పోలీసుల చేతికి కరోనా సంకెళ్లు?

ABN , First Publish Date - 2021-05-03T18:50:18+05:30 IST

ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌..

పోలీసుల చేతికి కరోనా సంకెళ్లు?

వణికిస్తున్న పాజిటివ్‌ రిపోర్టులు

రెచ్చిపోతున్న రౌడీమూకలు

పట్టుకోవాలంటే వెంటాడుతున్న భయం

స్టేషన్లలో నిందితులు ఉన్నంతసేపు వణుకే!

విపత్కర పరిస్థితులతో పోలీసుల్లో కలవరం


ఆంధ్రజ్యోతి- విజయవాడ: ప్రస్తుతం కరోనా సెకెండ్‌ వేవ్‌ పోలీసులకు భారంగా.. నేరస్థులకు వరంగా మారింది. గతంలోలాగా  సమాచారం అందగానే మరుక్షణమే జీపెక్కి నేరస్థులను వెంటాడి.. వేటాడి పట్టుకుని స్టేషన్‌కు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించి నిజాలు రాబట్టేవారు. కానీ నేడు కరోనా మహమ్మారి వారి చేతులకు సంకెళ్లు వేసింది. ఎవరికి కరోనా ఉందో తెలియక సతమతమవుతూ వారిని పట్టుకునేందుకు.. అరెస్ట్‌ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో నేరస్థుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి...


సమాచారం పక్కా.. కానీ నిందితులను పట్టుకోవాలంటే భయం.. నిందితులు దొరికారు కానీ వారిని స్టేషన్‌లో కూర్చోబెట్టి విచారించాలంటేనే నరాల్లో వణుకుపుడుతోంది. అలాగని వచ్చిన సమాచారం విస్మరించలేని పరిస్థితి. ఇది విజయవాడ పోలీసులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి. ప్రస్తుతం కరోనా విజృంభణ వేరేస్థాయికి చేరుకుంది. ఎన్ని స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నా ఎలాగొలా కాటేస్తోంది. ఎలా సోకిందనే విషయం తెలియక కొంతమంది జట్టుపట్టుకుంటున్నారు. తల నుంచి కాళ్ల వరకు కప్పుకున్నా ఎలాగొలా శరీరంలోకి కరోనా వచ్చి చేరుతోంది. ఇప్పటికే పోలీసు శాఖలో అనేకమంది ఉద్యోగులను కాటేసింది. వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారు సైతం రెండో దశలో కరోనా బారిన పడ్డారు. ఒకపక్క ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మరోపక్క కేసుల విచారణ, ఇంకోపక్క నిందితుల అరెస్ట్‌.. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం పోలీసుల్లో మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. 


పట్టుకుంటే పాపం అయిపోతోంది

రెండు రోజుల క్రితం ఆంధ్రా, తెలంగాణలోని 37 మంది నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఆరుగురు ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కీలక సూత్రధారిగా విజయవాడకు చెందిన రేఖాశ్రీ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను గుర్తించారు. వీరిని 4రోజుల పాటు విచారించారు. తీరా కోర్టులో హాజరుపరిచే సమయానికి షాక్‌ తగిలింది. వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ప్రధాన సూత్రధారి రేఖాశ్రీకి పాజిటివ్‌ అని తేలింది. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. విచారించిన టీం మొత్తం హోం ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. గతంలో మాదిరిగా ప్రతికేసులో నిందితులను కోర్టులో హాజరుపరచలేని పరిస్థితి. ఒకవేళ తీసుకెళ్లినా న్యాయమూర్తి తిరస్కరిస్తున్నారు. తిరిగి వాళ్లను స్టేషన్‌లోనే పెట్టాల్సి వస్తోంది. వారికి సంకెళ్లు వేయటం, లాక్‌పలో పెట్టడం, అవసరాలు తీర్చే సమయంలోనూ వారిని పట్టుకోవాల్సి వస్తోంది. ఈ సమయాల్లో కరోనా ఎలా కాటు వేస్తుందో తెలియదు. లక్షణాలు బయటపడిన తరువాత వారితో మెలిగిన పోలీసులు మనోవేదన చెందుతున్నారు. సమాచారం ఉన్నా నిందితులను పట్టుకోకపోతే ప్రజలు తమని నిందిస్తారని, పట్టుకుంటే ప్రాణాలు పణంగా పెట్టడమేనని పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. 


శివారులో గ్రూపులు కడుతున్న రౌడీ మూకలు

కరోనా కారణంగా గొడవలు కొట్లాటలకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవటం, స్టేషన్‌లో ఉంచటం వంటి పరిస్థితులు లేకపోవటంతో రౌడీమూకలు రెచ్చిపోతున్నారు. గతంలో అయితే వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చి తమదైన శైలిలో హెచ్చరించేవారు. నేడు ఎవరినీ స్టేషన్‌కు తీసుకువచ్చి మందలించే పరిస్థితి లేకపోవటంతో రౌడీమూకలకు వరంగా మారింది. అంతేకాక పోలీసులు కరోనా నియంత్రణ చర్యలపై దృష్టి సారించటంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. పాయకాపురం, రాజీవ్‌నగర్‌ ప్రాంతాల్లో గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌లు గ్రూపులుగా చేరి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారు. వీరిపై పెట్టీకేసులు పెట్టి మందలించే పరిస్థితి లేదు. పెద్ద కేసులు కట్టి కోర్టుకు పంపే అవకాశం లేదు. ఇలాంటి రౌడీమూకలను స్థానిక అధికార పార్టీ చోటా, మోటా నేతలు పెంచి పోషిస్తూ గ్యాంగ్‌లను తయారు చేస్తున్నారు. పోలీసులు రాజీవ్‌నగర్‌లోని రౌడీగ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-05-03T18:50:18+05:30 IST