ముగ్గురు ఎమ్మెల్యేలకు సెగ

ABN , First Publish Date - 2021-07-18T06:22:55+05:30 IST

రాష్ర్ట్ర ప్రభుత్వం..

ముగ్గురు ఎమ్మెల్యేలకు సెగ

12మందికి పదవులు

5 రాష్ట్ర, 7 జిల్లాస్థాయి నామినేటెడ్‌ పోస్టులు

రెండు తప్ప అన్నీ పెద్దిరెడ్డి అనుయాయులకే


తిరుపతి(ఆంధ్రజ్యోతి): రాష్ర్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన నామినేటెడ్‌ పదవుల్లో జిల్లాకు 5 రాష్ట్రస్థాయి, ఏడు జిల్లాస్థాయి పదవులు దక్కాయి. పదవుల కేటాయింపులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పారు. మొత్తం 12 పదవుల్లో రెండు మినహా ఆయన అనుయాయులకే లభించాయి. సామాజికవర్గాల సమీకరణల విషయానికొస్తే రెడ్డి, బీసీ వర్గాలకు నాలుగేసి, ముస్లిం మైనారిటీలకు రెండు, ఎస్సీ, బలిజలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు కేటాయించారు. మొత్తంగా ఓసీలకు ఐదు, ఇతర వర్గాలకు ఏడు వంతున పదవుల పంపిణీ జరిగింది. నియోజకవర్గాల వారీగా చూస్తే పుంగనూరు నియోజకవర్గానికి గరిష్టంగా మూడు, తిరుపతికి రెండు, జీడీనెల్లూరుకు రెండు, మదనపల్లె, పలమనేరు, చంద్రగిరి, సత్యవేడు, నగరి నియోజకవర్గాలకు ఒక్కొక్కటి దక్కాయి. 


జిల్లాలో ఐదుగురు వైసీపీ నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు లభించాయి. మదనపల్లె వైసీపీలో కీలక నేతగా వున్న మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లామ్‌కు ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని అధిష్ఠానం కట్టబెట్టింది. వైసీపీలోకి వచ్చింది మొదలు పెద్దిరెడ్డిని నమ్ముకున్నందుకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. వైసీపీ మైనార్టీ విభాగ అధ్యక్షుడైన ఖాదర్‌ బాషా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. పుంగనూరు నుంచీ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన ఖాదర్‌ బాషా తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడిగా మారారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే ఈయనకు సముచిత పదవి దక్కిందన్న భావన అక్కడి ముస్లిం మైనారిటీ వర్గాల్లో వినిపిస్తోంది. నగరి నియోజకవర్గం నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా అవకాశం వచ్చింది. ఈయన మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కుమారుడు. ఆ నియోజకవర్గ వైసీపీలో కీలక నేతగా వుంటూ మంత్రి పెద్దిరెడ్డి వెన్నంటి నడుస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టం దక్కింది. వాస్తవానికి ఈయన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఆశించినా దానికి తీసిపోని పదవే వచ్చినట్టయింది.


పుంగనూరుకు చెందిన మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కొండవీటి నాగభూషణానికి ఏపీ ఫోక్‌ అండ్‌ క్రియేటివిటీ అకాడమీ ఛైర్మన్‌ పదవి వచ్చింది. సుదీర్ఘ కాలంగా పెద్దిరెడ్డికి కరుడుగట్టిన అనుచరుడైన ఈయన రాష్ట్రస్థాయి పదవిలో నియమితులయ్యారు. జీడీనెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలానికి చెందిన వైసీపీ ముఖ్యనేత ఎం.సీ.విజయానందరెడ్డిని అధిష్ఠానం ఆర్టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. ఏడేళ్ళకు పైగా వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన ఈయన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డిలతో పాటు అధిష్ఠానంలో కీలక వ్యక్తులకు అత్యంత సన్నిహితుడని పేరుపడ్డారు. 


