Abn logo
Jun 23 2021 @ 13:39PM

7 వేల మందికి కరోనా టీకాలు అందించిన పిట్టి ఇంజినీరింగ్

హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారితో పోరాడుతున్న దేశానికి మద్దతునందించడంతో పాటుగా తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించడంలో భాగంగా పిట్టి ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ 7 వేల మందికి కరోనా టీకాలను అందించింది. వారం రోజులుగా నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమాల ద్వారా హైదరాబాద్‌, ఔరంగాబాద్‌లలోని తమ తయారీ కేంద్రాలు, కార్పోరేట్‌ కార్యాలయాల వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రెండు మోతాదుల టీకాలను పూర్తి ఉచితంగా ఉద్యోగులకు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం పలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో కంపెనీ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా రెండు కోట్ల రూపాయలను ఖర్చుచేసింది.


 ఈ కార్యక్రమం గురించి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ఛైర్మన్‌ అక్షయ్‌ ఎస్‌ పిట్టి మాట్లాడుతూ.. ‘‘కార్యాలయాలు, తయారీకేంద్రాలలో ఉద్యోగులకు సురక్షిత వాతావరణం అందించాలనే ప్రభుత్వ మార్గదర్శకాలను మేము అనుసరిస్తున్నాము. మా ఉద్యోగులతో పాటుగా 7వేల మంది ప్రజల టీకా ఖర్చులను భరించడమనేది కోవిడ్‌–19తో పోరాడుతున్న దేశానికి మా వంతు సహకారంగా భావిస్తున్నాం. వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరూ టీకాలను వేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారిని జయించేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.