వాయిదా ఉత్తమం

ABN , First Publish Date - 2022-01-07T06:32:26+05:30 IST

కరోనా కేసులు అతివేగంగా హెచ్చుతున్న నేపథ్యంలో, ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని ఎన్నికల సంఘం గురువారం సమీక్షించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్...

వాయిదా ఉత్తమం

కరోనా కేసులు అతివేగంగా హెచ్చుతున్న నేపథ్యంలో, ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిని ఎన్నికల సంఘం గురువారం సమీక్షించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఢిల్లీలోని ఎయిమ్స్ డైరక్టర్ రణ్ దీప్ గులేరియా, ఐసీఎంఆర్ డైరక్టర్ బలరామ్ భార్గవ ఇత్యాదులతో ఎన్నికల సంఘం సమావేశమై కొవిడ్ స్థితిని సంపూర్ణంగా బేరీజువేసినట్టు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. మహమ్మారి దాడి మహాభయంకరంగా ఉన్న తరుణంలో ప్రజల భద్రతకోసం ఏచర్యలు తీసుకోవాలో వైద్యనిపుణులతో సమీక్షించారట. అర్హులైన ప్రతీ ఒక్కరికీ రెండుడోసుల వాక్సిన్ ఇవ్వాలని ఈసీ సూచించిందట. ఎన్నికలకు పోబోతున్న గోవా, మణిపూర్,పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని కూడా అంచనావేశారు.


అన్ని పార్టీలూ సకాలంలో ఎన్నికలు పూర్తికావాలని గట్టిగా కోరుతున్నాయి అంటూ వారంక్రితమే ఎన్నికల సంఘం తేల్చేసింది. ఎన్నికలు వాయిదావేసే అవకాశాలు ఎంతమాత్రం లేవనీ, కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలకు పోబోతున్నామని ఈసీ నిర్థారించింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయపార్టీలూ, పోలింగ్ సందర్భంలో ఓటర్లు కాస్తంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిప్రాయం. వినడానికి బాగుంది కానీ, అమలు జరుగుతుందా అని సుశీల్ చంద్రను విలేకరులు అడిగినట్టు లేదు. నిజానికి ఈ వారంరోజుల్లోనే ఆయనకు నిజం అవగతం కావాలి. పార్టీలకు అధికారం ప్రధానం కానీ, ప్రజల ఆరోగ్యం కాదని ఈసీ గుర్తించివుంటే బాగుండేది. గత ఏడాది డెల్టా వేరియంట్ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపి ఈసీ అప్రదిష్టపాలైంది. ఎన్నికల ప్రచారం చివరిఘట్టంలో పార్టీలు కాస్తంత మనసుమార్చుకున్నాయి కానీ, అంతవరకూ తమ నాయకుల సభలూ సమావేశాలకు లక్షలాదిమందిని మోహరించి ప్రమాదంలో పడేశాయి. ఈసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మద్రాస్ హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. ఎప్పుడైనా, వ్యాప్తి ప్రమాదం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకే పరిమితం కాదు. సమస్త పరివారాన్నీ వెంటేసుకొని ఆయా రాష్ట్రాల్లో పర్యటించే అధినాయకత్వంతో పాటు, వివిధ రాష్ట్రాలనుంచి ప్రత్యేకంగా పోయి ప్రచారం చేసే పెద్దలు ఎందరో ఉంటారు. ఈ రాకపోకలు అన్ని రాష్ట్రాలనూ ప్రమాదంలో పడేస్తాయి. 


ఓటింగ్ సమయాన్నీ, పోలింగ్ బూత్‌లనూ పెంచడం, ఓటర్లు సామాజిక దూరం పాటించేట్టు చూడటం వంటి చర్యలేవో ఈసీ తీసుకుంటుందనడంలో సందేహం లేదు. కానీ, రాజకీయపార్టీల అత్యుత్సాహం వల్ల వేలాదిమందితో, వందలాది సభలు జరిగిపోతూ మహమ్మారి వ్యాప్తికి అవకాశాలు హెచ్చిన తరువాత ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం తక్కువే. పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలను ఈసీ అమలుచేయించగలదు కానీ, ప్రచారంలో కట్టుతప్పిన పార్టీలను అది నియంత్రించలేదు. దేశంలో ఒమై క్రాన్‌ వ్యాప్తి ఊహకందనిదేమీ కాదు. చాలా రాష్ట్రప్రభుత్వాలు ఆంక్షలతోనూ, రాత్రి కర్ఫ్యూలతోనూ వ్యాప్తివేగాన్ని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్కూళ్ళు, కాలేజీలు మూతబడుతున్నాయి, థియేటర్లు, మాల్స్ తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఒమైక్రాన్ వల్ల ముప్పులేదనీ, రోగలక్షణాలు పెద్దగా లేవనీ, ఆక్సిజన్ అవసరపడదనీ, భయం అక్కరలేదనీ ఒకపక్కన చెబుతున్నందున జాగ్రత్తగా ఉండమన్న సూచన ప్రజలమీద పెద్దగా పనిచేయడం లేదు. దీనికి సభలూ ర్యాలీలు తోడైతే మరింత ప్రమాదం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకండి, ఎన్నికలు వాయిదావేయడమే మంచిది అని అలహాబాద్ హైకోర్టు అందుకే సూచించింది. ఎన్నికలకు పోతున్న రాష్ట్రాల్లో ఇప్పుడు కేసులు పెరుగుతున్న విషయాన్ని గమనించాలి.  వాక్సినేషన్ విషయంలో కూడా అవి వెనుకంజలోనే ఉన్నాయి. యూపీలో రెండో విడత టీకా సగంమందికి కూడా దక్కలేదు. వెంటనే అందరికీ టీకాలు ఇవ్వండని ఎన్నికల సంఘం ఇప్పుడు ఆదేశించినా ఆయా రాష్ట్రాల్లో అది అందరికీ అందుతుందని నమ్మకమేమీ లేదు. అలాగే, ఎన్నికల కోలాహలానికి మొత్తంగా స్వస్తిచెప్పకుండా భారీ సభలను నియంత్రించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికలను కొంతకాలం వాయిదావేయడం ద్వారానే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడకుండా ఎన్నికల సంఘం కాపాడగలదు.

Updated Date - 2022-01-07T06:32:26+05:30 IST