ఏడుగురికి జిల్లాస్థాయి పదవులు

జిల్లాలో తాజాగా ఏడుగురు అధికార పార్టీ నేతలను జిల్లాస్థాయి పదవులు వరించాయి. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెకు చెందిన మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ మొగసాల రెడ్డెమ్మ డీసీసీబీ ఛైర్‌పర్సన్‌గా నామినేట్‌ అయ్యారు. ఇప్పటికే ఆమె ఆ పదవిలో తాత్కాలికంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇపుడు నిర్ణీత గడువు మేరకు పూర్తిస్థాయిలో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఈమె కుటుంబం మంత్రి పెద్దిరెడ్డిని సుదీర్ఘకాలంగా అనుసరిస్తోంది. జిల్లాలో ఆయన వర్గంలో ముఖ్యులుగా ఆమె పేరుబడ్డారు. ఆ నేపధ్యమే ఆమెకు తాజాగా జిల్లాస్థాయి పదవిని కట్టబెట్టింది. సత్యవేడు మాజీ జడ్పీటీసీ బీరేంద్రవర్మ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ అయ్యారు. ఈయన కూడా మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా పేరుపడ్డారు. ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా చైర్మన్‌ పదవి స్థానికేతరులకు దక్కడం విశేషం.


జీడీనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలానికి చెందిన మహాసముద్రం ప్రమీలమ్మ కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డికి ఆమె స్వయానా వదిన. జ్ఞానేంద్రరెడ్డి వైసీపీలో మంత్రి పెద్దిరెడ్డి వర్గంలో కీలకంగా వున్నారు. ఆ కారణంగానే అన్న భార్యకు ఈ పదవి సాధించుకున్నారు. పుంగనూరు మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌ పీకేఎం (పలమనేరు-కుప్పం-మదనపల్లె) అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ అయ్యారు. ఆయన మంత్రి పెద్దిరెడ్డికి విశ్వాసపాత్రుడైన అనుచరుడు. గతంలో జడ్పీలో వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా వ్యవహరించారు. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన సామకోటి నాగలక్ష్మి జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమె భర్త సహదేవరెడ్డి ఇప్పటివరకూ ఆ పదవిలో కొనసాగారు. ఈయన కూడా మంత్రి పెద్దిరెడ్డి వర్గంలో కీలక నాయకుడు.


తొలినుంచీ వైసీపీకి అనుకూలంగా ఎలకా్ట్రనిక్‌ మీడియా ఛానెళ్ళు నిర్వహించే డిబేట్లలో పాల్గొంటూ వచ్చిన నారుమల్లి పద్మజ తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఎవరి సిఫారసుతో నిమిత్తం లేకుండా తిరుపతి వంటి కీలక నగరంలో నామినేటెడ్‌ పదవి దక్కించుకోగలిగారు.తిరుపతికే చెందిన నయనారు మధుబాల జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ పదవి సాధించారు. ఆమె కుటుంబం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వెన్నంటి వుంటోంది. ఆయన సిఫారసుతోనే జిల్లాస్థాయి పదవి పొందారు.


ముగ్గురు ఎమ్మెల్యేలకు సెగ

తాజా పదవుల పంపిణీతో మదనపల్లె, నగరి, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సెగ తగిలినట్టవుతోంది. మదనపల్లె ఎమ్మెల్యేగా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన నవాజ్‌ బాషా కొనసాగుతున్న నేపధ్యంలో ఇపుడు అదే సామాజికవర్గం నుంచీ షమీమ్‌ అస్లామ్‌కు ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్‌ పదవి లభించింది. ఇది తాజాగా ప్రకటించిన అన్ని పదవుల్లోకీ ప్రాధాన్యత, నిధులు వున్న కార్పొరేషన్‌ కావడం గమనార్హం. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌కు పోటీ పడిన షమీమ్‌కు ఇపుడు రాష్ట్రస్థాయి కీలకపదవి రావడం నిస్సందేహంగా నియోజకవర్గ వైసీపీలో అలజడి రేకెత్తించే పరిణామమే.


