డబ్బు కోసమే..

ABN , First Publish Date - 2022-01-23T04:34:07+05:30 IST

డబ్బు కోసమే..

డబ్బు కోసమే..
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

రామచంద్రాపురం సర్పంచ్‌పై కాల్పులు

కేసు ఛేదించిన పోలీసులు

హనీట్రాప్‌ ఉచ్చులోకి లాగేందుకు ఓ మహిళ ప్లాన్‌

రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

ముగ్గురి అరెస్టు.. తుపాకీ స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 22: డబ్బు కోసమే గార మండలం రామచంద్రాపురం సర్పంచ్‌ గొలివి వెంకటరమణపై తుపాకీతో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తేల్చారు.  హనీట్రాప్‌ పేరిట అతనిని ఉచ్చులోకి దించి సొమ్ముచేసుకుందామని ఓ మహిళ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చివరకు ఆమెతోపాటు కాల్పుల ఘటనకు సహకరించిన మరో ఇద్దరు పోలీసులకు చిక్కారు. శ్రీకాకుళం నగరంలో ఈనెల 18న రాత్రి సంచలనం కలిగించిన కాల్పుల ఘటన కేసును పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌ విలేకరుల సమావేశంలో శనివారం వెల్లడించారు.  


 పక్కా ప్రణాళిక ప్రకారం..

శ్రీకాకుళం నగరం ఆదివారంపేటకు చెందిన కింజరాపు షాలినీది ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం. ఇక్కడి వ్యక్తిని వివాహం చేసుకొని ఆదివారంపేటలో స్థిరపడింది. ఈమె అధికారపార్టీ నాయకులకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొనేది. కొన్ని సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించేది. ఈ నేపథ్యంలో గార మండలం రామచంద్రాపురం సర్పంచ్‌ గొలివి వెంకటరణమూర్తితో షాలినీకి పరిచయం ఏర్పడింది. పలు కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొన్నారు. ఈ పరిచయాన్ని డబ్బుగా మార్చుకునేందుకు షాలినీ పక్కా ప్రణాళిక రచించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటున్న తన సోదరుడు గిరిని రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్‌లో తయారైన దేశీయ తుపాకీని కొనుగోలు చేశారు. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లో ఉన్న గిరి స్నేహితుడు మోహిత్‌ సహాయం తీసుకున్నారు. ఈ క్రమంలో గిరి, మోహిత్‌లు శ్రీకాకుళం చేరుకున్నారు. ఈ నెల 18న రాత్రి నగరంలోని మధునగర్‌లో ఓ గదిలో ఉంటున్న సర్పంచ్‌ వెంకటరమణ వద్దకు షాలినీ, గిరి, మోహిత్‌లు వెళ్లారు. తమకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఒప్పుకోకపోవడంతో  చివరకు రూ.2లక్షలైనా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అదే సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి షాలినీ ఉద్దేశపూర్వకంగా వెళ్లిపోయింది. వెనువెంటనే సర్పంచ్‌పై గిరి, మోహిత్‌ తుపాకీతో కాల్పులు జరిపారు. బుల్లెట్‌ వెంకటరమణ కడుపుపై భాగంలో రాసుకుంటూ గోడకు తగలింది. అక్కడి నుంచి ఆయన తప్పించుకుని ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


విజయనగరంలో పట్టుబడిన నిందితులు

సర్పంచ్‌ వెంకటరమణ ఫిర్యాదుతో ఏఎస్పీ విఠలేశ్వరరావు, శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో టూటౌన్‌, వన్‌టౌన్‌ సీఐలు ఈశ్వరప్రసాద్‌, అంబేడ్కర్‌, వన్‌టౌన్‌ ఎస్‌ఐ విజయకుమార్‌ బృందంగా ఏర్పడ్డారు. కాల్పులకు ప్రణాళిక రచించిన షాలినీని ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఫోన్‌ సంభాషణలు, వాట్సాప్‌ చాటింగ్‌లతో పాటు కాల్‌లిస్టును పోలీసులు సంపాదించారు. సెల్‌సిగ్నల్స్‌ ఆధారంగా గిరి, మోహిత్‌లను విజయనగరంలో పట్టుకుని శ్రీకాకుళం తీసుకువచ్చారు.  మొత్తం సూత్రధారి షాలినీ అని, రూ.10లక్షలతో బేరసారాలు చేసి.. చివరకు రూ.2లక్షలు అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేసిందని, తాము సహకరించినట్లు వారు పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో వారి నుంచి తుపాకీని, 7.65 మిల్లీమీటర్ల వ్యాసమున్న ఎనిమిది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్పీ అమిత్‌బర్దర్‌ వెల్లడించారు. కేసు విచారణలో చురుగ్గా వ్యవహరించిన పోలీసులను ఆయన అభినందించారు. 

Updated Date - 2022-01-23T04:34:07+05:30 IST