మేము సైతం....

ABN , First Publish Date - 2020-04-06T10:12:23+05:30 IST

కరోనాపై పోరులో నగరంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు తమ స్ఫూర్తిని ఘనంగా చాటిచెప్పారు.

మేము సైతం....

జాతి ఐక్యతకు జ్యోతులు వెలిగించిన జిల్లా ప్రజానీకం

సరిగ్గా 9 గంటలకు విద్యుత్‌ దీపాలు బంద్‌

బాల్కనీలు, వీధుల్లోకి వచ్చిన జనం

నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి తొమ్మిది నిమిషాలపాటు నినాదాలు

కరోనా వైరస్‌ చీకటిని తరిమికొడతామని పిలుపు

బాణసంచా కాల్చిన యువత


విశాఖపట్నం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో నగరంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు తమ స్ఫూర్తిని ఘనంగా చాటిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిమిషాలపాటు ఇళ్లల్లో విద్యుత్‌ దీపాలను ఆపేసి, చమురు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ ఫోన్ల ఫ్లాష్‌ లైట్లు వెలిగించి కరోనా మహమ్మారిని తరిమేద్దామని నినదించారు. పలుచోట్ల బాణసంచా కాల్పారు. ఇళ్లలోని లైట్లన్నింటినీ ఒక్కసారిగా  ఆపేసి, దీపాలు వెలిగించడంతో నగరం కొత్తశోభను సంతరించుకుంది.


అపార్టుమెంట్లలో నివాసం వుంటున్నవారు సెల్లార్లు, బాల్కనీల్లో నిల్చుని దీపాలు వెలిగించారు.  కాలనీలు, వీధులు, ప్రధాన రహదారులు... ప్రతిచోటా ఇళ్లల్లో తొమ్మిది నిమిషాలపాటు విద్యుత్‌ దీపాలను ఆపివేసి, నూనె దీపాలను పట్టుకుని నిల్చున్నారు. పలుచోట్ల యువకులు బాణసంచా కాల్చుతూ కరోనాపై పోరులో మనమే విజయం సాధిస్తామంటూ నినదించారు. కరోనా చీకట్లను చీల్చుకుంటూ వస్తున్న కాంతి పుంజంలా నగరం ప్రకాశించింది. 


దీపాలు వెలిగించిన పలువురు ప్రముఖులు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధారలోని నివాసంలో తన సతీమణితో కలిసి దీపాలు వెలిగించారు. రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి పార్టీనేత కేకేరాజుతో కలిసి సీతమ్మధారలోని తన క్యాంప్‌కార్యాలయంలో దీపాలు వెలిగించి కోరానాపై పోరుకు తన సంఘీభావం తెలిపారు. ఎంవీ ఎంవీవీ సత్యనారాయణ లాసన్స్‌బే కాలనీలోని తన నివాసంలో కుమారుడితో కలిసి ఇంటి బయట దీపాలు వెలిగించారు. నగరంలో జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన బంగ్లాలో నెలరోజుల వయసున్న కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి బాల్కనీలోకి వచ్చి దీపాలను వెలిగించి కోరోనాపై పోరాటంలో తాము కూడా భాగస్వామ్యులమేనని చాటారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తన బంగ్లాలో కుటుంబ సభ్యులతో కలిసి లైట్లు ఆపేసి దీపాలు వెలిగించి ప్రధాని మోదీ పిలుపుకి సంఘీభావం తెలిపారు.


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని తన ఇంట్లో లైట్లు ఆపేసి కుటుంబంతో కలిసి బాల్కనీలో దీపాలు వెలిగించారు. తూర్పునావికాదళం ప్రధాన కార్యాలయంలో నేవీ అధికారులు ఐఎన్‌ఎస్‌ జలాశ్వపై దీపాలు వెలిగించి కరోనాపై పోరాటంలో దేశం వెంట తామున్నామంటూ సందేశం ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఏడీసీపీ ఆదినారాయణ ఆధ్వర్యంలో మద్దిలపాలెం కూడలి వద్ద కొవ్వొత్తులు, ఫోన్‌ ఫ్లాష్‌ వెలిగించి తమ సంఘీభావం తెలిపారు.


రూరల్‌ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, అనకాపల్లిలో ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిపి దీపాలు వెలిగించారు. ఇంకా చోడవరం, పాడేరు, అరకులోయ, ఎలమంచిలి, పాయకరావుపేట వంటి పట్టణ ప్రాంతాలతోపాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా ప్రజలు విద్యుత్‌ దీపాలను ఆపేసి నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. 

Updated Date - 2020-04-06T10:12:23+05:30 IST