ఆలోచనా విధానంలో పురుషులకన్నా ఆమె ఒక మెట్టు పైనే..

ABN , First Publish Date - 2021-03-09T06:39:34+05:30 IST

కుటుంబ నిర్వహణతోపాటు ఉద్యోగ జీవితంలో పనిచేసేతీరు, ఆలోచనా విధానంలో పురుషులతో పోల్చితే మహిళలు ఒక మెట్టు పైనే ఉంటున్నారని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి చెప్పారు.

ఆలోచనా విధానంలో పురుషులకన్నా ఆమె ఒక మెట్టు పైనే..
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన స్వేచ్ఛ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, పక్కన జేసీలు

 అంతర్జాతీయ  మహిళా దినోత్సవంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి8: కుటుంబ నిర్వహణతోపాటు ఉద్యోగ జీవితంలో పనిచేసేతీరు, ఆలోచనా విధానంలో పురుషులతో పోల్చితే మహిళలు ఒక మెట్టు పైనే ఉంటున్నారని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్లు చేకూరి కీర్తి, జి రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలి తదితరులతో కలిసి మహిళా దినోత్సవ సభలో కలెక్టర్‌ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పఽథంలో నడిపించడంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మహిళా ఉద్యోగులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో కీలక స్థానాల్లో మహిళలు ఉన్నారని, కొవిడ్‌ క్లిష్ట సమయంలో బాధితులకు కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న పరిస్థితుల్లో జేసీలు కీర్తి, రాజకుమారి విధి నిర్వహణలో చూపిన చొరవ మరువలేనిదన్నారు. వీరితోపాటు కొవిడ్‌ సెంటర్ల వద్ద విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో ఎంతో నిబద్ధతతో పనిచేసే మహిళా ఉద్యోగులు, సిబ్బంది ఉండడం అదృష్టమని కలెక్టర్‌  పేర్కొన్నారు. జేసీ కీర్తి మాట్లాడుతూ విశాల దృక్పఽథాన్ని పెంపొందించుకుని ఎదిగినప్పుడే నిజమైన సాధికారిత సొంతమవుతుందన్నారు. ప్రతి మహిళ మార్పు దిశగా ముందడుగు వేయాలని సూచించారు. జేసీ రాజకుమారి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుని ముందుకు పయనించాలన్నారు. చేసే ప్రతి పనిని ఆస్వాదించినప్పుడే సానుకూల శక్తి లభిస్తుందన్నారు. ఇక కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడిగా నిర్వహించిన నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌-2021లో జిల్లా, రాష్ట్ర స్థాయిలను దాటి ఫైనల్‌కు చేరుకుని జిల్లా కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డి లక్ష్మీశ్రీలేఖను కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సత్కరించారు. శ్రీలేఖ మాట్లాడుతూ మహిళలు చెప్పాలనుకున్నది ఽఽధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలని పేర్కొన్నారు. 

సందడిగా జరిగిన వేడుకలు..

కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా దినోత్సవం, బాల్య వివాహాల నిర్మూలన అంశాలపై చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. వివిధ శాఖల్లో విశేష సేవలందించిన మహిళలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. బాలికలు నెలవారి సమయంలో తీసుకోవాల్సిన  సంరక్షణకు సంబంధించి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన స్వేచ్ఛ పోస్టర్‌ను కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ బి పద్మావతి, జేజేబీ మెంబర్‌ వై పద్మలత, బీసీ కార్పొరేషన్‌ ఈడీ సుబ్బలక్ష్మి, ఎస్‌పీ కార్పొరేషన్‌ ఈడీ సునీత, బీసీ కార్పొరేషన్‌ డీడీ మయూరి, ఐసీడీఎస్‌ పీడీ డి పుష్పమణి, ఏపీడీ డి విజయలక్ష్మి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-09T06:39:34+05:30 IST