నారాయణస్వామి ఆలయంలో విశేష పూజలు

ABN , First Publish Date - 2021-08-02T06:28:22+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నారాయణస్వామి ఆలయంలో విశేష పూజలు
ప్రత్యేక అలంకరణలో నారాయణస్వామి

సీఎ్‌సపురం, ఆగస్టు 1 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థాన ప్రధాన అర్చకులు ఎం.సత్యనారాయణశర్మ, ప్రసాద్‌శర్మలు స్వామివారి మూలవిరాట్‌ను వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో గోపూజ చేశారు. భక్తులు మహానైవేథ్యంతో గుడిచుట్టూ ప్రదక్షణలు చేశారు. రాత్రికి నారాయణస్వామివారికి పల్లకిసేవ, రథోత్సవం నిర్వహించిన అనంతరం దశహారతులు, కుంభహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా దేవస్థాన చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో నారకొండ నారాయణస్వామి ఆరాధన

 మండలంలోని నారకొండ నారాయణస్వామి ఆరాధనా మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, గణపతిపూజ, పంచామృతాభిషేకాలు, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. పండరి భజన, నృత్య కళాప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని జినుగువారిపల్లి గ్రామానికి చెందిన జిలకర నారాయణ, పద్మ దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గుంటిగంగలో విశేష పూజలు

తాళ్లూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం  గుంటిగంగ సన్నిధిలో ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తాళ్లూరు ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.  గంగమ్మ తల్లిని 465 మంది భక్తులు దర్శించుకోగా, పలువురు భక్తులు అమ్మవారికి వాహనదారులు వాహనపూజలు చేశారు. తాళ్లూరు జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి మారం వెంకటరెడ్డి, ఆలయకమిటీ చైర్మన్‌ కటకంశెట్టి శ్రీనివాసరావులు పూజలు చేశారు. కార్యక్రమంలో  దేవస్థాన ఆర్‌.ఏ కే.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపాలెం గ్రామస్థుల పొంగళ్లు

గుంటిగంగ సన్నిధిలో గంగమ్మకు పొంగళ్లు పేట్టేందుకు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి మారం వెంకటరెడ్డి ఆద్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పొంగళ్లు వండి తలపై ఉంచుకుని కాలినడక గుంటిగంగకు భారీ జనసందోహంతో తరలివెళ్లి పొంగళ్లు పెట్టారు. దీంతో గుంటిగంగ ప్రాంగణం తిరునాళ్లను తలపించింది.


Updated Date - 2021-08-02T06:28:22+05:30 IST