దేవెగౌడకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-01T07:25:58+05:30 IST

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (87) కరోనా బారిన పడ్డారు. తనతో పాటు తన సతీమణి చెన్నమ్మకు కూడా పాజిటివ్‌ వచ్చిందని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు.

దేవెగౌడకు పాజిటివ్‌

  • దేశంలో 53 వేల కేసులు.. 354 మరణాలు
  • ‘మహా’లోనే 27వేలు.. మృతులు 139
  • బెంగాల్లో పరిస్థితి ఆందోళనకరం: వైద్యులు

 

న్యూఢిల్లీ, మార్చి 31: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (87) కరోనా బారిన పడ్డారు. తనతో పాటు తన సతీమణి చెన్నమ్మకు కూడా పాజిటివ్‌ వచ్చిందని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన తనయుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ.. స్వయంగా దేవెగౌడకు ఫోన్‌ చేసి ఆర్యోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


మరోవైపు కొవిడ్‌తో బాధపడుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాలను పరిశీలించాల్సిందిగా తాను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు సూచించానని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి లేదని ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. కాగా.. దేశంలో వరుసగా రెండో రోజూ కేసుల్లో తగ్గుదల కనిపించింది.


సోమవారంతో పోల్చితే.. మంగళవారం 4.80 శాతం తగ్గి 53,480 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కి చేరింది. గడచిన రెండు రోజుల్లో మహారాష్ట్రలో కేసులు తగ్గడం.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపించింది. సోమవారం 31 వేలకు పైగా నమోదైన కేసులు.. మంగళవారం 27,918కి తగ్గాయి. పాజిటివ్‌లు తగ్గుతున్నప్పటికీ.. ఒక్కరోజులో భారీగా పెరిగిన మరణాల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది.


మంగళవారం ఒక్కరోజులో 30 శాతం పెరిగి 354 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,62,468కి పెరిగింది. ఒక్కరోజులో 41,280 మంది కోలుకోగా.. రికవరీ రేటు 94.11 శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3.42 లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. 



నివురుగప్పిన నిప్పులా పశ్చిమబెంగాల్‌

కరోనా తొలివేవ్‌లో తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమబెంగాల్‌పై సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో కనబడలేదు. కానీ, ప్రస్తుతం అక్కడ ఏర్పడ్డ పరిస్థితులను చూస్తుంటే.. నివురుగప్పిన నిప్పులా ఉందని, వైరస్‌ తీవ్రంగా విరుచుకుపడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ.. అక్కడ భారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుగుతుండడం, వాటికి హాజరవుతున్న జనం.. కొవిడ్‌ మార్గదర్శకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడం పట్ల వారు కలవరపాటుకు గురవుతున్నారు.  ‘‘ఇలాంటి అంటువ్యాధు ల్లో సెకండ్‌, థర్డ్‌ వేవ్‌లు సాధారణంగా వస్తుంటాయి. జాగ్రత్తగా ఉంటే.. వాటి వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారతాయి’’ అని ఎంఆర్‌ బంగూర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సిసిర్‌ నస్కార్‌ అన్నారు. తమిళనాడులో ఇప్పటికే అమల్లో ఉన్న పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రభుత్వం.. ఏప్రిల్‌ 30 వరకు పొడిగించింది. ఒలింపిక్స్‌కి సిద్ధమవుతున్న వేళ.. పాటియాలాలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌’లో కరోనా కలకలం రేపింది. 26 మంది క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సిబ్బంది కరోనా బారినపడ్డారు. కశ్మీర్‌లో రెండు స్కూళ్లకు చెందిన 50 మంది విద్యార్థులకు కరోనా సోకింది.


Updated Date - 2021-04-01T07:25:58+05:30 IST