వంటింట్లో ధరల మంట

ABN , First Publish Date - 2021-10-22T07:09:07+05:30 IST

నిత్య జీవితంలో వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందకుండా పరుగులు పెడుతున్నాయి.

వంటింట్లో ధరల మంట
సూర్యాపేటలో బోసిపోయిన కూరగాయల వ్యాపారం

ఆకాశమే హద్దుగా నిత్యావసర సరుకుల ధరలు 

పప్పులు, కూరగాయల రేటుకు రెక్కలు

ఘాటెక్కిన ఉల్లి, వెల్లుల్లి

సామాన్యుడికి అందని సరుకులు

 నిత్య జీవితంలో వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందకుండా పరుగులు పెడుతున్నాయి. పెరిగిన ధరలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక సగటు మనిషి కుదేలవుతున్నాడు. సాధారణంగా మార్కెట్‌ విలువ ప్రకారం ఉండాల్సిన ధరలు అంతకు మించి రెట్టింపుస్థాయిలో పెరగడంతో సామాన్యుడు, మధ్య తరగతి కుటుంబాల నెలసరి ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది. సంపాదనలో సగానికిపైగా నిత్యావసరాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది.

 సూర్యాపేటటౌన్‌/కోదాడ

ఈయన పేరు ఎస్‌కె.పాష. కోదాడకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు. కరోనాకు ముందు వేతనం రూ.20,000 ఉంది. ఇంటి కిరాయి రూ4,500, నిత్యావసరాలకు రూ.5,000, కూరగాయలకు రూ.1,500, పాలకు రూ.2,250, సెల్‌ఫోన్‌ రీచార్జ్‌కు రూ.1000, పెట్రోల్‌కు రూ.900, పిల్లల చదువుకు నెలకు రూ.2,000 ఖర్చు చేసేవాడు. అదేవిధంగా కరెంటు బిల్లు రూ.600, టాబ్లెట్లకు రూ.900, దుస్తులకు రూ.1,000, మొత్తంగా నెలవారీ ఖర్చు రూ.19,650. ఇక మిగిలేది రూ.350. కుటుంబం అంతంతే నడిచేది. కరోనాతో వేతనంలో రూ.5,000 కోతపడింది. చేతికి రూ.15,000 వస్తోంది. దీనికి తోడు ధరల పెరుగుదలతో నిత్యావసరాలపై మరో రూ.1,700 అదనంగా, కూరగాయలపై రూ.500, పాలపై రూ.450, పెట్రోల్‌పై మరో రూ.300 మొత్తంగా నెలసరి ఖర్చు రూ.22,600కు పెరిగింది. దీంతో వేతనం సరిపడక నెలకు రూ.7,600 అప్పు చేయాల్సి వస్తోంది.


సామాన్యుల జీవితం అతలాకుతలం

నిత్యావసర సరుకుల ధరలు నింగిని అంటుతుండడం, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అందుకు పోటీపడుతుండడంతో జీవనం మరింత భారంగా మారింది. రెండు నెలల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఓ కారణమైతే, 20 రోజుల క్రితం కురిసిన వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతినడం మరో కారణం. నెల రోజుల క్రితం ఉన్నకూరగాయల ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి.


చుక్కలు చూపుతున్న పప్పులు, మిర్చి

పోషక విలువల్లో ప్రధానంగా శాకాహారులైనా, మాంసాహారులైన పప్పును అధికంగా వినియోగిస్తారు. గత ఏడాది పెసర పప్పు రూ.75 నుంచి రూ.80 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.100 నుంచి రూ.110కి విక్రయిస్తున్నారు. కంది పప్పు రూ.70 నుంచి రూ.80 ఉండగా, రూ.110కిపైగా విక్రయిస్తున్నారు. మినుములు రూ.75 నుంచి రూ.90 ఉండగా ఏకంగా రూ.130కి విక్రయిస్తున్నారు. శనగ పప్పు రూ.55 ఉండగా, రూ.80కి పైగా ఉంది. పప్పు దినుసులు సాగుచేసే ప్రాంతాల్లో అతివృష్టి కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి లేదు. ప్రధానంగా కంది, పెసర పంటలు రంగారెడ్డి, మెదక్‌, నాందేడ్‌ ప్రాంతాల నుంచి, మినపప్పు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుంటారు. అదే విధంగా రైతులు వరి, పత్తి సాగుపై మక్కువ చూపడం, పత్తి అంతర్‌పంటగా కంది సాగు చేయకపోవడంతో ఈ ఏడాది పప్పు దిగుబడి తగ్గింది. అదే సమయంలో పప్పు వినియోగం రోజు రోజుకూ పెరగడంతో ధ రలు ఆకాశాన్నంటుతున్నాయి.


