తంతడి తీరం కలుషితం!

ABN , First Publish Date - 2021-01-17T06:07:50+05:30 IST

జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన అచ్యుతాపురం మండలం తంతడి శివారు వాడపాలెం తీరం కలుషితమవుతోంది.

తంతడి తీరం కలుషితం!
హేచరీ నుంచి పైప్‌లైన్‌ ద్వారా వ్యర్థాలు వస్తున్న దృశ్యం

 సమీప హేచరీ నుంచి వ్యర్థ జలాలు విడుదల

గత యాజమాన్యం సముద్ర గర్భంలో కలిసేలా పైప్‌లైన్‌ ఏర్పాటు

 ప్రస్తుతం వైసీపీ నాయకుడు ఆధీనంలో ఉండడంతో ఇష్టారాజ్యంగా పైపులు వేసి విడుదల

ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యాటకులు

 పట్టించుకోని అధికారులు

అచ్యుతాపురం, జనవరి 16 : జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన అచ్యుతాపురం మండలం తంతడి శివారు వాడపాలెం తీరం కలుషితమవుతోంది. ఇక్కడున్న ఓ హేచరీ వ్యర్థ జలాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇది చూసిన పర్యాటకులు ఆందోళన చెందుతున్నా.. అధికారుల్లో కనీస స్పందన కానరావడం లేదు.  ఇందుకు కారణం ఈ హేచరీ ఓ వైసీపీ నాయకునికి చెందినది కావడమే.  ఈ తీరం  కార్తీక మాసంతో పాటు సెలవు దినాల్లో  పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. కానీ హేచరీ వ్యర్థాల వల్ల వీరంతా ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. గత యాజమాన్యం హేచరీ నుంచి విడుదలైన వ్యర్థాలు సముద్ర గర్భంలో కలిసేందుకు అండర్‌ గ్రౌండ్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. తీరం నుంచి సుమారు 500 మీటర్ల వరకు పైప్‌లైన్‌ వేసింది. దీంతో హేచరీ నుంచి వర్థ జలాలు వస్తాయన్న విషయం ఎవరికీ తెలిసేది కాదు. ప్రస్తుతం ఈ హేచరీని ఒక వైసీపీ నాయకుడు కొనుగోలు చేశారు. ఇటీవల వరకు వ్యర్థ జలాలు సముద్రంలో కలిసేవి. కానీ సదరు పైప్‌లైన్‌ పాడైంది. వాటికి మరమ్మతులు చేపట్టకుండా హేచరీ నుంచి ప్రత్యేక పైపులు వేసి వదిలేస్తున్నారు. దీంతో వ్యర్థ జలాలు కాలువలా పారుతూ నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. పర్యాటకులంతా ఈ ప్రాంతంలోనే స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ తీరం చాలా విశాలంగా ఉంటుండడం వల్ల రద్దీ కూడా అలాగే ఉంటుంది.  ఇదిలావుంటే,  హేచరీ పేరుతో   తీరంలో మరో నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా కొత్త యాజమాన్యం ఆక్రమించుకుందని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బట్టబయలవుతాయని చెపుతున్నారు. 

Updated Date - 2021-01-17T06:07:50+05:30 IST