ప్రజల భవిష్యత్తు బాధ్యత తెలుగు యువతదే

ABN , First Publish Date - 2021-10-18T03:58:58+05:30 IST

రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు బాధ్యత తెలుగు యువతదేనని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు.

ప్రజల భవిష్యత్తు బాధ్యత తెలుగు యువతదే
తెలుగు యువత కమిటీని ప్రకటిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

సర్వేపల్లిలో అరాచకాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయి

తెలుగు యువత కమిటీలో 25మందికి పదవులు

 మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

 మనుబోలు, అక్టోబరు 17: రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు బాధ్యత తెలుగు యువతదేనని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి తెలుగు యువత కమిటీ సమావేశం స్థానిక సీఆర్‌ఆర్‌ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి,  టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి,  తెలుగు యువత తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు రవి నాయుడులను నియోజకవర్గ అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్‌ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం  సోమిరెడ్డి, నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 25మందికి కమిటీలో పదవులు అప్పగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు యువత సాంకేతికతను, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అవినీతిని బయటపెట్టాలన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినవారే అసలైన కార్యకర్తలన్నారు. పార్టీకోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా తెలుగు యువతదేనన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని విమర్శించారు.  మండల రైతుల కలైన డేగపూడి-బండేపల్లి కాలువను గతంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డే తీసుకురాలేకపోయారన్నారు. అలాంటిది తన హయాంలో మంజూరు చేయించి, పనులు ప్రారంభిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యే కమీషన్లు ఇవ్వలేదని కంపెనీని పనులు చేయకుండా తరిమేశారని ఆరోపించారు. గెలిచినా, ఓడినా తానెప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ అందరికీ అండగా ఉంటానన్నారు. అనంతరం తెలుగు యువత కమిటీ అధ్యక్షుడిగా శివుడు రాజాగౌడ్‌, ఉపాధ్యక్షుడిగా కలికి రమేష్‌ రెడ్డి, కార్యదర్శిగా రావుల జితేంద్ర గౌడ్‌, జనరల్‌ సెక్రటరీగా నిఖిల్‌ రెడ్డి, సోషల్‌మీడియా కోఆర్టినేటర్‌గా చెల్లగిరి చిట్టిబాబులను, మనుబోలు తెలుగు యువత అధ్యక్షుడిగా పొన్నూరు అశోక్‌ను నియమించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, తిరుపతిపార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మండలాధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, గుమ్మడి రాజా యాదవ్‌, శ్రీనువాసులు నాయుడు, రాయపాటి కిరణ్‌కుమార్‌, చేరెడ్డి పద్మనాభరెడ్డి, చేరెడ్డి కోదండరామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, ఉడతా విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T03:58:58+05:30 IST