ఉల్లి, వెల్లుల్లిదీ అదే దారి

వెల్లుల్లి రెండు నెలల క్రితం కిలో రూ.100లోపు ఉండగా, ప్రస్తుతం రూ.130కి పెరిగింది. గతంలో రూ.25 నుంచి రూ.30లోపు ఉన్న ఉల్లిగడ్డ నెల నుంచి రూ.60కి చేరింది. ఐదు కిలోల ఉల్లిగడ్డ బస్తా హోల్‌సేల్‌లో రూ.150లోపు ఉండగా, ప్రస్తుతం రూ.250 దాటింది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఉల్లిగడ్డ దిగుమతి అవుతోంది. ఎగువన అత్యధిక వర్షాలు, ఉల్లి సాగు లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వీటితో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో నిత్యావసర సరుకులపై వాటి ప్రభావం పడుతోంది. అంతేగాక మంచి నూనె గతంలో రూ.130ఉండగా, ప్రస్తుతం రూ.160 నుంచి రూ.170 వరకు ఉంది. పామాయిల్‌, శనగలు, మసాలా దినుసుల లాంటి సరుకులకు సాధారణ ధరలకు 10శా తం అధికంగా పెరిగి సామాన్యుడికి అందకుండా పోతున్నాయి.


కూరగాయల ధరలు పైపైకి

కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసినా, కూరగాయల సాగు లేకపోవడంతో దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. మధ్యతరగతి కుటుంబానికి వారానికి రూ.700 నుంచి రూ.800 ఖర్చు చేసినా సరిపడా కూరగాయలు రావడం లేదు. 15 రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు త్వరలో కార్తీకమాసంలో పూర్తి శాకాహారం, అయ్యప్పమాల పూజలు చేసే వారు సైతం అధిక మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ కూరగాయ కొనుగోలు చేయాలన్నా ఒకటికి, రెండుమార్లు ఆలోచించుకునే పరిస్థితి ఉంది.


కొరియర్‌, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌పైనా ‘పెట్రో’ భారం

కొరియర్‌, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ ఇబ్బందులు వర్ణనాతీతం. గంటల కొద్ది సమయం.. కిలోమీటర్ల కొద్ది ప్రయాణం చేసి, తమ టార్గెట్‌ పూర్తి చేసినా, అరకొర వేతనాలతో అవస్థలు పడుతూ పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.5వేల జీతం ఇస్తారు. ఇందులో సంస్థ పెట్రోల్‌కోసం ఇచ్చే రూ.50 సరిపోవు. అదనంగా మరో రూ.40 పెట్రోల్‌ పోయించుకోవాల్సి ఉంటుంది. దీంతో అదనంగా నెలకు రూ.1200 ఖర్చు అవుతుంది. వచ్చే జీతం రూ.5వేలతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనికి వెళ్లినా రోజుకు రూ.500 చెల్లిస్తారని, తమకు రూ.125 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. 


ఏం కొనలేకపోతున్నాం: రమణ, సూర్యాపేట

పెరిగిన ధరలతో ప్రస్తుతం ఏం కొనలేకపోతున్నాం. ముఖ్యంగా కూరగాయ ధరలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. గతంలో కిలోల చొప్పున కొనుగోలు చేసిన కూరగాయలు ప్రస్తుతం అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నాం. ఉల్లిగడ్డ కొనే పరిస్థితే లేదు.

Updated Date - 2021-10-22T07:09:07+05:30 IST