భూ అక్రమాలకు ఖద్దరు కాపలా

ABN , First Publish Date - 2021-08-28T06:20:30+05:30 IST

మార్కాపురం నియోజకవర్గంలో... ము ఖ్యంగా మార్కాపురం మండలంలో జరిగిన భూఅక్రమాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భూ అక్రమాలకు ఖద్దరు కాపలా

అర్హులకు న్యాయం జరిగేనా? 

విచారణ తీరుపై సందేహాలు

తప్పుచేసిన వారికి అండగా అధికారపార్టీ నేతలు

మార్కాపురం, ఆగస్టు 27: మార్కాపురం నియోజకవర్గంలో... ము ఖ్యంగా మార్కాపురం మండలంలో జరిగిన భూఅక్రమాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకుల సిఫార్సులతోనే ఉద్యోగ విరమణ చేసిన తహసీల్దార్‌ అక్రమాలకు తెరతీశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన చేసిన అక్రమాలు, అధికార పార్టీ నాయకుల  సిఫార్సులను అడ్డంపెట్టుకొని వీఆర్వోలు తమ కుటుంబీకుల పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలతో పత్రికలలో కథనాలు వెలువడ్డాయి. స్పందించిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు జేసీ(రెవెన్యూ) వెంకట మురళి విచారణాధికారిగా భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనంను నియమించారు. దీంతో అక్రమార్కులను కాపాడేందుకు కొందరు అధికారపార్టీ నేతలు వ్యవహారం నడపడం ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి.


ఆర్‌ఐ, ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్‌

జేసీ ఆదేశాల మేరకు భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం రంగంలోకి దిగారు. తహసీల్దార్‌ విద్యాసాగరుడు జూన్‌లో డిజిటల్‌ సంతకం చేసిన ఫైళ్లను పరిశీలించే ప్రక్రియ చేపట్టారు. కేవలం విద్యాసాగరుడు ఉద్యోగ విరమణ చేయడానికి ముందు ఒక్క నెలలోనే 587 ఫైళ్లపై డిజిటల్‌ సిగ్నేచర్‌ చేసినట్లు ప్రాఽథమికంగా నిర్ధారించుకున్నారు. ఆయా ఫైళ్లను పరిశీలించి తొలుత ఏఆర్‌ఐ గోపి, రాయవరం వీఆర్వో గాయం సుబ్బారెడ్డి, మాకం కోటయ్యలపై నివేదికలను జేసీ మురళికి అందజేశారు. ఆయన సిఫార్సు మేరకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆ ముగ్గురినీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రెవెన్యూ శాఖలతో కలకలం రేగింది. 


అక్రమార్కులకు అండగా వైసీపీ నేతలు

విద్యాసాగరుడు సంతకం చేసిన 587 ఫైళ్లకు సంబంధించి, మండలంలోని ఇతర వీఆర్వోల పనితీరుపై ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం నిష్పక్షపాతంగా జేసీకి నివేదిక అందజేసినట్లు సమాచారం. సదరు నివేదిక ఆధారంగా మరో తొమ్మిది మంది వీఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు పడనుందని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం  జరిగింది. అయితే ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతను పరిరక్షించాల్సి జేసీ మురళి, అందుకు సంబంధించి నిర్ణయాలను తీసుకోవాల్సిన కలెక్టర్‌పై మార్కాపురం వైసీపీ నేతలు జిల్లాకు సంబంధించిన ఓ మంత్రి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో విచారణ అంతా పూర్తయినప్పటికీ భూ అక్రమార్కులపై చర్యల విషయంలో  జిల్లా రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సదరు వీఆర్వోలు సైతం మాకేం కాదు మాకు పెద్దల అండ ఉందని బహిరంగంగానే చెబుతున్నట్లు చర్చ జరుగుతోంది.


Updated Date - 2021-08-28T06:20:30+05:30 IST