‘పాజిటివ్‌’ వచ్చినా బయటకు వచ్చి ఇతరులకు అంటిస్తున్నారు..

ABN , First Publish Date - 2022-01-25T16:31:53+05:30 IST

‘పాజిటివ్‌’ వచ్చినా బయటకు వచ్చి ఇతరులకు అంటిస్తున్నారు..

‘పాజిటివ్‌’ వచ్చినా బయటకు వచ్చి ఇతరులకు అంటిస్తున్నారు..

అవసరంతో కొందరు.. నిర్లక్ష్యంతో మరికొందరు..

నగరంలో పెరుగుతున్న కేసుల సంఖ్య


వెంకటేశ్వర్‌రావు (పేరు మార్చాం) జర్మనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మూడేళ్ల చిన్న కుమారుడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు జర్మనీ నుంచి నాలుగు రోజుల క్రితం నగరంలోని బావమరిది ఇంటికి వచ్చాడు. ఆదివారం ఏపీలోని సొంతింటికి వెళ్లేందుకు రైలులో రిజర్వేషన్‌ చేసుకున్నాడు. శనివారం జలుబు, జ్వరం, దగ్గు ఉండడంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ తేలింది. జర్మనీ నుంచి మరోసారి రావడం కష్టమనే భావనతో కొడుకు పుట్టు వెంట్రుకల కార్యక్ర మాన్ని వాయిదా వేయలేదు. ఇటువంటి కొందరి వల్ల నగరంలో కొవిడ్‌ వ్యాప్తి చెందుతోంది. 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): మాస్క్‌, భౌతికదూరం దేవుడెరుగు కానీ.. కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలినప్పటికీ కొందరు గడప దాటి రోడ్డెక్కుతున్నారు. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  


ప్రమాదంలో పెద్దలు

పరీక్షలో కరోనా నిర్ధారణ అయినప్పటికీ తీవ్ర లక్షణాలు లేవనే నిర్లక్ష్యంతో కొందరు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, పార్కుల్లో సంచరిస్తుండడంతో కొవిడ్‌ కేసులు శరవేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి వారి వల్ల ఇంటి పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 


బాధ్యతగా వ్యవహరించాలి  

నగరంలో కొవిడ్‌ కేసుల వ్యాప్తికి సగం మంది నిర్లక్ష్యమేనని చెప్పొచ్చు. పాజిటివ్‌ అని తేలినా చాలామంది ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. తోటి ఉద్యోగులు, స్నేహితులకు కొవిడ్‌ వచ్చిందని తెలిస్తే అప్పటివరకు వారితో పాటు కలిసి ఉండేవాళ్లు సైతం హోం ఐసోలేషన్‌లో ఉండాలి. ఇలా జరిగితేనే కేసుల తీవ్రత తగ్గుతుంది. స్వీయకట్టడి లేకుంటే ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నం కావొచ్చు. 

- డాక్టర్‌ చైతన్య, కేర్‌ హాస్పిటల్‌



వారం రోజుల్లో నమోదైన కేసులు


తేదీ                   సంఖ్య

18                     1206

19                     1474

20                     1645

21                      1670

22                       1643

23                       1421

24                       1439

Updated Date - 2022-01-25T16:31:53+05:30 IST