ఇసుక అక్రమ దందాపై పోలీసుల ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-06-14T05:59:49+05:30 IST

మంథని ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఇసుక అక్రమ దందాపై పోలీసుల ఉక్కుపాదం
పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు

- వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు దాడులు

- 15 ట్రాక్టర్లు సీజ్‌.. 25 మంది కేసులు నమోదు

- గోదావరి, మానేరును కొల్లగొడుతున్న అక్రమార్కులు

- పట్టించుకోని రెవెన్యూ శాఖ అధికారులు

మంథని/మంథనిరూరల్‌, జూన్‌ 13: మంథని ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందాపై కొరడా ఝులిపిస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు మంథనికి సీఐ జీ సతీష్‌, ఎస్‌ఐ చంద్రకుమార్‌, పీఎస్‌ఐ అజయ్‌లు ప్రధానంగా దృష్టి సారించారు. మంథని ప్రాంతంలో వారంరోజుల వ్యవధిలోనే రెండుసార్లు దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లను సీజ్‌ చేయడంతోపాటు 20మందిపై కేసులు నమోదు చేయడం సంచనలం రేపుతోంది. గత మే 27న మండలంలోని గోపాల్‌పూర్‌ శివారులోని మానేరు నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టకొని మేదరి నారాయణ, కౌటం నారాయణ, బొడ్డు కృష్ణకాంత్‌, లట్ట రవిలపై కేసులు నమోదు చేశారు. ఈనెల 6న మంథని మండలంలోని గోపాల్‌పూర్‌ శివారులోని మానేరునది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 ట్రాక్టర్లను ఎస్‌ఐ చంద్రకుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి మంథనికి చెందిన రాచర్ల నాగరాజు, మీసాల రాకేష్‌, మోత్కు రాజబాబు, మంథని సాయి, మీసాల రమేష్‌లపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆదివారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామశివారులోని గోదావరినది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 8 ట్రాక్టర్లను పట్టుకొని 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రకుమార్‌ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న గుంజపడుగు గ్రామానికి చెందిన ఐలి సాయి, చింతం శ్రావణ్‌, సాదుల తిరుపతి, తాళ్ళపల్లి సాయికృష్ణ, మబ్బు గాంధీ, ఐలి సత్తయ్య, ఆరేళ్ళ సాయివినయ్‌, ఐలి రవి, ఐలి హరీష్‌, బండి ఓదెలు, పందుల కృష్ణ, బుర్ర శ్రీనివాస్‌, ఓరగంటి రవి, బొడ్డు సంపత్‌, ఓరగంటి శేఖర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం..

రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఈ ఇసుక దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిత్యం కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను వారు ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప దాడులు నిర్వహించడం లేదు. గ్రామాల నుంచి ఫిర్యాదులు చేసినా, సమాచారం ఇచ్చినా స్పందించడం లేని ఆరోపణలున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఏళ్ళ తరబడి మంథని ప్రాంతంలోని గోదావరి, మానేరు నదులను కొల్లగొడుతున్న ఇసుక అక్రమ రవాణాదారులకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. నిఘాను ఇలానే కొనసాగించి పూర్తి స్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

ఇసుక అక్రమ రవాణా జరుగుతోందిలా.. 

మంథని మండలంలో గోదావరినది, మంథని, ముత్తారం మండలాల పరిధిలో ప్రవహిస్తున్న మానేరు నదిలో నిత్యం వందలాది ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొందరు ఈ అక్రమ దందాకు పూనుకుంటున్నారు. మంథని మండలంలోని అడవిసోమన్‌పల్లి, గోపాల్‌పూర్‌, చిన్నఓదాల, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, జిల్లెలపల్లి, ఓడెడ్‌, అడవిశ్రీరాంపూర్‌ గ్రామ శివార్లలోని మానేరు నదుల్లో, మంథని మండలంలోని గుంజపడుగు శివారులో గోదావరినదిలో నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నిత్యం అక్కడ క్వారీలను తలపించే విధంగా కూలీలు ఇసుకను తోడేస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా మంథని, బేగంపేట, సెంటినరీకాలనీ, గోదావరిఖనిలాంటి ప్రాంతాలకు తరలించి ట్రిప్‌కు రూ.3 నుంచి 4వేల వరకు వసూల్‌ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు, యూత్‌ సభ్యులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా వారినుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా ఆలస్యంగా వస్తుండటంతో అక్రమ రవాణాదారులు తమ ట్రాక్టర్లను తరలించుకుపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ట్రాక్టర్‌కు రూ.1500 ఉండగా ఇప్పుడు రూ. 3వేల నుంచి రూ. 4వేల వరకు ఇంటి యజమానుల నుంచి వసూల్‌ చేస్తున్నారు. మానేరు ఇసుకకు ఇంత డిమాండ్‌ ఉండటంతో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. 

Updated Date - 2021-06-14T05:59:49+05:30 IST