పెరగని పొగాకు ధర

ABN , First Publish Date - 2021-06-16T03:39:09+05:30 IST

పొగాకు రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలే మిగులనున్నాయి. పెట్టిన పెట్టుబడులకు సరైన గిట్టుబాటు ధర లభించక ఆందోళన చెందుతున్నారు.

పెరగని పొగాకు ధర
పొగాకు వేలన్ని పరిశీలిస్తున్న ఆర్‌ఎం వేణుగోపాల్‌

నష్టాల్లో రైతులు

ఆదుకోని ప్రభుత్వం

మర్రిపాడు, జూన్‌ 15: పొగాకు రైతులకు ఈ ఏడాది కూడా నష్టాలే మిగులనున్నాయి. పెట్టిన పెట్టుబడులకు సరైన గిట్టుబాటు ధర లభించక ఆందోళన చెందుతున్నారు. బయట మార్కెట్‌లో సిగరెట్ల ఆకాశాన్నంటుతున్నా రైతు పండించే పొగాకుకు మాత్రం గిట్టుబాటు ధర లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటానని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పెదవి విరుస్తున్నారు. జిల్లాలోని డీసీపల్లి, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల పరిధిలో దాదాపుగా 11 మండలాల్లో వేల మంది రైతులు వర్జానియా పొగాకు సాగు చేస్తున్నారు. ఏడాదికేడాది పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నా మరో గత్యంతరం లేక అదే పంటను సాగు చేస్తున్నారు. అయితే పెట్టుబడులకు తగ్గట్టు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు  చేసుకున్నారు. అయినా నేటికీ గిట్టుబాటు ధర లభించక ఆందోళనలు చేపడుతున్నారు. అయినా ప్రభుత్వం కానీ, బోర్డు అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. వేలం ప్రారంభం నుంచి కిలో పొగాకు ధర గరిష్ఠంగా రూ.181లకు మించలేదు. అది కూడా నామమాత్రంగా ఏదో ఒక బేళుకు మాత్రమే. దీంతో రైతులు నష్టపోక తప్పడంలేదు.

ఆర్‌ఎం సందర్శించినా..

ఎన్నడూ లేని విధంగా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు రీజనల్‌ మేనేజర్‌ పలుమార్లు సందర్శించి ధరలను పరిశీలించారు. ఈ తరుణంలో ధరలు పెరుగుతాయని ఆశపడ్డ రైతాంగానికి నిరాశ తప్పలేదు. ఒక వేలం కేంద్రాన్ని పలుమార్లు సందర్శించడం ఇదే మొదటిసారి. ఇలా వస్తున్నారు.. అలా వెళ్తున్నారే తప్ప రైతులకు మాత్రం న్యాయం జరగడం లేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని రీజనల్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌ సందర్శించి పొగాకు వేలాన్ని పరిశీలించారు. కరోనాపై జాగ్రత్తలు తప్పనిసరి అని అన్నారు తప్ప ధరలను గురించి మాట్లాడక పోగా పచ్చిరొట్ట ఎరువులు, కోనా గురించి మాట్లాడి చేతులు దులుపుకోవడం గమనర్హం.


Updated Date - 2021-06-16T03:39:09+05:30 IST