‘కరోనా’పై 4న అఖిలపక్షం

ABN , First Publish Date - 2020-12-01T07:16:23+05:30 IST

దేశంలో కరోనా సంక్షోభ స్థితిగతులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో డిసెంబరు 4న అఖిలపక్ష సమావేశం జరగనుంది...

‘కరోనా’పై 4న అఖిలపక్షం

  • ప్రధాని మోదీ నేతృత్వంలో ‘వర్చువల్‌’ సమావేశం
  • సంక్షోభం మొదలైన తర్వాత ఇది రెండోసారి
  • రెడ్డీస్‌, బయోలాజికల్‌-ఈలతో సమీక్ష
  • ఏప్రిల్‌లోగా వ్యాక్సిన్‌: కేంద్ర ఆరోగ్యశాఖ


న్యూఢిల్లీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా సంక్షోభ స్థితిగతులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో డిసెంబరు 4న అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి హాజరుకావాలంటూ పార్లమెంటులోని ఉభయసభలకు చెందిన అన్ని రాజకీయపార్టీల ఫ్లోర్‌లీడర్లకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశం వర్చువల్‌గా జరగనుందని సమాచారం. దీనికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌వర్ధన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి. ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో రెండోస్థానానికి భారత్‌ (94 లక్షలకుపైగా కేసులు) చేరిన క్లిష్ట తరుణంలో జరుగుతున్న ఈ అఖిలపక్ష సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైన భారత్‌ బయోటెక్‌ (హైదరాబాద్‌),  సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (పుణె), జైడస్‌ క్యాడిలా (అహ్మదాబాద్‌)కంపెనీల ప్లాంట్లను ఇటీవల ప్రధాని సందర్శించారు. ఈనేపథ్యంలో అఖిలపక్ష భేటీలో వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ, వ్యాక్సినేషన్‌ అంశాలపై విస్తృత చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరుగుతున్నందున.. పార్లమెంటు శీతాకాల సమావేశాలను, బడ్జెట్‌ సమావేశాల్లో కలిపివేయాలనే ప్రతిపాదనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం గమనార్హం. కాగా, 2021 మార్చి లేదా ఏప్రిల్‌లోగా దేశ  ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష్‌వర్ధన్‌ సోమవారం అన్నారు. జూలై-ఆగస్టు కల్లా దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్‌ కంపెనీల యాజమాన్యాలు, శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ సోమవారం ఉదయం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ కరోనా వ్యాక్సిన్లు ఏయే అభివృద్ధి దశల్లో ఉన్నాయనే అంశాన్ని ప్రధానికి వివరించారు. వ్యాక్సిన్‌తో ముడిపడిన రెగ్యులేటరీ అంశాలపై కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కోరారు.  


ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో తగ్గిన యాక్టివ్‌ కేసులు

దేశంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళల్లో యాక్టివ్‌ కేసులు భారీగా తగ్గాయి. పండుగల నేపథ్యం, సెలవు రోజుల్లో పరీక్షలు తగ్గడమే దీనికి కారణం. తాజాగా ఆదివారం 8.76 లక్షల టెస్టులే చేశారు. శనివారం చేసిన టెస్టులతో పోలిస్తే ఇవి 4 లక్షలపైగా తక్కువ కావడం గమనార్హం. మొత్తమ్మీద దేశంలో వారపు సగటు కేసులు నవంబరు చివరి మూడు వారాల్లో 2.91లక్షల మధ్యనే ఉన్నాయి.  వరుసగా రెండో రోజూ దేశంలో అత్యధిక కేసులు కేరళ (5,643)లోనే నమోదయ్యాయి.రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరి(59) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ఈ నెల 14 నుంచి బీచ్‌లలోకి ప్రజలను అనుమతించనున్నారు. కాగా, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థలను తనిఖీ చేయాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. 


Updated Date - 2020-12-01T07:16:23+05:30 IST