ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య విద్యా సంస్థ ఉండాలి: మోదీ

ABN , First Publish Date - 2021-09-30T22:35:57+05:30 IST

పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోసం దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య

ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య విద్యా సంస్థ ఉండాలి: మోదీ

న్యూఢిల్లీ : పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోసం దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఒక వైద్య కళాశాల లేదా సంస్థ ఉండే విధంగా తన ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వైద్య విద్య, ఆరోగ్య సేవల బట్వాడా మధ్య అంతరం తగ్గిపోతోందన్నారు. ఆయుర్వేదం, యోగాలను ప్రోత్సహించడంతోపాటు నిరోధక ఆరోగ్య సంరక్షణపై తన ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. 


రాజస్థాన్‌లో నాలుగు వైద్య కళాశాలలకు శంకుస్థాపనలు, పెట్రోకెమికల్స్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆరు సంవత్సరాల్లో 170కి పైగా వైద్య కళాశాలలు పూర్తయ్యాయని చెప్పారు. మరో 100 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 


మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పని తీరుపై చాలా ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఫలితంగా వైద్య విద్య నాణ్యత, ఆరోగ్య సేవల బట్వాడాలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. దీనికి బదులుగా నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అనేక సవాళ్ళు, విస్తృత స్థాయి కృషి అనంతరం ఏర్పాటు చేసిన నేషనల్ మెడికల్ కమిషన్ ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోందన్నారు. 


Updated Date - 2021-09-30T22:35:57+05:30 IST