Abn logo
May 17 2021 @ 00:41AM

అకాల వర్షం..అన్నదాతకు నష్టం

- జిల్లాలో భారీగా తడిసిన ధాన్యం

- నేల రాలిన మామిడి కాయలు

- కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం

- తౌక్తే తుఫాను భయం

 ( ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అకాల వర్షాలు అన్నదాతలకు నష్టాన్ని మిగులుస్తున్నాయి. తౌక్తే తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయింది. కోతకు వచ్చిన వరి నేల వాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురవడంతో ఆదివారం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం భారీగా తడిసింది. రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టు కోవడానికి అవస్థలు పడ్డారు. తుఫాన్‌ ప్రభావం ఎప్పడి వరకు ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.  

ముస్తాబాద్‌ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర, హరిదాస్‌నగర్‌, రాగట్లపల్లి, గొల్లపెల్లి, బొప్పాపూర్‌, అక్కపల్లి, అల్మాస్‌పూర్‌ గ్రామాల్లో ధాన్యం తడిసిపోవడంతో పాటు కోతకు వచ్చిన వరి నేలవాలింది. ధాన్యంపై కప్పడానికి కవర్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు కోళ్లమద్ది, గోరంటాల, కొత్తపల్లి, శ్రీగాధ, నర్మాల, నాగంపేట  గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది.   

ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు  ముస్కానిపేట, అనంతారం, రహీంఖాన్‌పేట గ్రామాల్లో  వర్షం కురిసింది. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలులకు మామిడిపండట దెబ్బతింది.  వేములవాడ మార్కెట్‌ యార్డులో  ఆదివారం కురిసిన భారీ వర్షానికి  సుమారు 60 క్వింటాళ్ల  వరకు ధాన్యం తడిసి ముద్దయ్యిందని రైతులు తెలిపారు. 

చందుర్తి మండల కేంద్రంతోపాటు నర్పింగాపూర్‌, రామన్నపేట, తిమ్మాపూర్‌, ఆశిరెడ్డిపల్లి,మూడపల్లి మల్యాల  గ్రామాల్లో  ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని కోతకు వచ్చిన  వరిపంట నేలవాలింది. గింజలు నీటిపాలయ్యాయి.  కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి తడిసిపోయింది. పలు చోట్ల కొట్టుకుపోయింది.   కొనుగోలు కేంద్రాల్లో నీరు పోవడానికి కాలువలు తీశారు.  తంగళ్లపల్లి మండలం నేరెళ్ల, తంగళ్లపల్లి, కోనరావుపేట, బోయినపల్లి, రుద్రంగి మండలాల్లోనూ ధాన్యం తడిసింది. ముస్తాబాద్‌, ఇల్లంతకుంటలో గాలులకు మామిడిపంట దెబ్బతింది. జిల్లాలో దాదాపు ఐదు ఎకరాల్లో మామిడి తోటలు, 500 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసింది.

పిడుగు పాటుకు గేదె మృతి

చందుర్తి మండలంలో  నర్సింగాపూర్‌లో ఆదివారం ఈదురు గాలులతోపాటు ఉరుములు మెరుపులతో వర్షం కురువగా పిడుగులు పడ్డాయి. గ్రామానికి చెందిన బైరగోని అంజయ్యకు చెందిన పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది.    

 కొనుగోళ్ల జాప్యంతో రైతుల్లో భయం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం 235 కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు అకాల వర్షాలకు భయపడుతున్నారు. రబీలో ఆశాజనకంగా దిగుబడి వచ్చిన కొనుగోళ్ల కోసం పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 97,209 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద తూర్పార పట్టడానికి మిషన్లు లేకపోవడంతో తాలు పేరిట క్వింటాల్‌కు 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. తూర్పార పట్టినా 3 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. దీంతోపాటు ధాన్యం మిల్లులో తీసుకునే వరకు రైతుదే బాధ్యతగా నిబంధనలు పెట్టారు. మిల్లర్లు కోత విధించిన ధాన్యాన్ని సైతం రైతుల నుంచే వసూలు చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు పంట నేలవాలడం, ధాన్యం కొట్టుకుపోవడంతోనూ  తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోళ్లు వేగవంతం లేకపోవడంతో ఎలాంటి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. Advertisement
Advertisement