నగరిలో చక్రపాణిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరి కలిగిన నేతగా వున్నారు. మంత్రి పెద్దిరెడ్డితో సన్నిహితంగా వుంటున్నారు. ఇప్పటికే నగరిలో ఓ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ వున్న సంగతి తెలిసిందే. ఆ వర్గం ఎమ్మెల్యేతో ఎడమొహం పెడమొహంగా వున్న నేపధ్యంలో తాజా నియామకం పార్టీలో మరో బలమైన వర్గం తలెత్తేందుకు కారణం కానుందన్న ప్రచారం మొదలైంది.


జీడీనెల్లూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి వర్గం, స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గం ఇప్పటికే పరస్పరం విభేదించుకుంటున్నాయి. ఇపుడు మాజీ ఎంపీ తన కుటుంబీకులకు కీలక పదవి తెచ్చుకోవడం వల్ల ఆ విభేదాలు ముందుముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లా వైసీపీ శాసనసభ్యులందరిలోకీ సీనియర్‌ అయిన చింతల రామచంద్రారెడ్డికి తాజా నామినేటెడ్‌ పదవుల భర్తీ నిరాశనే మిగిల్చింది. రెండేళ్ళ కిందట వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే తనకు కీలక పదవి దక్కుతుందని ఆశించారు. జిల్లాలోని పరిస్థితుల కారణంగా మంత్రివర్గంలో కాకపోయినా చీఫ్‌విప్‌ పదవి లేదా కీలక కార్పొరేషన్‌ పదవైనా ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో రెండేళ్ళ పాటు ఓపికగా నిరీక్షించిన ఆయన తాజా నియామకాల్లో అవకాశం దక్కుతుందని ఆశించారు. తీరా నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఎమ్మెల్యేలకు అవకాశం లేదని విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో అధమపక్షంగా దక్కుతుందనుకున్న టీటీడీ బోర్డు మెంబరు పదవి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయినట్టయింది. దీంతో ఆయన, ఆయన వర్గం తీవ్ర నైరాశ్యానికి లోనవుతోంది.


పేరు   నియోజకవర్గం    సామాజికవర్గం            పదవి 


1. షమీమ్‌ అస్లామ్‌     మదనపల్లె    ముస్లిం-బీసీ          ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్‌

2. ఖాదర్‌ బాషా     పుంగనూరు   ముస్లిం-బీసీ          ఏపీ వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌

3. కొండవీటి నాగభూషణం పుంగనూరు    దాసరి-బీసీ          ఏపీ ఫోక్‌ అండ్‌ క్రియేటివిటీ అకాడమీ ఛైర్మన్‌

4. ఎంసీ. విజయానందరెడ్డి జీడీనెల్లూరు    రెడ్డి-ఓసీ                 ఏపీఎస్‌ ఆర్టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌

5. రెడ్డివారి చక్రపాణిరెడ్డి    నగరి          రెడ్డి-ఓసీ                శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు ఛైర్మన్‌

6. నారుమల్లి పద్మజ       తిరుపతి       మాల-ఎస్సీ              తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌

7. ఎం.ప్రమీలమ్మ         జీడీనెల్లూరు   రెడ్డి-ఓసీ                 కాణిపాక ఆలయ ఛైర్‌పర్సన్‌

8. సామకోటి నాగలక్ష్మి     చంద్రగిరి      రెడ్డి-ఓసీ                 డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌

9. నయనారు మధుబాల   తిరుపతి      బలిజ-ఓసీ               జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌

10. మొగసాల రెడ్డెమ్మ     పలమనేరు    నాయీ బ్రాహ్మణ-బీసీ    డీసీసీబీ ఛైర్‌పర్సన్‌

11. వెంకటరెడ్డి యాదవ్‌    పుంగనూరు   యాదవ-బీసీ             పీకేఎం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌

12. బీరేంద్ర వర్మ          సత్యవేడు     రాజులు - బీసీ           శ్రీకాళహస్తీశ్వరాలయ ఛైర్మన్‌

Updated Date - 2021-07-18T06:22:55+05:30 IST