ఆ పాపం విపక్షాలదే
ABN , First Publish Date - 2020-12-26T08:20:47+05:30 IST
నెలరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడానికి విపక్షాలే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘ఆందోళనకు మద్దతు ముసుగులో పార్టీలు తమ ఎజెండాను ముందుకు తోశాయి. ఆందోళన ప్రారంభ సమయంలో ఎమ్మెస్పీపై హామీని మాత్రమే రైతులు కోరారు...
- చర్చల్లో ప్రతిష్టంభనకు వారే కారణం
- ఆందోళన వెనుక మా ప్రత్యర్థుల ఎజెండా
- ఎమ్మెస్పీ బదులు నిందితులను విడుదల చేయాలని డిమాండ్లు
- అసత్యాలతో రైతుల తప్పుదోవ
- రైతు జీవితాలతో పార్టీల చెలగాటం
- ప్రతిపక్షాలపై తీవ్రంగా ధ్వజమెత్తిన మోదీ
- దేశమంతా కొత్త చట్టాలకు మద్దతు
- ఏ రైతూ భూమి కోల్పోడని భరోసా
- పీఎం-కిసాన్ కింద 18వేల కోట్లు విడుదల
- రైతు భూమిని కంపెనీలు ఆక్రమించుకోవు
- పంటల అమ్మకానికే సంస్థలతో ఒప్పందం
- చట్టాలపై అబద్ధాలు చెబుతున్నారు: మోదీ
- 7 రాష్ట్రాల రైతులతో ప్రధాని ఇష్టాగోష్ఠి
...భగవంతుడు మొత్తం జ్ఞానాన్ని మాకే ఇచ్చాడని మేమేమీ చెప్పుకోవడం లేదు. మేం తెచ్చిన చట్టాలను వాస్తవాధారంగా, తార్కికంగా చూడాలి. ఇది ప్రజాస్వామ్యం. లోపాలుంటే వాటిని తప్పనిసరిగా ఎత్తిచూపొచ్చు. సవరణలకు మేం సంసిద్ధత చూపాం. ఈ దేశంలో 80ు మంది పేద రైతులు. చిన్న కమతాల వారు. వారి ప్రయోజనం కోసం సంస్కరణలు అవసరం. చాలా రాష్ట్రాల్లో ఈ మధ్య పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అన్నిటా బీజేపీ గెలిచింది. ఈ పంచాయతీల్లో ఎక్కువమంది ఓటర్లు రైతులే. ప్రస్తుతం ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్నది కూడా వారే. మాకు ఆ రైతులందరి మద్దతూ లభించింది.
- రైతులనుద్దేశించి ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, డిసెంబరు 25: నెలరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడానికి విపక్షాలే ప్రధాన కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ‘ఆందోళనకు మద్దతు ముసుగులో పార్టీలు తమ ఎజెండాను ముందుకు తోశాయి. ఆందోళన ప్రారంభ సమయంలో ఎమ్మెస్పీపై హామీని మాత్రమే రైతులు కోరారు. వారంతా రైతులు కాబట్టి సహజంగానే ఇలాంటి భయాలు వారికి ఉంటాయి. కానీ ఆ తరువాత రాజకీయ శక్తులు ప్రవేశించి తమ సిద్ధాంతాలను రుద్దారు. ఇపుడు ఎమ్మెస్పీ అంశం పక్కన పడింది. హింసకు ప్రోద్బలమిచ్చారని అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని (నక్సల్-అనుకూల హక్కుల నేతలను) విడుదల చేయాలన్న డిమాండ్ వచ్చింది. హైవేలపై టోల్ వసూలు చేయరాదన్నది మరో డిమాండ్.. ఇవన్నీ రైతుకు బాసట పేరిట విపక్షాల ఎజెండా’ అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టాల వల్ల రైతు సర్వం కోల్పోతాడని దుష్ప్రచారం చేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. పీఎం-కిసాన్ పథకం కింద 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఏడోవిడత మొత్తం రూ.2,000 చొప్పున (రూ.18 వేల కోట్లను) ఆన్‌లైన్ బదిలీని బటన్ నొక్కి లాంఛనంగా జరిపాక శుక్రవారం ఆయన వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొందరు రైతులతో సంభాషించారు.
‘చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారితో సహా అందరు రైతులతో మేం విశాల హృదయంతో అరమరికల్లేకుండా చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన పార్టీలు తమ స్వలాభం కోసం, టీవీల్లో కనిపించడం కోసం రైతుల్లో లేనిపోని భయాలు కల్పిస్తున్నాయి. రైతుల భుజాలపై తుపాకీ ఆన్చి కాల్పులు జరిపి చర్చలు సాగకుండా చేస్తున్నాయి’ అని దుయ్యబట్టారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు మేం తెచ్చిన చట్టాలను స్వాగతిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఉందనుకోవడం ఒఠ్ఠి భ్రమ అనీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై పరోక్షంగా స్పందిస్తూ- ‘ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారు నాపై లేనిపోని అభాండాలు వేస్తూనే ఉంటారు. రైతులను నేను కోరేదొకటే... ప్రభుత్వంతో చర్చలకు రండి..’’ అని మోదీ అన్నారు. మాజీ ప్రధాని వాజపేయి జయంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా రైతులకు చేరేట్లు ఏర్పాట్లు చేసింది. సుమారు 19వేల వేదికల ద్వారా ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్షప్రసారం చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ సర్కార్ల మంత్రులు, నేతలు పాల్గొని రైతులను సమీకరించారు.
