Abn logo
Aug 12 2020 @ 07:17AM

సిఫారసు ఉంటేనే ‘కార్పొరేట్‌’ బెడ్‌

కొవిడ్‌ బాధితులకు తీవ్ర ఇబ్బందులు

104కు ఫోన్‌ చేస్తే బెడ్‌లు ఖాళీ వున్న ఆసుపత్రుల వివరాలు వెల్లడి

ఆయా ఆసుపత్రులను సంప్రదిస్తే బెడ్‌లు లేవని సమాధానాలు

రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పరిస్థితిలో కానరాని మార్పు

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే అనుమానాలు

అమలుకు నోచుకోని ముఖ్యమంత్రి ఆదేశాలు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ’వైరస్‌ బాధితులు ఎవరైనా బెడ్‌ కావాలని వస్తే.. అర్ధ గంటలో బెడ్‌ కేటాయించాలి. ఈ మేరకు జిల్లా స్థాయిల్లో అధికారులు ఏర్పాట్లు చేయాలి. ఎవరికీ బెడ్‌ దొరకలేదన్న పరిస్థితి రాకూడదు’ ఇదీ కొద్ది రోజుల కిందట కొవిడ్‌పై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశం. 


 ‘నగరానికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్‌ బారినపడ్డాడు. రెండు రోజుల నుంచి పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో బెడ్‌ ఖాళీలు వివరాలు తెలుసుకునేందుకు 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశాడు. నగరంలోని రెండు, మూడు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని అటు నుంచి సమాధానం రావడంతో ఆస్పత్రిలో చేరేందుకు అక్కడి సిబ్బందిని సంప్రదించాడు. అయితే, ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవన్న సమాధానమే ఆ ఆస్పత్రుల నుంచి వచ్చింది. అసలే, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అయిన వ్యక్తి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు’ 


ఇదీ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసం. పడకలు అడిగిన ప్రతి ఒక్కరికీ అర గంటలోనే కేటాయించాలని ముఖ్యమంత్రి చెబుతుంటే, అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేశామని.. పడకలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా స్థాయిలో అధికారులు పేర్కొంటున్నారు. అందుకు అనుగుణంగానే లెక్కలు చూపిస్తున్నారు. కొవిడ్‌ డాష్‌ బోర్డులో పడకల ఖాళీల వివరాలను చూపిస్తున్నారు. అయితే, వాస్తవంగా పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పడకలు కోసం గంటలు, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.


ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పడకలు దొరకడం లేదు. దీంతో చాలామంది వైరస్‌ బారినపడినప్పటికీ ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది ఆస్పత్రులకు చేరేందుకు సిద్ధమవుతున్నప్పటికీ పడకలు లేవన్న సమాధానమే కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటోంది. కొవిడ్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తే గానీ.. అటువంటి వారి ప్రాణాలు నిలిచే పరిస్థితి లేదు. దీంతో అటువంటి వారంతా ఆస్పత్రుల్లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఎక్కడ అడిగినా పడకలు సిద్ధంగా లేవని, నిరీక్షించాలన్న సమాధానమే చాలా మందికి వినిపిస్తోంది. 


సిఫారసు ఉంటేనే.. 

ముఖ్యంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పడకలు కావాలంటే.. ఉన్నత స్థాయిలో సిఫారసు ఉండాల్సి వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి అధికారులు చెప్పిన వారికే పడకలు అందుబాటులో ఉంటున్నాయి. సాధారణ ప్రజలు డబ్బులు కట్టి వైద్యం చేయించుకునేందుకు సిద్ధపడుతున్నా.. చాలా చోట్ల లేవన్న సమాధానమే వస్తోంది. కొన్నిచోట్ల పడకలు ఖాళీగానే ఉన్నా.. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అధికారులు చెబుతున్న ఖాళీ బెడ్స్‌ వివరాలు పేపర్లకే పరిమితం కాకుండా,  క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 


Advertisement
Advertisement
Advertisement