Abn logo
May 7 2021 @ 00:00AM

ప్రజలు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి

ఆదిలాబాద్‌టౌన్‌, మే7: కరోనా విజృంభణ వేళ ప్రజలు భయాందోళనకు గురికాకుండా మనోధైర్యాన్ని కలిగి ఉండాలని జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజా ప్రతిని ధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ సోకిన వారికి నిర్ధిష్టమైన మందుల కిట్‌ పంపిణీ చేయడం జరుగుతుందని వాటిని తప్పని సరిగా వైద్యుల సూచనల మేరకు వేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ వల్ల కలిగే ప్రయోజనాలకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ కరోనా ఉధృతి నేపథ్యంలో జిల్లాలో గురువారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామ న్నారు. జ్వరం, జలుబు వంటి లక్షణాలు వంటి కలిగిన వారికి మందుల కిట్‌ను పంపిణీ చేస్తున్నామని వాటిని తప్పని సరిగా వైద్యుల సలహా మేరకు వేసుకో వాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు గ్రామాల్లోకి వెళ్లి సర్వే టీంల పనులపై పర్యవేక్షించాలని ఆదేశించారు. రిమ్స్‌లో ఆక్సిజన్‌, రెమ్‌డిసివర్‌ ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పని లేకుంండా రిమ్స్‌లో చికిత్స పొందాలని సూచించారు. 295 ఆక్సిజన్‌ బెడ్లు, 105 ఐసీయూ బెడ్లు ఉన్నాయని 600 బెడ్ల వరకు పెంచే యోచనలో ఉన్నామని తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, మున్సిపల్‌ చైర్మన్‌ జోగుప్రేమేందర్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ భానోత్‌బలిరాం, ఆర్డీవో రాజేశ్వర్‌, డీఆర్డీఏ పీడీ కిషన్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓ నరేందర్‌రాథోడ్‌ తదితరులుపాల్గొన్నారు.

 మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టాలి..

గుడిహత్నూర్‌: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జవహార్‌నగర్‌లో చేపడుతున్న సర్వేను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు రావద్దని చిన్న పిల్లలకు దూరంగా ఉండాలన్నారు. రెండో దశ కరోనా విజృంభిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.నరేందర్‌రాథోడ్‌, తహసీల్దార్‌ పవన్‌చంద్ర, మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఎంపీవో లింగయ్య ఉన్నారు.

Advertisement
Advertisement