ప్రణబ్, మన్మోహన్ సింగ్, దేవె గౌడలకు మోదీ ఫోన్

ABN , First Publish Date - 2020-04-05T21:40:17+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇద్దరు మాజీ రాష్ట్రపతులు,

ప్రణబ్, మన్మోహన్ సింగ్, దేవె గౌడలకు మోదీ ఫోన్

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఇద్దరు మాజీ రాష్ట్రపతులు, ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులు, వివిధ పార్టీల అగ్ర నేతలకు ఫోన్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నేతలతో ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి చర్చించినట్లు తెలుస్తోంది. 


మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధాన మంత్రులు డాక్టర్ మన్మోహన్ సింగ్, దేవెగౌడలకు మోదీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో మోదీ ఏం మాట్లాడారో అధికారికంగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేనటువంటి కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం, దానిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యల గురించి మోదీ వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


మోదీ ఫోన్ చేసినవారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అగ్ర నేత ములాయం సింగ్ యాదవ్, ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీ దళ్ అగ్ర నేత ప్రకాశ్ సింగ్ బాదల్ ఉన్నట్లు తెలుస్తోంది.


కోవిడ్-19పై పోరాటానికి దేశమంతా కలిసికట్టుగా ముందుకు రావలసిన అవసరం ఉందని మోదీ చెప్తున్న సంగతి తెలిసిందే.


కోవిడ్-19పై పోరాడేందుకు దేశమంతటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మోదీ మాజీ దేశాధినేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్లమెంటులో ప్రాతినిథ్యం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.


Updated Date - 2020-04-05T21:40:17+05:30 IST