నవ్వుల రాజు.. వీరం, రౌద్రం!

ABN , First Publish Date - 2022-02-28T08:38:01+05:30 IST

హాస్యం అంటే నవ్వులాట కాదు. నవ్వించడం ఓ సవాలు. అందుకే నవ్వించేవాడిని యోగి అన్నారు. నవరసాల్లో మిగతా ఎనిమిది రసాలను మహాద్భుతంగా పండించగల ప్రతిభ ఉన్నోడే పొట్టచెక్కలయ్యేలా కడుపుబ్బ నవ్వించగలడనే ఆ బిరుదు ..

నవ్వుల రాజు.. వీరం, రౌద్రం!

  • బుల్లితెర హాస్యనటుడిగా జెలెన్‌స్కీ ప్రస్థానం
  • ఈ ఆదరణతోనే ఉక్రెయిన్‌కు అధ్యక్షుడిగా
  • ఇప్పుడు సైనిక దుస్తుల్లో వీధుల్లోకి జెలెన్‌స్కీ
  • తుపాకులు పట్టండంటూ పౌరుల్లో చైతన్యం


కీవ్‌, ఫిబ్రవరి 27: హాస్యం అంటే నవ్వులాట కాదు. నవ్వించడం ఓ సవాలు. అందుకే నవ్వించేవాడిని యోగి అన్నారు. నవరసాల్లో మిగతా ఎనిమిది రసాలను మహాద్భుతంగా పండించగల ప్రతిభ ఉన్నోడే పొట్టచెక్కలయ్యేలా కడుపుబ్బ నవ్వించగలడనే ఆ బిరుదు కాబోలు అనిపిస్తుంది. అదెలా అంటే.. అకారణంగా రణగర్జన చేసిన రష్యాకు తన వీర, రౌద్ర రసాలతో గుక్కతిప్పుకోకుండా చేస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తరహాలోనే! చిట్టి పొట్టి దేశం కదా.. ఒకట్రెండు రోజుల్లో చిటికెలో గెలిచేయొచ్చు అని ఉక్రెయిన్‌ మీద సైనిక చర్యతో ఉరిమిన పుతిన్‌కు జెలెన్‌స్కీ చుక్కలు చూపెడుతున్నారు. రష్యా దురాక్రమణకు భయపడి దేశాన్ని వదిలి పారిపోలేదు.. అధ్యక్ష భవనానికీ పరిమితం కాలేదు. సైనిక దుస్తులు ధరించి.. ఆయుధం చేతబట్టుకొని బయటకొచ్చారు.


బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న కీవ్‌ వీధుల్లో కలియతిరుగుతూ మీరూ ఆయుధాలు పట్టండి అంటూ పౌరులకు పిలుపునిస్తున్నారు. ఇంధ్రభవనం లాంటి అధ్యక్ష భవనం.. చిటికేస్తే అడిగివన్నీ సమకూర్చి పెట్టే నౌకర్లతో విలాసవంతమైన జీవితం.. ఇవన్నీ పక్కనబెట్టి స్వయంగా జెలెన్‌స్కీనే బయటకొస్తే అక్కడి పౌరుల్లో చైతన్యం ఎందుకు రగలదు? అందుకే ఉక్రెయిన్‌ ప్రజలూ తుపాకీ పట్టి రష్యా సైనికులను దీటుగా ఎదుర్కొంటున్నారు. యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు చెట్లు నరికి రోడ్లకు అడ్డంగా వేస్తున్నారు. యుద్ధ రంగంలో ఉక్రెయిన్‌-రష్యాలో ఏ దేశానికి ఆధిపత్యం? అనే మాటను పక్కనబెడితే బాధిత దేశాధ్యక్షుడిగా సంక్లిష్ట పరిస్థుతుల్లో జెలెన్‌స్కీ మాత్రం తన గుండె ధైర్యంతో ఇప్పుడు మిగతా ప్రపంచం ముందు అద్భుత రసాన్ని ఆవిష్కరిస్తున్నారు! బహుశా... ఈ నేర్పు ఆయనకు  హాస్య నటుడిగా ఉన్న అనుభవంతో అబ్బిందేమో.  అవును. అధ్యక్షుడు కాకమునుపు వొలొదిమిర్‌ వొలదిమిర్‌ జెలెన్‌స్కీ హాస్యనటుడు. టీవీ షోల్లో కామెడీ పాత్రలతో ప్రజలను తెగ నవ్వించేవారు. కీవ్‌ నేషనల్‌ ఎకనమిక్‌ యూనివర్సిటీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. ‘క్వార్టల్‌ 95’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను మొదలెట్టి.. సినిమాలు, టీవీ షోలు నిర్మించేవారు. నటించేవారు. అలా ఆయన నిర్మించి, ప్రధాన పాత్రలో నటించిన ఓ పాత్ర ఆయనకు విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టింది. అది ‘సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ అనే పేరుతో జెలెన్‌స్కీ స్వయంగా నిర్మించిన ఓ టీవీ షో.. 2015-18 మధ్య ప్రసారమైంది. చిత్రం ఏమిటంటే.. ఈ షోలో ఆయన, ఉక్రెయిన్‌ అధ్యక్షుడి పాత్రలో నటించారు.


హాస్యంతో పాటు అవినీతిని అంతం చేసేందుకు కృషి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సాగే పాత్ర కావడంతో జెలెన్‌స్కీకి ప్రజల్లో విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. ఈ స్ఫూర్తితోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తన టీవీ షో ‘సర్వెంట్‌ ఆఫ్‌ ది పీపుల్‌’ పేరుతోనే తన టీవీ బృందంతో కలిసి పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో దేశాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఒపీనియన్‌ పోల్స్‌లో ఆయనకే ఆధిక్యం కనిపించినా గెలుస్తారని ఎవ్వరూ అనుకోలేదు. అయితే.. ఆయనే అధ్యక్షుడైతే  టీవీ షోలోని పాత్ర తరహాలోనే అవినీతిని అంతమొందిస్తారని ప్రజలు గట్టిగా నమ్మి ఓట్లు కుమ్మరించారు. 73.2 శాతం ఓట్లతో జెలెన్‌స్కీ గొప్ప విజయం సాధించి ఉక్రెయిన్‌కు అధ్యక్షుడయ్యారు. అయితే వైరి వర్గం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయింది. దేశాన్ని నడపడం అంటే ‘జోక్‌’ కాదని ఎకసెక్కాలాడింది. ఆయనలో పరిపక్వత లేదని, ప్రపంచ స్థాయి నాయకత్వానికి ఏమాత్రం సరితూగే వ్యక్తి కాదని హేళన చేసింది. ఈ వాదనలో ఏమాత్రం పసలేదని.. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో జెలెన్‌స్కీ చూపుతున్న తెగువ చూస్తుంటే అర్థం కావడం లేదూ!! 


ఉక్రెయిన్‌ పట్టణాల్లోకి దూసుకొచ్చిన రష్యా సైన్యం. ఓ వైపు వీధి పోరాటాలకు ఉక్రెయిన్‌ ప్రజలు సిద్ధమవుతున్నారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 

Updated Date - 2022-02-28T08:38:01+05:30 IST