సాగర్‌లో జోరందుకున్న రాజకీయం

ABN , First Publish Date - 2021-01-08T06:12:24+05:30 IST

సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో స్థానం ఖాళీ ఏర్పడడంతో నియోజకవర్గంలో రాజకీయం జోరందుకుంది.

సాగర్‌లో జోరందుకున్న రాజకీయం

 గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ
 టీఆర్‌ఎస్‌, బీజేపీలో పెద్దసంఖ్యలో ఆశావాహులు  
 ఇద్దరూ కాంగ్రెస్సే ప్రత్యర్థిగా ప్రకటన

మిర్యాలగూడ, జనవరి 7 :
సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో స్థానం ఖాళీ ఏర్పడడంతో నియోజకవర్గంలో రాజకీయం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు గ్రామ స్థాయిలో తమకున్న బలం, ప్రత్యర్థి బలహీనతలపై అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని భావిస్తున్నారు. ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా అన్ని పార్టీలు పావులు కదుపుతుండగా టీఆర్‌ఎస్‌, బీజేపీ తమ ప్రత్యర్థి కాం గ్రెస్సేనని ప్రచారం సాగిస్తున్నాయి. ఉప ఎన్నికను 2023 సాధారణ ఎన్నికలకు రిహార్సల్స్‌గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. సాగర్‌లో అనుసరించిన వ్యూహం ఫలిస్తే జనరల్‌ ఎన్నికల్లో అదే ఫార్ములాను అమలుచేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి ఎవరైతే ప్రజాదరణ లభిస్తుంది అనే దానితో పాటు ఎదుటి వారికి స్థానికంగా ఎంత బలం ఉందనే దానిపై గ్రామ స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి అభ్యర్థిత్వానికై పోటీ పెరుగుతోంది. వలస నేతల కన్నా ప్రజలకు అం దుబాటులో ఉండి మంచీచెడులు చూసుకునే స్థానికులకే సీటు ఇవ్వాలని సోషల్‌ మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి తమవర్గం వారికే టికెట్‌ ఇవ్వాలన్న వాదనను బలంగా తెరపైకి తెచ్చే ప్రయత్నం సాగిస్తున్నారు. అలాకాని పక్షంలో తాము బలపర్చిన వారికే టికెట్‌ ఇవ్వాలని అడిగేలా తెరవెనక లాబీయింగ్‌ చేస్తున్నారు. సాధారణ కార్యక్రమాలకు సైతం విశేష ప్రాధాన్యం కల్పిస్తూ జిల్లాస్థాయి నేతలు నియోజకవర్గంలో వాలిపోతున్నారు. ఉప ఎన్నికలో పోటీ చేయడంతో తమ బలాబలాలను పరీక్షించుకునేందుకు మరికొన్ని పార్టీలు సైతం ఎన్నికల బరిలో దిగుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. ఏదో ఒక రూపంలో నియోజకవర్గ ప్రజలకు టచ్‌లో ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. సొంత పార్టీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు కొందరు అత్యంత నమ్మకస్తులను నియమించి రాయబారాలు సాగిస్తుండగా, మరింత చీలికను తెచ్చి తమవైపు తిప్పుకోవాలని ఇతర పార్టీల వారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మేజర్‌ గ్రామపంచాయతీలు, మండల కేంద్రాల్లో తొలిరౌండ్‌ ప్రచారం దాదాపుగా పూర్తి చేయ గా టీడీపీ, ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించి ఉపపోరు బరిలో పోటీకి సై అంటున్నాయి. వామపక్ష నేతలు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతు సమస్యలపై పాదయాత్రలు చేపట్టి గ్రా మాల్లో పర్యటిస్తున్నారు. 

Updated Date - 2021-01-08T06:12:24+05:30 IST