ఏ కార్పొరేటూ భూమిని లాక్కోలేదు : షా
నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం దేశంలోని ఏ కంపెనీ లేదా ఏ కార్పొరేట్ సంస్థా రైతుల భూములను లాక్కోలేదని, ఈ విషయంలో రైతులు నిశ్చింతగా ఉండవచ్చని హోంమంత్రి అమిత్ షా భరోసానిచ్చారు. ఢిల్లీ లోని కిషన్‌గఢ్ గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఆయన పాల్గొన్నారు. అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రైతులకో సూచన చేశారు. ‘ఓ ఏడాదో రెండేళ్ల పాటో కొత్త చట్టాల అమలును చూడండి. అప్పటికీ ఇవి రైతులకు లాభదాయకం కాదని భావిస్తే సవరణలు తేవడానికి మేం సిద్ధం’’ అని అన్నారు. యూపీఏ హయాంలో కంటే ఎన్‌డీఏ పాలనలో పంజాబ్ రైతులకు రెండేళ్లలో రెట్టింపు ఎంఎస్పీ లభించిందని, ఏటేటా వారికి మద్దతు ధర పెరుగుతూనే ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెన్నైలో రైతు వేదికలో చెప్పుకొచ్చారు.
మోదీ- దీదీ ఢీ
పశ్చిమబెంగాల్, కేరళ ప్రభుత్వాలపై మోదీ తీవ్రంగా దాడిచేశారు. రాజకీయ దురుదేఽ్దశాలతో మమతా బెనర్జీ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ నిధులు అందకుండా చేస్తోందని దుమ్మెత్తారు. ‘మమత సిద్ధాంతాలు బెంగాల్‌ను సర్వనాశనం చేశాయి. ఆమె 15 ఏళ్ల కిందట చేసిన ప్రసంగాన్ని వింటే ఆమె సిద్ధాంతాలు ఎలా బెంగాల్‌ను దెబ్బతీశాయో అర్థమవుతుంది’’ అని మోదీ ఘాటుగా విమర్శించారు. దీనికి మమత దీటుగా కౌంటర్ ఇచ్చారు. ‘మేం అనేక కేంద్ర పథకాలను అమలుచేస్తున్నాం. రైతుకు ప్రయోజనం కల్గించే వాటిని ఎందుకు ఆపుతాం? రాజకీయ లబ్ధి కోసం నాపై బురద జల్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నా వరకూ బెంగాల్ అంటే నా కుటుంబం’ అని మమత బదులిచ్చారు. అటు కేరళలోని వామపక్ష ప్రభుత్వంపై కూడా మోదీ దాడిచేశారు. మండీల వ్యవస్థను కేరళ ఏనాడో రద్దు చేసిందన్నారు. ఏళ్ల తరబడి కేరళను పాలించినవారు అక్కడ ఏపీఎంసీలు ఎందుకు లేవో చెప్పాలన్నారు. తమ రాష్ట్రంలో చేయకుండా పంజాబ్ రైతులతో చేతులు కలపడం వెనుక రాజకీయ ఉద్దేశాలు గాక మరేంటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 1000 మండీలను తమ ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించిందని, సుమారు రూ.లక్ష కోట్ల వ్యాపారం జరుగుతోందని పేర్కొన్నారు.
ప్రధాని ప్రసంగ సమయంలో పళ్లాలు చరిచిన రైతులు
మోదీ ప్రసంగిస్తున్నంత సేపూ ఆందోళన చేస్తున్న రైతులు ప్లేట్లు, పళ్లాలు చరిచి, గంటలు మోగించి, నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ‘ఈరోజు కూడా మోదీ తన మనసులో మాటలు చెప్పారు తప్ప రైతుల మదిలో ఏముందో తెలుసుకోలేదు’ అని భారతీయ కిసాన్ యూనియన్(లోక్‌శక్తి) ప్రతినిధి శైలేశ్ గిరి అన్నారు. చట్టాలకు మద్దతు పలుకుతున్న రైతు గ్రూపులను ద్రోహులుగా అభివర్ణించారు. పంజాబ్‌లో అనేక చోట్ల బీజేపీ నిర్వహించిన రైతువేదికల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. భటిండాలో రైతు వేదికను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు కార్యకర్తలు గాయపడ్డట్లు బీజేపీ తెలిపింది. అటు ఫగ్వారాలో బీజేపీ నాయకులను ఓ హోటల్‌లో రైతులు ఘెరావ్ చేశారు.