అకాల వర్షం.. రైతన్నకు నష్టం

ABN , First Publish Date - 2021-04-21T04:56:44+05:30 IST

జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. ఈదురుగాలులకు అరటితో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

అకాల వర్షం.. రైతన్నకు నష్టం
సాలూరు రూరల్‌: కూనంబందవలస వద్ద ధ్వంసమైన అరటి

  ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి, జీడిమామిడి  

 నేలకూలిన చెట్లు 

 రాకపోకలకు అంతరాయం

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 20: జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. ఈదురుగాలులకు అరటితో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ప్రధానంగా సాలూరు మండలంలో మావుడి, కందులపథం, పాచిపెంట మండలంలోని పలు ప్రాంతాల్లో  అరటిపంట ధ్వంసమైంది. దెబ్బతిన్న అరటితోటలను రైతులను మంగళవారం తొలగించుకున్నారు. గాలుల వల్ల నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.   గరుగుబిల్లి:  కొద్ది రోజులుగా వరుసగా గాలులు వీయడంతో రైతులు నష్టల బారిన పడుతున్నారు. ఈదురు గాలుల బీభత్సానికి చేతికందొచ్చిన పంట నేలపాల వుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సోమవారం రాత్రి వీచిన భారీ గాలులకు  పిట్టలమెట్ట, ఖడ్గవలస, సంతోషపురం, తోటపల్లి, గిజబ, నందివానివలసతో పాటు పలు గ్రామాల్లో అరటి పంటకు  తీవ్ర నష్టం వాటిల్లింది. సంబంధిత అధికారులు దృష్టి సారించి ఆదుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.  సాలూరు(మక్కువ): మండలంలో సోమవారం సాయంత్రం  ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారిలో మురుగునీరు ప్రవహిం చింది. గాలుల బీభత్సానికి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.  జీడి, మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కువ, సాలూరు రహదారిలో భారీ చెట్టు నేల కొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  రామభద్రపురం:  భారీ వర్షానికి కొట్టక్కి నుంచి జన్నివలస వెళ్లే మార్గంలో పెద్ద చెట్టు కూలిపోయింది. తీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం సాయంత్రం  ఇరు గ్రామస్థులు  చేయి చేయి కలిపి కూలిన చెట్టును తొలగించారు.


  

Updated Date - 2021-04-21T04:56:44+05:30 IST