ఖజానా ఉద్యోగులపై పీఆర్సీ కత్తి

ABN , First Publish Date - 2022-01-23T06:26:10+05:30 IST

కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జనవరి నెల జీతాల బిల్లులు ఈ నెల 25లోగా ప్రాసెసింగ్‌ చేయాలని ప్రభుత్వం ఖజానాశాఖపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఫిబ్రవరి 1న చెల్లించే జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం అందించాలని హుకూం జారీ చేసింది.

ఖజానా ఉద్యోగులపై పీఆర్సీ కత్తి

కొత్త జీతాల బిల్లులు ప్రాసెసింగ్‌ చేయాలని హుకూం

ట్రెజరీ సిబ్బంది సహాయ నిరాకరణ


చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 22: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జనవరి నెల జీతాల బిల్లులు ఈ నెల 25లోగా ప్రాసెసింగ్‌ చేయాలని ప్రభుత్వం ఖజానాశాఖపై తీవ్ర ఒత్తిడి  తెస్తోంది. ఫిబ్రవరి 1న చెల్లించే జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం అందించాలని హుకూం జారీ చేసింది. జీతాల బిల్లులకు సంబంధించి ఉద్యోగులకు లింక్‌ ఆప్షన్‌ ఇవ్వడంతో పాటు ఆ బిల్లులను అప్రూవల్‌ చేయాలని డీడీవోలను ఆదేశించింది. కొత్త బిల్లులను సిద్ధం చేయాలని మూడు రోజులుగా ప్రభుత్వం ట్రెజరీ అధికారులపై ఒత్తిడి చేస్తోంది. జిల్లాలో 50676 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 30461 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరి వేతన, పెన్షన్‌ బిల్లులను ఆయా శాఖల 1592 మంది డ్రాయిండ్‌ ఆఫీసర్లు జిల్లా ట్రెజరీ కార్యాలయం, 15 సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తుంటారు. నెలకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల రూపేణా రూ.213 కోట్లు, పెన్షనర్లకు రూ.వంద కోట్లకు మించి చెల్లింపులు జరుగుతున్నాయి. బిల్లులను పరిశీలించి నెల చివర్లో ట్రెజరీశాఖ ఆమోదం తెలుపుతుంది. కాగా, కొత్త పీఆర్సీపై ఉద్యోగులు నిరసన బాట పట్టడంతో ముందస్తుగా జీతాలు బిల్లులు సిద్ధం చేయాలని ఆయా శాఖలను ఆదేశించింది. వారం రోజుల్లో ట్రెజరీ పాత వెబ్‌సైట్‌ను తొలగించి కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. 25లోగా కొత్త పీఆర్‌సీ బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని డీడీవోలను ప్రభుత్వం ఆదేశించింది. అయితే వేతన సవరణపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఆప్షన్‌ పొందకుండా కొత్త బిల్లులు చేయలేమంటూ ట్రెజరీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఖజానా, పే అండ్‌ అకౌంట్స్‌, ఆడిట్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, ఏపీజీఎల్‌ఐ తదితర శాఖల ఉద్యోగుల జీతాల బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ప్రభుత్వమే అప్రూవల్‌ చేస్తున్నట్లు సమాచారం. ఒకవైపు పీఆర్సీపై పునరాలోచన చేయాలని ఒత్తిడి చేస్తున్నందున సవరణ జీవో జారీ అయ్యేంత వరకు జీతాల బిల్లులను డీడీవోలకు ఇవ్వొద్దని ఉద్యోగులకు జేఏసీ నేతలు సూచిస్తున్నారు.

Updated Date - 2022-01-23T06:26:10+05:30 IST