కేవైసీకి మోదీ కొత్త నిర్వచనం

ABN , First Publish Date - 2020-11-27T07:33:06+05:30 IST

బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాల్లో ఉపయోగిస్తున్న కేవైసీ అన్న పదానికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు. ’’ప్రస్తుతం కేవైసీ అనేది అందరూ వాడుతున్న మాట. దీని అర్థం ’మీ కష్టమర్‌ను తెలుసుకోండి’ అని! డిజిటల్‌ భద్రతలో

కేవైసీకి మోదీ కొత్త నిర్వచనం

‘మీ రాజ్యాంగం గురించి తెలుసుకోండి’.. అందరిలో  దీనిపై అవగాహన పెరగాలి

సభాపతుల సదస్సులో మోదీ

అందరికీ న్యాయం అందడంలో ఖర్చే పెద్ద అడ్డంకి: రాష్ట్రపతి

దేశంలో 4 కోర్ట్‌ ఆఫ్‌ అప్పీళ్ల ఏర్పాటు..

అటార్నీ జనరల్‌ కీలక ప్రతిపాదన


న్యూఢిల్లీ, నవంబరు 26: బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాల్లో ఉపయోగిస్తున్న కేవైసీ అన్న పదానికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్త భాష్యం చెప్పారు. ’’ప్రస్తుతం కేవైసీ అనేది అందరూ వాడుతున్న మాట. దీని అర్థం ’మీ కష్టమర్‌ను తెలుసుకోండి’ అని! డిజిటల్‌ భద్రతలో ఇది చాలా ముఖ్యమైనది. ఇపుడు దీన్నే కొత్త రీతిలో ’మీ రాజ్యాంగం గురించి తెలుసుకోండి’ అని అనాలి’’ అని ఆయన ఉద్ఘాటించారు. సభాపతుల సదస్సులో చేసిన ముగింపోపన్యాసంలో ఆయన ఈ మాట అన్నారు. బుధవారం రాజ్యాంగ దినం కూడా కావడంతో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ’’రాజ్యాంగంలో చాలా అంశాలున్నాయి.


సామాన్యులకు సైతం ఇవి అర్థంకావాలి. యువతలో, ప్రజానీకం అందరిలో దీనిపై అవగాహన పెరగాలి. స్కూళ్లలో, కాలేజీల్లో, ఇతర విద్యా, సామాజిక వ్యవస్థల్లో రాజ్యాంగ అవసరాన్ని గురించి వివరంగా చెప్పాలి. రాబోయే తరాలకు తరచూ ఈ చైతన్య ప్రచారం సాగించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.  ’’రాజ్యాంగంలో, మన చట్టాల్లో ఉన్న భాష ఎవరికీ అర్థంకాని రీతిలో ఉంటోంది. ఏ ప్రజల కోసం వాటిని రూపొందించారో ఆ ప్రజలకు అర్థం కాదు. ఏదైనా సరళంగా ఉండాలి. వివిధ ప్రకరణలు సులభంగా అర్థం కావాలి. వీటిని సరళం చేయడంలో సభాపతులు చొరవ తీసుకోవాలి’ అని విజ్ఞప్తిచేశారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య రాజ్యాంగం విభజించిన అధికారాలను కాలరాసేందుకు ఒక దశలో ప్రయత్నాలు జరిగాయని ఆయన పరోక్షంగా ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేశారు. అయితే అందుకు రాజ్యాంగమే జవాబు చెప్పిందని, ఎమర్జెన్సీ తర్వాత మూడు వ్యవస్థలు గత అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత బలోపేతమయ్యాయని అన్నారు.  


ఉగ్రవాదంపై కొత్త తరహా పోరు

ముంబై దాడుల దినం సందర్భంగా ప్రధాని ఆనాడు ప్రాణాలర్పించిన పోలీసులకు, భద్రతా సిబ్బందికి నివాళులర్పించారు. ’పాక్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 2008లో ముం బైపై దాడి చేశారు. నాటి గాయాలను దేశం ఎన్నటికీ మరిచిపోదు. అందుకే ఇపుడు ఉగ్రవాదంపై కొత్త విధానంతో, కొత్తరీతిలో పోరాటం జరుపుతున్నాం’ అని పేర్కొన్నారు.


అందరికీ- ముఖ్యంగా సామాన్యులకు న్యాయం అందడంలో ఖర్చు పెద్ద అడ్డంకిగా మారిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. కోర్టు ఖర్చులు తడిసిమోపెడవంతో అనేక మంది న్యాయస్థానాలవైపు  చూడలేకపోతున్నారని, వారికి న్యాయం అందకుండా పోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విధులు నిర్వర్తించడాన్ని ఆయన కొనియాడారు. కాగా, అందరికీ న్యాయం అందడానికి, సుప్రీంకోర్టుపై కేసుల భారం  తగ్గడానికి దేశం నాలుగు మూలలా నాలుగు అప్పీళ్ల కోర్టులను ఏర్పాటు చేయాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సూచించారు. ’’సుప్రీంకోర్టంటే దేశంలోనే అత్యున్నత కోర్టు. ఇది ప్రధానంగా జాతీయాంశాలకు, రాజ్యాంగ పరమైన అంశాలకు మాత్రమే పరిమితం కావాలి. దురదృష్టవశాత్తూ వివాహ వివాదాలు, ఇళ్ల అద్దెల సమస్యలు, భూ వివాదాలు, బెయిల్స్‌, చిన్న చిన్న నేరాలకు సంబంధించిన సమస్యలపై కూడా సుప్రీంకోర్టు దృష్టి పెట్టాల్సి వస్తోంది.


ఇది ఆగాలి. అనేక దేశాల్లో 400 రకాల కేసులు అక్కడి సుప్రీంకోర్టుల దాకా అసలు రావు. కింది కోర్టుల్లోనే పరిష్కారమైపోతాయి. నా ఉద్దేశం హైకోర్టులోనే మెజారిటీ కేసులు ముగిసిపోవాలని చెప్పడం కాదు. ఒకవేళ హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలంటే - సుప్రీం దాకా అప్పీలు రాకూడదు. ఇందుకోసం- దేశంలో 4 చోట్ల ’కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌’లను ఏర్పాటు చేయాలి. అప్పీళ్లన్నీ ఈ కోర్టుల్లోనే అంతిమంగా పరిష్కారం కావాలి తప్ప సుప్రీం దాకా వెళ్లరాదు. ఈ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌లో ఒక్కో దా నిలో 15 మంది జడ్జీలుండాలి. వారి హోదా కూడా సుప్రీం జడ్జీలతో సమానంగా ఉండాలి. కొలీజియం ద్వారానే వారిని నియమించాలి’ అని వేణుగోపాల్‌ ప్రతిపాదించారు. 

Updated Date - 2020-11-27T07:33:06+05:30 IST