్పించి.. ఆర్థికంగా అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసి తాను ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడం చైనా లక్ష్యం. వన్‌ రోడ్‌ వన్‌ బెల్ట్‌కు పాక్‌ రెడ్‌ కార్పెట్‌ వేసింది. తాను ఆక్రమించిన కశ్మీరులోని కారకోరం, ఇతర ప్రాంతాల గుండా నిర్మాణానికి అనుమతి ఇచ్చేసింది. దీనిని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. చైనా, పాక్‌తో దానికి సరిహద్దు వివాదాలు ఉన్నాయి. యుద్ధాలు కూడా జరిగాయి. ఈ వివాదాలు, యుద్ధాలు, ఇతర సంక్షోభాల సమయంలో రష్యా ఎల్లప్పుడూ భారత్‌కే అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి సహా అంతర్జాతీయ వేదికలపై మద్దతిస్తూ వస్తోంది. ఇప్పుడు చైనా, రష్యా బంధం దృఢతరం కావడంతో భవిష్యత్‌లో భారత్‌ పట్ల చైనా విధానాలను రష్యా సమర్థించే అవకాశం లేకపోలేదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఇంకోవైపు.. పాక్‌ కూడా పూర్తిగా చైనా రక్షణ ఛత్రఛాయల్లోకి వెళ్లిపోయింది. అప్పులు, ఆర్థికంగా కూడా దానిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పాక్‌ మద్దతుతో అఫ్గానిస్థాన్‌ను తిరిగి చేజిక్కించుకున్న తాలిబాన్లకు చైనా పూర్తిగా అండగా నిలబడింది. ప్రపంచ దేశాలు వారి ప్రభుత్వాన్ని గుర్తించకున్నా పలు అంశాల్లో మద్దతిస్తోంది. ఇది భారత్‌కు రాజకీయంగానే గాక ప్రాదేశిక సమగ్రతకూ ప్రమాదంగా పరిణమించవచ్చు.


పశ్చిమ దేశాలకు పాక్‌ వార్నింగ్‌? 

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సమర్థించడం పశ్చిమ దేశాలను, భారత్‌ను విస్మయపరచింది. ఒకప్పుడు అమెరికాకు పాక్‌ అత్యంత సన్నిహిత దేశం. భారత్‌లో సీమాంతర తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నా పట్టించుకోలేదు. అయితే అఫ్ఘానిస్థాన్‌ లో ఉగ్రవాదుల ఏరివేతకు పాక్‌ మనస్ఫూర్తిగా సహకరించకపోవడం..ప్రజాప్రభుత్వాలను కాదని తాలిబాన్లకు అండగా నిలవడం.. అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమివ్వడం తదితర కారణాలతో ఆ దేశాన్ని అమెరికా, నాటో దేశాలు దూరంపెట్టాయి. ఆర్థిక, సైనిక ఆంక్షలు విధించాయి. దీంతో మిలిటరీ, ఆయుధాలు, రక్షణపరంగా పాక్‌ పూర్తిగా చైనాపై ఆధారపడుతోంది. ప్రస్తుతం దాని ఆయుధ, క్షిపణి, అణు పరిజ్ఞానం మొత్తం చైనాదే. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే విష యం. ఇప్పుడు యుద్ధ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ మాస్కో వెళ్లి మరీ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి మద్దతు ప్రకటించారు. తమ విషయంలో పశ్చిమ దేశాలు వైఖరిని మార్చుకోకపోతే రష్యా, చైనాలతో కలిసిపోతానని తద్వారా హెచ్చరించారని విదేశాంగ నిపుణులు అంటున్నారు. రష్యా భారత్‌కు మిత్రదేశమే అయినా.. ఇప్పుడు పాక్‌, చైనాలకు అది దగ్గరైతే భద్రతపరంగా పెనుసవాలేనని హెచ్చరిస్తున్నారు.   

       

మళ్లీ ‘ప్రచ్ఛన్న’ ఛాయలు!

సైనికంగా, ఆర్థికంగా దృఢ శక్తులుగా ఉన్న రష్యా, చైనా ఏకతాటిపైకి రావడం అటు అమెరికా, పశ్చిమ దేశాలకు కూడా ఆందోళన కలిగించే విషయమే. సోవియట్‌ కాలం నాటి ప్రచ్ఛన్న యుద్ధం మళ్లీ ముందుకొస్తుందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పాక్‌, అఫ్ఘాన్‌, బెలారస్‌, మధ్య ఆసియాలోని చిన్న చిన్న దేశాలను కలుపుకొని చైనా, రష్యా ఓ కూటమిని ఏర్పాటు చేసుకుంటే.. అవి పశ్చిమ దేశాలకు కచ్చితంగా సవాల్‌గా మారతాయని అంటున్నారు. వాస్తవానికి చైనా, రష్యా నడుమ చాలా ఏళ్లు సత్సంబంధాల్లేవు. సరిహద్దు వివాదాలు ఏళ్లతరబడి నడిచాయి. సోవియట్‌ యూనియన్‌ హయాంలో ఇరు దేశాల్లోనూ కమ్యూనిస్టు పార్టీలే అధికారంలో ఉన్నా సరిహద్దు సమస్యలపై చిన్నపాటి యుద్ధాలే జరిగాయి. సైద్ధాంతికంగా ఆ రెండు కమ్యూనిస్టుల పార్టీల మధ్య విభేదాలూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలను, కమ్యూనిస్టు దేశాలను ప్రభావితం చేసేందుకు పోటీపడేవి. సోవియట్‌ ఆధిపత్యాన్ని చైనా తీవ్రంగా నిరసించి.. అమెరికాతో పరోక్షంగా మైత్రి నెరిపేది. 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం రష్యన్‌ సమాఖ్య (రష్యా) ఏర్పడ్డాక సత్సంబంధాల దిశగా అడుగులు వేశాయి. తమ నడుమ 4,300 కి.మీ. పొడవున సరిహద్దులను గుర్తించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాయి. ఇంధన రంగంలో మొదలైన బంధం ఆర్థికంగా, వాణిజ్యపరంగా విస్తృత సహకారంతోపాటు రక్షణ రంగానికీ విస్తరించింది.  ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌, జీ జిన్‌పింగ్‌ నడుమ సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా వైఖరిని భద్రతామండలిలో చైనా సంపూర్ణంగా సమర్థించడం..అమెరికా, దాని మిత్రదేశాలకు మింగుడుపడని విషయమే.


సెంట్రల్‌ డెస్క్‌


Updated Date - 2022-02-25T09:04:01+05:30 IST