తెగులు.. గుబులు

ABN , First Publish Date - 2021-10-22T04:51:19+05:30 IST

వరి పంటను వివిధ రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయి. వాటి నుంచి పంటను రక్షించుకోవడానికి అన్నదాత పడరాని పాట్లు పడుతున్నా డు. ఇప్పటికి మూడు ధపాలు పురుగు మందు పిచికారీ చేశారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా రైతులను తెగుళ్లు వేధిస్తున్నాయి.

తెగులు.. గుబులు
తెగులు నివారణ మందులు పిచికారీ చేస్తున్న దృశ్యం

ఆందోళనలో వరి రైతులు

 గంట్యాడ, అక్టోబరు 21:

వరి పంటను వివిధ రకాల తెగుళ్లు ఆశిస్తున్నాయి. వాటి నుంచి పంటను రక్షించుకోవడానికి అన్నదాత పడరాని పాట్లు పడుతున్నా డు. ఇప్పటికి మూడు ధపాలు పురుగు మందు పిచికారీ చేశారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు.  జిల్లా వ్యాప్తంగా   రైతులను తెగుళ్లు వేధిస్తున్నాయి. జిల్లాలో 1,23,650 హెక్టార్లలో వరి సాగవుతోంది. వర్షాలు ఈ ఏడాది విరివిగా కురవడంతో అనుకూలంగా నాట్లు వేసుకున్నారు. పార్వతీపురం డివిజన్‌లో మరింత ముందుగా నాట్లు పడ్డాయి. అయితే ఉభాల తరువాత వరుస తుఫాన్లు రావడంతో వరి పంటకు తెగుళ్ల సమస్య మొదలైంది. మొదట్లో దోమ, సుడిదోమ, అగ్గి తెగులు, ఇప్పుడు పాము పొడ తెగులు సోకుతోంది. సుడిదోమ, అగ్గి తెగులు నివారణకు ఇప్పటికే రెండుసార్లు ముందు పిచికారీ చేయగా, తాజాగా పొడ తెగులును అదుపు చేసేందుకు మందులు వాడుతున్నారు. ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో నిరాశ పడుతున్నారు. ఎకరాకు ఒక ధపా మందు కొనుగోలుకు రూ.800, పిచికారీ చేయడానికి రూ.400 చొప్పున ఖర్చు అవుతోంది. మూడుసార్లు వేయడానికి ఎకరాకు రూ.3,300 చొప్పున ఖర్చు అవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖర్చులు పెరిగాయి. విత్తనాల కొనుగోలు నుంచి రైతులపై ఆర్థిక భారం పడుతోంది. నాట్లు వేసుకున్న సమయంలో కూలీ ఖర్చులు, ఎరువుల కోసం మరింత పెట్టుబడి అవసరం పడుతోంది. మరోవైపు యూరియా, డీఏపీ, పొటాష్‌ వంటి ఎరువులు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా గత నెలలో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ కారణంగా పాము..పొడ తెగులు ఆశిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.  

మూడుసార్లు మందు వేశాం

నాట్లు వేసుకున్న తరువాత వాతావరణం అనుకూలంగా లేక మొదటిసారి వరి పంటకు దోమ తెగులు సోకింది. దీనికి మందులు వేశాక చిగుళ్లు ఎర్రబడ్డాయి. అగ్గి తెగులు సోకినట్లు గుర్తించి మళ్లీ మందులు వేశాం. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇప్పుడు పాము పొడ తెగులు సోకింది. దీంతో మరోసారి పురుగుమందు పిచికారీ చేశాం. సాగుఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. పురుగుమందుల కోసం రూ.3,300 వ్యయం చేశాను. 

                            - బొడ్డు సత్యరావు, రైతు, లక్కిడాం 

పొడతెగులు సోకుతోంది

వరికి పాము పొడ తెగులు ఎక్కువగా సోకుతోంది. మొదటి దశలోనే నివారణకు ఎకరాకు 400 ఎంఎల్‌ హైక్సాకోనోజోల్‌ వాడాలి. తెగులు ఎక్కువగా ఉంటే నేటివా మందు ఎకరాకు 100 గ్రాములు పిచికారీ చేయాలి. ఆగ్గి తెగులుంటే ట్రైకోజాల్‌ ఎకరాకు 120 గ్రాములు వేయాలి. సుడిదోమ ఉంటే డ్రైనెటోప్యూరాన్‌ ఎకరాకు 50గ్రాములు, లేదా పైమెట్రోజన్‌ 120 గ్రాములు వినియోగించాలి. ఇలాంటి సస్యరక్షణ చర్యలతో తెగుళ్లను నివారించవచ్చు. 

                                             - గ్రేష్‌ హర్షలత, మండల వ్యవసాయ అధికారి



Updated Date - 2021-10-22T04:51:19+05:30 IST