నూతన విద్యా విధానం ఓ గేమ్ ఛేంజర్ : మోదీ
ABN , First Publish Date - 2021-02-19T17:59:25+05:30 IST
నూతనంగా రూపొందించిన విద్యావిధానం భారత్ విశ్వగురు స్థానంలో నిలపడానికి ఉపకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు
న్యూఢిల్లీ : నూతనంగా రూపొందించిన విద్యావిధానం భారత్ విశ్వగురు స్థానంలో నిలపడానికి ఉపకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ విశ్వగురు వైపు ప్రయాణించడానికి ఈ విద్యా విధానం దోహదపడుతుందని తెలిపారు. విశ్వ భారతి యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. విద్యా విప్లవంలో ఈ విధానం ఓ గేమ్ ఛేంజర్ అని ఆయన పేర్కొన్నారు. నూతన విద్యావిధానం దేశాన్ని ఆత్మనిర్భర భారత్ వైపు తీసుకెళ్తుందని, కొత్త కొత్త ఆవిష్కరణలకు, ప్రయోగాలకు కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. మేధస్సులో సకారాత్మక, నకారత్మక రెండు ఆలోచనలూ ఉంటాయని, రెంటికీ తగ్గ దారులూ ఉంటాయని, అయితే ఏ వైపుగా వెళితే సమస్య తీరిపోతుందన్న దానిపై మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని, హింసను ప్రేరేపించేవారంతా బాగా చదువుకున్న వారేనని, బాగా నైపుణ్యం కలవారని వివరించగా, మరోవైపు కోవిడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కాపాడడానికి అహోరాత్రాలు శ్రమిస్తున్నవారూ ఉన్నారని మోదీ గుర్తు చేశారు. ఇదంతా సైద్ధాంతిక భూమిక ఎంత మాత్రమూ కాదని, అది ఆలోచనా విధానమని మోదీ వివరించారు.