ప్రమాదఘంటికలు

ABN , First Publish Date - 2021-08-12T10:00:44+05:30 IST

విశాఖపట్నం, చెన్నై, ముంబై ఇత్యాది సముద్రతీర నగరాలు ఈ శతాబ్దం ఆఖరునాటికి మూడడుగుల మేరకు మునిగిపోతాయని ఐపీసీసీ హెచ్చరిస్తున్నది....

ప్రమాదఘంటికలు

విశాఖపట్నం, చెన్నై, ముంబై ఇత్యాది సముద్రతీర నగరాలు ఈ శతాబ్దం ఆఖరునాటికి మూడడుగుల మేరకు మునిగిపోతాయని ఐపీసీసీ హెచ్చరిస్తున్నది. కాళ్ళ కిందకు నీళ్ళొస్తున్న ప్రమాదాన్ని ఇప్పటికైనా గుర్తించి నడవడికను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక తెలియచెబుతోంది. ఉత్తరభారతంలో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్న వార్తలతోపాటుగా వెలువడిన ఈ నివేదిక మానవాళి ఎంతటి మహావిపత్తులను ఎదుర్కొనబోతున్నదో కళ్ళకుకట్టినట్టు విప్పిచెప్పింది.


గ్రీస్‌, కాలిఫోర్నియాలో కార్చిచ్చులు, చైనాలో విమానాలను పల్టీలు కొట్టించిన, జర్మనీలో వందలాదిమందిని నిరాశ్రయులను చేసిన భారీ వరదలనూ చూశాం. వీటిని ప్రకృతివైపరీత్యాలనేకంటే మానవ తప్పిదాలనడం సబబు. ఇంతకుమించిన భయానక పరిస్థితులు ముందుముందున్నాయని ఐపీసీసీ నివేదిక చెబుతోంది. ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు ఎంతో కచ్చితత్వంతో చెప్పిన కాలజ్ఞానం ఈ మూడువేల పేజీల నివేదిక. మండుతున్న భూగోళాన్ని మనముందుంచి, మానవాళికి ఎర్రజెండా చూపుతోంది. గతంలో యాభైయేళ్ళకోమారు నమోదయ్యే తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు పదేళ్ళకే నమోదవుతున్న స్థితిలో, భూతాపం పెరుగుతున్నకొద్దీ రెండుమూడేళ్ళకోమారు వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. భూమి వేడెక్కడం ఇదేరీతిన సాగితే, ఒకటిన్నర డిగ్రీల హద్దును దాటడానికి పదేళ్ళు కూడా పట్టదన్నది ఓ తీవ్ర హెచ్చరిక. పరిస్థితి ఒకసారి పట్టుదప్పితే, కట్టడి కూడా కష్టమయ్యే దశకు భూతాపం చేరితే, కిందకు దించడానికి దశాబ్దాలు కూడా చాలవని నివేదిక హెచ్చరిస్తున్నది. 


భారతదేశంలో పన్నెండు తీరప్రాంత నగరాలకు ప్రమాదం పొంచివున్నదని, దేశం అనూహ్య వాతావరణ మార్పులను చవిచూడటమే కాక, ఊహకు అందని స్థాయి వర్షాలు దక్షిణభారతాన్నీ ముంచెత్తుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూతాపం ప్రభావాన్ని హెచ్చుగా అనుభవించే దేశాల్లో మనది కూడా ఒకటి. మిగతా సముద్రాలకంటే హిందుమహాసముద్రమే వేగంగా వేడెక్కుతున్న విషయాన్ని నివేదిక గుర్తుచేసింది. దీనినుంచి ఏటా పుట్టే తుఫానుల సంఖ్య పెరుగుతోంది. వరుస తుపానులు కసితీరా విరుచుకుపడుతున్నాయి. దేశం ఇప్పటికే పలురకాల విపత్తులను ఎదుర్కొంటున్నది. కుంభవృష్టికి నగరాలు మునుగుతున్నాయి, నదులు పొంగుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి ఏకకాలంలో దర్శనమిస్తున్నాయి, రుతుపవనాలు గతితప్పుతున్నాయి. హిమాలయాలు వేగంగా కరిగి, మంచుచరియలు విరిగిపడి ఏకంగా ఆనకట్టలే అదృశ్యమైపోతున్న దృశ్యాలు చూసిన తరువాత కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది మనకు దూరంగా ఎక్కడో జరుగుతున్నదని ఇంకెంతకాలం అనుకుంటాం? భూమి వేడెక్కుతోందని, అది మానవ తప్పిదమేనని గుర్తించి దశాబ్దాలైంది. కట్టడి చేయకపోతే మానవాళికి ముప్పుతప్పదని తెలుసుకొని కూడా చాలాకాలమైంది. కనీసం లక్షన్నరేళ్ళుగా భూతాపంలో రాని మార్పు, పారిశ్రామికీకరణతో కొద్దిదశాబ్దాల్లోనే రాజుకొని, వడిగా పరుగులు తీస్తున్న స్థితిలో, రాబోయే దశాబ్దం అత్యంత కీలకమన్న ఐపీసీసీ హెచ్చరికకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్యారిస్‌ ఒప్పందంలో చెప్పుకున్న సంకల్పం అగ్రరాజ్యాల ధనదాహం ముందు నిలవలేకపోయింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వంటివారికైతే పర్యావరణం, భూతాపం వంటి మాటలంటే మహాచిరాకు. ఏవో సాకులతో ఒప్పందాలను కాదని పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు పరిరక్షించడం వారి లక్ష్యం. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను నియంత్రించడం వంటి సంకల్పాలు మాటలకే పరిమితమవుతున్నాయి. భారీగా నిధులు ఇవ్వగలిగే దేశాలు కూడా భూతాపం మీద శ్రద్ధపెట్టకపోవడం విషాదం. మరో మూడునెలల్లో గ్లాస్గోలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరగబోతున్నదశలో ఐపీసీసీ నివేదిక వెలువడింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్నమాట నిజమే కానీ, ఆ మహమ్మారిని మించిన ప్రమాదం సమస్త మానవాళికి పొంచివున్నదని గుర్తించి, భావితరాలను కాపాడుకొనే దిశగా సత్వరచర్యలు చేపట్టడం అవసరం.

Updated Date - 2021-08-12T10:00:44+05:30 IST