పోలింగ్‌ కేంద్రాల్లో పీఓలే కీలకం..!

ABN , First Publish Date - 2020-12-01T07:23:44+05:30 IST

నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌.

పోలింగ్‌ కేంద్రాల్లో పీఓలే కీలకం..!

నిబంధనల ప్రకారం ఓటింగ్‌ వారి బాధ్యతే

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌. ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగాలంటే పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది కీలకం. ఓటర్లను గుర్తించడం నుంచి చెల్లుబాటయ్యే లా ఓటు వేయించడం వరకు వీరి పాత్ర కీలకం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్‌ ప్రక్రి య ఎలా ప్రారంభించాలి, ఎలా నిర్వహించాలి, ముగిసిన అనంతరం ఏం చేయాలి, ఎలాంటి వివాదాలు, అనుమానాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న దానిపై ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు దాదాపు 23 వేల మందికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అదే సమయంలో పోలింగ్‌ సమయంలో పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన బుక్‌లెట్‌ అందజేశారు. దాదాపు 18 యేళ్ల అనంతరం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ ద్వారా జరుగుతోన్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పీవోలు, ఏపీవోలు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. 

చేయాల్సినవి.. 

 పీవోలు, ఏపీవోలు పోలింగ్‌ కేంద్రంలో వసతుల కల్పన, రక్షణా ఏర్పాట్లు పరిశీలించాలి. 

 పోలింగ్‌ రోజున వచ్చే ఏజెంట్ల ముందు బ్యాలెట్‌ బాక్స్‌ను తెరిచి చూపించాలి. 

 సీల్‌ సరిగా ఉందా, లేదా, తనిఖీ చేయాలి. 

 ఉదయం 6 గంటల నుంచి 6.15 వరకు ఏజెంట్ల ఎదుట మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలి. 6.55 గంటలకు బ్యాలెట్‌ బాక్సులు సీల్‌ వేసి, 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలి.

 ఓటర్ల గుర్తింపు కార్డును సరిగా తనిఖీ చేయాలి. వ్యక్తి అతనేనా, కాదా, అని పరిశీలించాలి. ఓటరు పేరు, క్రమ సంఖ్య సరైనదా, కాదా, అని అక్కడి పోలింగ్‌ ఏజెంట్లను అడిగి తెల్సుకోవాలి. 

 ఏజెంట్లు ఓకే అన్నాక.. ఓటరుతో సంతకం/వేలిముద్ర తీసుకొని బ్యాలెట్‌ పేపర్‌ ఇవ్వాలి. 

 ఈ మొత్తం ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా రీ పోలింగ్‌ చేయాల్సి ఉంటుంది. 

 పోలింగ్‌ శాతానికి సంబంధించిన వివరాలను ప్రతి గంటకు రిటర్నింగ్‌ అధికారికి పంపించాలి. 

 లేని ఓటు వేసేందుకు ఎవరైనా వస్తే స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసి అప్పగించాలి. 

 పోలింగ్‌ ముగిసిన అనంతరం ఏజెంట్ల సంతకాలు తీసుకొని బ్యాలెట్‌ బాక్స్‌లను సీల్‌ చేసి, డీఆర్‌సీ కేంద్రంలో అప్పగించాలి. 

 పోలింగ్‌ అనంతరం డీఆర్‌సీ కేంద్రం వద్ద తీసుకున్న బ్యాలెట్‌ పేపర్లు ఎన్ని, వినియోగించనివి ఎన్ని, అన్న వివరాలు రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అప్పగించాలి. 

 టెండర్‌ ఓట్లు పడితే రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి. ఓ వ్యక్తి ఓటును ఆయన రాక ముందే మరొకరు వేస్తే, దానిని టెండర్‌ ఓటుగా పరిగణిస్తారు. ఆ పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్‌ నిర్వహించాలా, వద్దా, అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.

Updated Date - 2020-12-01T07:23:44+05:30 IST