శక్తివంతమైన వజ్రాయుధం ఓటు హక్కు

ABN , First Publish Date - 2022-01-26T06:29:46+05:30 IST

భారత రాజ్యాంగం కల్పించిన శక్తివంతమైన వజ్రాయుధం ఓటు హక్కు. నిష్పాక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు.

శక్తివంతమైన వజ్రాయుధం ఓటు హక్కు
ప్రతిజ్ఞ చేయిస్తున్న అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

- అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ 

- జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవం 

సిరిసిల్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘భారత రాజ్యాంగం కల్పించిన శక్తివంతమైన వజ్రాయుధం ఓటు హక్కు. నిష్పాక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి’  అని  అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం  కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ మాట్లాడుతూ ప్రతీ ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని,  ప్రలోభాలకు  ప్రభావితం కాకుండా ఓటు వేయాలని అన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ద్వారానే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది వేసినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్‌, డీసీవో బుద్ధనాయుడు, బీసీ సంక్షేమాధికారి భాస్కర్‌రెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, పౌరసరఫరాల మేనేజర్‌ హరికృష్ణ, మైనార్టీ శాఖ ఓఎస్‌డీ సర్వర్‌మియా, ఎన్నికల విభాగం డీటీ రెహ్మాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఓటు హక్కు ప్రాధాన్యం తెలుసుకోవాలి

ఓటు హక్కు ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎస్పీ రాహుల్‌హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌, చంద్రకాంత్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:29:46+05:30 IST