ఆంగ్ల బోధనకు సన్నద్ధం

ABN , First Publish Date - 2022-03-21T07:10:27+05:30 IST

ఆంగ్ల మాద్యమంలో బోధన జరుగుతున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం సైతం కాలానుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో మిగిలిన అన్ని పాఠశాలలో ఆంగ్ల మాద్యమంలో బోధన, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుంది.

ఆంగ్ల బోధనకు సన్నద్ధం
మెంటర్స్‌కి శిక్షణ ఇస్తున్న దృశ్యం

ఫ కాలానుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వ ఆలోచన

ఫ పాఠ్య పుస్తకాల్లో ఇంగ్లీష్‌, తెలుగు కలిపి ముద్రణ

ఫ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల బోధన

ఫ వారితో నేటి నుంచి మే 7 వరకు విడతల వారిగా  

     ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

కామారెడ్డి టౌన్‌, మార్చి 20: ఆంగ్ల మాద్యమంలో బోధన జరుగుతున్న కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం సైతం కాలానుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో మిగిలిన అన్ని పాఠశాలలో ఆంగ్ల మాద్యమంలో బోధన, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వచ్చే సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుకు సమానంగా ఆంగ్ల మాద్యమం ప్రారంభించేందుకు సిద్ధమైంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని ప్రస్తుత రోజుల్లో ఆంగ్ల మాద్యమంలో బోధన జరిగే పాఠశాలలకు మాత్రమే పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలలు దూర ప్రాంతాల్లో ఉన్న ఆటోల్లో, ప్రైవేట్‌ వాహనాల్లో పంపుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొందరు మెంటర్స్‌కి శిక్షణ పూర్తి చేయించి వారితో జిల్లా ఉపాధ్యాయులకు నేటి నుంచి మే 7 వరకు శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఎస్‌జీటీలకు నేటి నుంచి ఏప్రిల్‌ 16 వరకు మొదటి బ్యాచ్‌, 28 నుంచి వచ్చేనెల 23 వరకు రెండో బ్యాచ్‌, ఏప్రిల్‌ 4 నుంచి 30 వరకు మూడో బ్యాచ్‌ శిక్షణ, స్కూల్‌ అసిస్టెంట్‌లకు, పీజీహెచ్‌ఎంలకు ఈ నెల 28 నుంచి వచ్చేనెల 23 వరకు మొదటి బ్యాచ్‌, వచ్చేనెల 11 నుంచి మే 7 వరకు రెండో బ్యాచ్‌ ఫిజికల్‌, వర్చువల్‌ శిక్షణ ఉంటుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

నేటి నుంచి తొలి విడత శిక్షణ


ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయడంతో పాటు ఉపాధ్యాయులకు సైతం బోధనకు సంబంధించిన శిక్షణను ఇచ్చేందుకు కృషి చేస్తోంది. ఇం దుకు అనుగుణంగా జిల్లాలో ఎస్‌జీటీలకు సంబంధించి ముగ్గురు కీ మెంటర్స్‌ హైదరాబాద్‌లో శిక్షణ పొంది జిల్లాలో 60 మంది మెంటర్స్‌కు సదాశివనగర్‌ మండలంలోని ఆదర్శ పాఠశాలల్లో శిక్షణను అందించారు. ఈ 60 మందిలో 58 మంది మెంటర్స్‌ను ఎంపిక చేసి వారితో జిల్లాలోని ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు నేటి నుంచి తొలి విడత శిక్షణను అందించనున్నారు. వీరితో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లకు సంబంధించి ఎనిమిది మంది కీ మెంటర్స్‌ శిక్షణ పూర్తిచేసి 51 మంది మెంటర్స్‌కు నేటి నుంచి శిక్షణను అందించనున్నారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఈ 51 మంది మెంటర్స్‌ జిల్లాలోని స్కూల్‌ అసిస్టెంట్‌లు, పీజీ హెచ్‌ఎంలకు శిక్షణ ఇవ్వనున్నారు.

21 కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ


ఆంగ్ల మాద్యమంలో బోధనలో మెలకువలు నేర్చుకున్న మెంటర్స్‌ ఎస్‌జీటీలకు జిల్లాలోని 17 కేంద్రాల్లో, స్కూల్‌ అసిస్టెంట్‌లకు 4 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. శిక్షణ పొందాల్సిన ఉపాధ్యాయుల్లో 1,067 స్కూల్‌ అసిస్టెంట్‌లు, పీజీ హెచ్‌ఎంలకు, 2,085 మంది ఎస్‌జీటీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆంగ్ల మాద్యమంలో పాఠ్యంశాలను ఎలా బోధించాలి అనే విషయాలపై విప్రో పర్యవేక్షణలో మెలకువలు నేర్చుకున్న మెంటర్స్‌ ఉపాధ్యాయులకు తర్ఫీదు నివ్వనున్నారు.

పాఠ్య పుస్తకాల ముద్రణపై చర్యలు


పాఠ్య పుస్తకాల ముద్రణను సైతం తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉండే లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒక పుస్తకంలో ఉండే పాఠ్యాంశాలు పక్కపక్కనే తెలుగు, ఆంగ్లంలో ఉంటాయి. దీంతో విద్యార్థులకు బోధన సులభతరం అవుతుందని ఆలోచన చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఆంగ్లమాద్యమంలో అర్థం కాని వారికి తెలుగు లో చదివి అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు వీలుంటుంది. అవసరమైన ఇండెంట్‌లను సైతం యూడైస్‌ ప్రకారం ఉన్న తాధికారులకు విద్యాశాఖధికారులు అందించనున్నారు.


ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు శిక్షణకు హాజరు కావాలి

ఫ రాజు, డీఈవో, కామారెడ్డి


మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంగ్ల మాద్యమంపై ఇటు పిల్లలు, అటు తల్లిదండ్రులకు మక్కువ పెరుగుతోంది. గతంలో కొన్ని పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం ప్రవేశపెట్టగా సత్ఫలితాలు వచ్చాయి. దీని ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఆంగ్లమాద్యమం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే మెంటర్స్‌కు శిక్షణ పూర్తి కాగా వారు నేటి నుంచి మే 7 వరకు విడతల వారిగా జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణను అందించనున్నారు. ఈ శిక్షణకు ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటిని తప్పకుండా అమలు చేస్తాం.

Updated Date - 2022-03-21T07:10:27+05:30 IST